Movies | Music | Masti Close Aha Ad
Movies | Music | Music



South Indian Film Industry Strike - Why? Who will gain and who will loose?

ఆగిన సినిమా: అసలు కథేంటి..స్క్రీన్ ప్లే ఎవరిది?..ఎవరికి లాభం, ఎవరికి నష్టం

ప్రతీ శుక్ర వారం విడుదలయ్యే కొత్త చిత్రాల కోసం సిని ప్రేమికులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూంటారు. అయితే ఈ రోజు (మార్చి 2) నుంచి థియేటర్లలోకి కొత్త బొమ్మ ఆగిపోయింది. థియేటర్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. ఇది సామాన్య ప్రేక్షకుడుకి వినడానికి షాకింగ్‌గానే ఉంటుంది. ఎందుకీ పరిణామం అంటే.. డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు (క్యూబ్, యూఎఫ్‌ఓ), నిర్మాతల మధ్య ధర విషయంలో చర్చలు ఓ కొలిక్కి రాలేదని చెప్తున్నారు. అలాగే 'వర్చ్యువల్‌ ఫీజు' సైతం తగ్గించాలని నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో అసలు సినిమాని తీసేది నిర్మాతలు, రిలీజ్ చేసేది డిస్ట్రిబ్యూటర్స్ కదా మధ్యలో ఈ డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు ఎవరు, వాళ్లకు 'వర్చ్యువల్‌ ఫీజు' కట్టటమేంటి అనే విషయం సామాన్యుడుకి అర్దం కావటం లేదు. ఈ విషయమై 'రాగలహరి' అందిస్తున్న స్పెషల్ ఆర్టికల్.

డిజిటల్‌ సర్వీసు ప్రొవైడర్లు అంటే ఎవరు..?

ఒకప్పుడు సినిమా రీళ్లు (ప్రింట్) లు వుండేవి. సినిమా హక్కులు కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు తమకు ఎన్ని అవసరమో .. ఆ మేరకు డబ్బు పే చేసి... అన్ని ప్రింట్స్ తీసుకుని వెళ్లి , తమ తమ ఏరియాలో థియోటర్స్ లో వేసుకునేవారు. తరువాత డిజిటల్ సిస్టమ్ వచ్చింది. అయితే సినిమా ప్ర‌ద‌ర్శ‌న అంతా డిజిట‌ల్ మ‌యం అయిపోయింది. దాంతో ప్రింట్ లు మాయం అయ్యాయి. ప్రింట్స్ ప్లేస్ లో క్యూబ్, యుఎఫ్ఓ ఇలా పలువురు సర్వీస్ ప్రొవైడర్లు వచ్చారు. వీళ్లు థియేటర్లకు తమ సర్వీస్ అందించే విధంగా అగ్రిమెంట్ లు చేసుకున్నారు. అంటే వీళ్ల ద్వారా సినిమాలు ప్రదర్శితం అవుతాయన్నమాట. నిర్మాణం పూర్తిచేసుకున్న‌ సినిమాలన్ని ఈ డిజిటల్‌ సర్వీసు ప్రొవైడర్లు థియేటర్లకి చేరవేస్తుంటారు. వీళ్లే డిజిటల్‌ సర్వీసు ప్రొవైడర్లు.

ఇలా తమ ద్వారా థియోటర్స్ కు సినిమాను ప్రదర్శించినందుకు గానూ వారానికి ఇంత చొప్పున అద్దె తీసుకొంటుంటారు. తెలుగు రాష్ట్రాల్లో యు.ఎఫ్‌.ఓ, క్యూబ్‌, పి.ఎక్స్‌.డి సంస్థలు డిజిటల్‌ సర్వీసు ప్రొవైడర్లుగా వ్యవహరిస్తున్నాయి.

'వర్చ్యువల్‌ ప్రింట్‌ ఫీజు' అంటే

నిర్మాత ఇచ్చిన సినిమాని (డిపిఎక్స్ ఫార్మెట్స్..2కె రెజిల్యూషన్..) సర్వీర్ ప్రొవైడర్స్ .. తమ ప్రొజెక్టులో ప్లే అయ్యేందుకు ...క్యూబ్ వాళ్లు అయితే క్యూబ్ ఫార్మెట్ లోకి, మిగతా వాళ్లు మిగతా ఫార్మెట్ లోకి కన్వర్షన్ చేయటానికి అయ్యే ఖర్చు నే 'వర్చ్యువల్‌ ప్రింట్‌ ఫీజు' అంటారు. మొదట్లో వారానికి రూ. 7500 వీపీఎఫ్‌ వసూలు చేసేవారు. ఇప్పుడది దాదాపు రూ. 30 వేల దాకా పెంచేశారు. అది చాలా భారంగా మారింది.

అయితే ధియోటర్ ని ఈ డిజైజేషన్ చేయటానికి పెట్టే ఖర్చు కాస్త ఖరీదైనది కావటంతో...ఆ ఎక్విప్‌మెంట్‌ కోసం తాము పెట్టిన ఖర్చు వచ్చేవరకూ 'వర్చ్యువల్‌ ప్రింట్‌ ఫీజు' (వీపీఎఫ్‌) వసూలు చేస్తామనీ, ఆ తర్వాత ఉచితంగా సేవలందిస్తామని మొదట్లో సర్వీస్ ప్రొవైడర్స్ మొదట్లో చెప్పారు. కానీ వాళ్లు అలా చేయటం లేదు.

దీనికి తోడు అద్దెలు

థియేటర్లలో హాలీవుడ్‌ సినిమా విడుదల చేస్తే ప్రొవైడర్లకు అద్దెగా ఏమీ చెల్లించనక్కర్లేదు. బాలీవుడ్‌ సినిమాలకు అద్దె చాలా లిమెటెడ్ గా ఉంటుంది. అదే మన రీజినల్‌ సినిమాలకు వారానికి రూ.10 నుంచి పదమూడు వేలు దాకా థియోటర్ ని బట్టి చెల్లించాలి. అందులోనూ పెద్ద, చిన్న సినిమాలు అనే తేడా ఉండదు. చాలా సార్లు చిన్న సినిమా బాగలేకపోవటమో, జనాలు రాకపోవటమో జరిగితే.. ఒక్కరోజులోనే థియేటర్‌ నుంచి మాయం. అలాంటప్పుడు ఆ సినిమా కోసం కట్టిన డబ్బులు వెనక్కీ ఇవ్వరు. ఇది చిన్న సినిమా నిర్మాతలకు తలకు మించిన భారంగా మారింది.

డిజిటల్‌ వ్యవస్థ మొదలైందిలా...

ఇక ఈ డిజిటల్‌ టెక్నాలజీ సినిమా ప్రపంచంలోకి రావటం మొదట అమెరికాలో 2000 సంవత్సరంలో మొదలైంది. 'సొసైటీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ అండ్‌ టెలివిజన్‌ ఇంజనీర్స్‌ ఆధ్వర్యంలో .. అమెరికాలోని డిస్నీ, ఫాక్స్‌, ఎంజీఎం, పారామౌంట్‌, సోనీ పిక్చర్‌, యూనివర్సల్‌, వార్నర్‌ బ్రదర్స్‌ స్టూడియోలు కలసి ఓ అంగీకారానికి వచ్చి 'డిజిటల్‌ సినిమా ఇన్‌షియేటివ్‌' (డీసీఐ)గా ఏర్పడ్డాయి. 2002లో ఈ సర్వీస్‌ మొదలైంది.

మనదేశంలో అయితే..

మనదేశంలో డిజిటల్‌ ఫార్మట్‌లో తొలి చిత్రం మణిరత్నం 'గురు'(2007). ఈ డిజిటల్ ఫార్మెట్ వచ్చే వరకూ ఒక సినిమా ప్రింట్‌ తీయడానికి రూ.60 నుంచి 70 వేల వరకూ ఖర్చయ్యేది. పెద్ద సినిమాకు కనీసం 400 పైగా ప్రింట్లు తీసేవారు. ఆ ఖర్చుతో పోలిస్తే డిజిటల్‌ సినిమాకు తక్కువ వ్యయమవుతుండటంతో డిస్ట్రిబ్యూటర్స్‌ అంతా ఉత్సాహంగా అటువైపు మొగ్గు చూపారు. అయితే కొత్త టెక్నాలజీ ఎంత వరకూ లాభిస్తుంది అనే కొంత భయమూ ఉంది.

దానికి తోడు డిజిటల్ సర్వీస్ కు అనుగుణంగా థియేటర్ల ప్రొజెక్షన్ సిస్టమ్ ను అప్ గ్రేడ్ చేసుకోవాల్సివుంది. అదెవరు చేసుకోవాలి. థియేటర్ల ఓనర్లు చేసుకోవాలి. దానికి బాగానే ఖర్చవుతుంది. దాంతో ఈ డిజిటల్ ప్రింట్స్ ఎల్లకాలమూ ఉంటాయా..ఎంతో ఖర్చుపెట్టి తమ థియోటర్స్ ని వాటికి అణుగుణంగా మారిస్తే నష్టపోతామా అని ఆలోచించారు ఎగ్జిబిటర్స్. అప్పుడు 'డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌' (డి.ఎస్‌.పి.లు) రంగప్రవేశం చేసి ' అబ్బే...డిజిటలైజేషన్‌ కోసం మీరేం ఖర్చు పెట్టనక్కర్లేదు. మీ థియేటర్‌ మాకు అప్పగిస్తే చాలు. అన్నీ మేమే మార్చేస్తాం..తర్వాత చూసుకుందాం' అని చెప్పారు. అదీ ఎగ్రిమెంట్ ప్రకారం ఇనస్టాలమెంట్ బేసెస్ లో వసూలు చేస్తున్నారు.

సమస్య ఏమిటి?

డిజిటలైజేషన్ జరిగిన తరువాత, ఫిలిం ఖర్చులు, ప్రాసెసింగ్ ఖర్చులు తగ్గాయి అని అందరూ సంబర పడ్డారు. కానీ మెలమెల్లగా థియేటర్లు అన్నీ డిజిటలైజేషన్ జరిగిపోయిన తరువాత డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు అయిన క్యూబ్, యుఎఫ్ఓ, పిఎక్స్ డీ వంటివి చార్జీలు పెంచడం ప్రారంభించాయి. దాంతో నిర్మాతలు ఊహించని ఈ పరిణామానికి గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు జరిగినంతగా సీరియస్ గా ఎప్పుడూ తీసుకోలేదు. అయితే పరిస్దితి చేయిదాటిపోతోందని ఈ బంద్ నిర్ణయం తీసుకున్నారు.

హాలీవుడ్ పద్దతేంటి

హాలీవుడ్‌లో ఉండే సర్వీస్‌ ప్రొవైడర్ల వ్యవస్థ నియమ నిబంధనల ప్రకారం తమ సినిమాను థియేటర్లలో ప్రదర్శించేందుకు గానూ నిర్మాతలు సర్వీస్‌ ప్రొవైడర్లకు ఐదేళ్ళు పాటు అద్దె చెల్లిస్తారు. ఐదేళ్ల తర్వాత ఉచితంగా వారు సేవలందించాలి. అదే పద్దతి దక్షిణాది చిత్రసీమలో కూడా అమలు చేస్తామంటూ.. సర్వీస్‌ ప్రొవైడర్లు అవే ఆ నిబంధనతోనే వచ్చారు. కానీ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారన్నది నిర్మాతల ఆరోపణ.

ముఖ్యంగా స‌ద‌రు సంస్థలు గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ప్రొడ్యూస‌ర్స్‌, డిస్ట్రిబ్యూట‌ర్స్ నుంచి అధిక మొత్తం వసూలు చేస్తున్నాయని నిర్మాత‌లు ఆరోపిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో వారానికి రూ.2500 అద్దె తీసుకొంటున్నారు. అయితే మన దగ్గర మాత్రం రూ.10,800 తీసుకొంటున్నారని నిర్మాతలు చెబుతున్నారు. మల్లీప్లెక్స్‌ల్లో అయితే రూ.13 వేల వ‌ర‌కు వసూలు చేస్తున్నారు. ఒక్క షో వేసినా కూడా ఏడు రోజులకి డబ్బులు వసూలు చేస్తున్నారని.. దీనివల్ల నిర్మాతలు చాలా నష్టపోతున్నారనే వాదన వినిపిస్తోంది.

ఈ విషయంపై చాలా కాలం నుంచి నిర్మాతలు గళమెత్తుతున్నా పట్టించుకోవడం లేదు. చివరకు నిర్మాత మండళ్లు ఈ సమస్య పరిష్కారానికి ఐక్య కార్యాచరణ కమిటీ వేసి చర్చించినా ఓ కొలిక్కి రాలేదు. అందుకే ఈ బంద్ ప్రకటించారు.

నిర్మాతల వాదన

‘‘2007–2008 కాలం నుంచి సినిమా ప్రింట్ నుంచి డిజిటల్ లోకి మారుతూ వచ్చింది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు ముందు ఉచితంగానే థియేటర్లలో డిజిటల్ ప్రొజెక్టర్లు ఏర్పాటు చేశారు. ఐతే పెట్టుబడి వెనక్కి రాబట్టుకునేందుకు వర్చువల్ ప్రింట్ ఫీజు రోజుకు ఇంత అని నామమాత్రంగానే చెల్లించమని.. ఐదేళ్ల తర్వాత చెల్లించాల్సిన అవసరం లేదని.. ప్రకటనల రూపంలో మేం ఆదాయం సమకూర్చుకుంటామంటూ చెప్పారు. కానీ పదేళ్లు గడిచినా ఫీజులు మాఫీ చేయలేదు. భారీ రేట్లు పెడుతున్నారు. రేటూ తగ్గించట్లేదు. ప్రకటనల ద్వారా అధిక ఆదాయం పొందడంతో పాటు వీపీఎఫ్ అధికంగా వసూలు చేస్తున్నాయి. ఇది సినిమా వర్గాలకు భారంగా మారుతోంది. కొన్ని సినిమాలకు వీపీఎఫ్ డబ్బులు కూడా రాని పరిస్థితి నెలకొంది" అంటున్నారు వాళ్లు.

నిర్మాతల డిమాండ్లు

సమస్య పరిష్కారం కోసం ఐక్య కార్యాచరణ కమిటీ డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ ముందు ప్రధానంగా మూడు డిమాండ్లు ఉంచింది. మొదటిది.. వెంటనే వీపీఎఫ్‌ తగ్గించాలి, లేదా రద్దు చేయాలి. రెండోది... అలాగే సినిమా ప్రారంభంలో, మధ్యలో వేస్తున్న ప్రకటనలను ఎనిమిది నిమిషాలకు పరిమితం చేయాలి. మూడోది.. రెండు కొత్త సినిమాల ట్రైలర్స్‌ ప్రతి సినిమాతో ఉచితంగా ప్రదర్శించాలి.

ఇదో టాక్

ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో ,మీడియాలో ఇంకో టాక్ నడుస్తోంది. డిష్‌టీవీకి చెందిన డిజిటల్‌ సర్వీస్‌ప్రొవైడర్లు ఇండిస్టీలోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాము చిన్న నిర్మాతలకు లాభసాటిగా ఉంటామనీ, కొన్ని సినిమాలకు ఉచితంగా సర్వీస్‌ను అందిస్తామని చెప్పటంతో కొంతమంది అటువైపుకు మొగ్గు చూపే ఆలోచనలో ఉన్నాయి.

బంద్ ప్రభావం ఏమిటి ,ఎవరికి నష్టం

నిజానికి ఇది సినిమాలకు అన్ సీజన్. ఒకరకంగా థియేటర్లలో ఇప్పటికే అనధికారిక బంద్ నడుస్తోంది. ఒక్క సినిమా ఆడట్లేదు. ఈ వీకెండ్ ఒక్క సినిమా కూడా విడుదల కావట్లేదు. ఇలాంటి టైమ్ లో థియేటర్లు బంద్ పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే. కాబట్టి పెద్దగా ఎవరూ నష్టపోయేది లేదు. సిని పరిశ్రమ కూడా ఏమీ స్దంబించదు. ఎందుకంటే... సినిమా నిర్మాతలు సినిమా షూటింగ్లు ఆపకుండా కేవలం సినిమా ప్రదర్శనను మాత్రమే నిలిపివేశారు. దీంతో సినిమా నిర్మాతలకు వచ్చే నష్టం ఏమి లేదు. దానికి తోడు గత రెండు వారాలుగా అసలు ఏ సినిమా కూడా పెద్దగా పే చెయ్యటం లేదు. ఏమన్నా నష్టపోతే ...ఆ నష్టం వచ్చేది సినిమా హాల్ యజమానులే. ఇప్పుడు ఈ అన్ సీజన్ లో సినిమాలు రిలీజ్ చేసినా వచ్చే కలెక్షన్స్ అంతంత మాత్రం కాబట్టి ఇది ఓ రకంగా ఎగ్జిబిటర్స్ కు రిలీఫే.

ADVERTISEMENT
ADVERTISEMENT