Movies | Music | Masti Close Aha Ad
Movies | Music | Music

Nandamuri Balakrishna's Paisa Vasool Movie Review

September 1, 2017
Bhavya Creations
Nandamuri Balakrishna, Shriya Saran, Vikramjeet Virk, Musskan Sethi, Kyra Dutt, Kabir Bedi, Alok Jain, Prudhviraj
Mukesh G
Junaid Siddiqui
Puri Jagannadh
Anoop Rubens
V Anand Prasad
Puri Jagannadh

తేడా... సింగ్ ( బాలకృష్ణ ‘పైసా వసూల్’ రివ్యూ)

సినిమా మొదటి నుంచి చివరి దాకా పండుగాడులా కలరించి ఇచ్చి అందరినీ పల్టీలు కొట్టించి చివర్లో నేను పండుగాడుని కాదు మీ బెండు తీసే పోలీస్ ఆఫిసర్ ని అంటూ పోకిరిలో మహేష్ బాబు అంటే ఆ మజానే వేరు అని ఎగబడి చూసాం. అలాగే పోకిరి టు పోలీస్ క్యాకర్టర్ కు మహేష్ బాబు ఫెరఫెక్ట్ అని డిసైడ్ చేసేసాం. అయితే ఆ తర్వాత ఎప్పుడైనా టీవిలో పోకిరి ని మళ్లీ చూస్తున్నప్పుడు ఈ సినిమా మహేష్ కాకుండా మరే తెలుగు హీరో అయినా చేస్తే ఎలా ఉంటుంది... అనే పోకిరి ఆలోచన రేగి నవ్వుకుని ఉండచ్చు. కానీ మనం నవ్వుకుని వదిలేసిన ఆ ఆలోచనని పూరి కంటిన్యూ చేసాడు...పోకిరికు ఇంకో వెర్షన్ రెడీ చేసేసాడు. అందులోనూ బాలయ్య వేరే హీరోల సినిమాలు చూడనని పదేపదే చెప్తూ ఉంటారు. ఇంకే భేషుగ్గా ఈ కథని బాలయ్యతో చేసేయచ్చు అని ఫిక్సేపోయాడు. మరి మరీ..పోకిరిని బాలయ్యతో అంటే టూమచ్ గా అనిపించటం లేదు...అలా టూమచ్ గా అనిపించకుండా పైసా వసూల్ అయ్యేలా ...పూరీ ఏం మార్పులు చేసారు..ఆ మార్పులతో కొత్త సినిమా రెడీ అయ్యిందా...పాత పోకిరినే మళ్లీ పలకరించిందా.. 'పోకిరి 2.0' గా మారిందా.. రివ్యూలో చూద్దాం.

కథేంటి

ఇంటర్నేషనల్ డాన్ బాబ్‌మార్లే(విక్రమ్‌జీత్‌) కో ముద్దుల త‌మ్ముడు స‌న్ని(అమిత్‌). సన్ని.. ఇండియ‌న్ రా అథికారి చేతిలో చనిపోతాడు. దాంతో తమ్ముడు మీద ప్రేమ, సెంటిమెంట్ తో ఇండియాపై పగపడతాడు బాబ్. ఇక్కడ విధ్వసం సృష్టించాలని పోర్చుగల్ లో ఉండి ప్లాన్ చేస్తాడు. అందులో భాగంగా హైదరాబాద్ లో బాంబ్ పేలుళ్లు జరుపుతాడు. పనిలోపనిగా పోలీస్ అధికారులను లేపేస్తూంటాడు. అయితే బాబ్ ని పట్టుకోవాలంటే మన చట్టాలు, ప్రభుత్వాలు,అందులోని అవినీతి వ్యక్తుల అడ్డంగా నిలుస్తాయి. దాంతో ముల్లుని ముల్లుతోనే తీయాలని ... ‘రా’ అధికారి(కబీర్‌బేడి) ఫిక్స్ అవుతాడు. అప్పుడు వాళ్లకు తీహార్ జైల్ నుంచి బయిటకు వచ్చిన తేడాసింగ్‌ (బాలయ్య) తగులుతాడు. పేరుకి తగ్గట్లే తేడా..తేడాగా బిహేవ్ చేసే అతనితో బాబ్ ని చంపేందుకు డీల్ కుదుర్చుకుంటుంది ‘రా’ . ‘రా’ రమ్మని పిలవటంతో ఆ మిషన్ మీద బయిలుదేరతాడు తేడాసింగ్‌. అక్కడ నుంచి ఏం జరిగింది... అసలు ఈ తేడా సింగ్ ఎవరు...తీహార్ జైలుకు ఎందుకు వెళ్లాడు.. ఆ మాఫియాడాన్‌ను తేడాసింగ్‌ తుదముట్టించాడా? ఈ కథలో హీరోయిన్స్ స్దానం ఏది?..తదితర విషయాలను తెరపై చూడాల్సిందే.

ఓరి నీ 'పోకిరి' వేశాలో...

వాస్తవానికి కెరీర్ లో వంద కథలు ఇప్పటికే చేసేసిన బాలయ్యతో ఏ కథ అనుకున్నా అది ఆయన పాత సినిమా కథనే టచ్ చేసే అవకాసం ఉంటుంది. దాంతో ఆయనకు కథ వండటమంటే పూరి జగన్నాథ్ కు కూడా కాస్త కష్టమే అనిపించి ఉండవచ్చు. అందుకేనేమో ఆయన ఎలాంటి రిస్క్ లేకుండా తన పాత హిట్ పోకిరిని బాలయ్యతో చేస్తే ఎలా ఉంటుందో అని ఊహించుకున్నారు. ఊహించుకున్నప్పుడు ఖచ్చితంగా నవ్వు వచ్చి ఉంటుంది కానీ.. కథ రాసినప్పుడు సీరియస్ అనిపించి ఉంటుంది. బాలయ్య కూడా తన సినిమాల ఫ్లాష్ బ్యాక్ లో ఎప్పుడూ సీక్రెట్ ఏజెంట్ ట్విస్ట్ చేయలేదు కాబట్టి ఇది కొత్త కథ అని ఫీలయ్యి ఉంటారు. అంతా బాగానే ఉంది కానీ...అదే చూసినట్లు అనిపించింది అందుకే.

అక్కడే తేడా కొట్టేసింది

ఫ‌స్టాఫ్ వ‌ర‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, బాల‌య్య స్టైల్‌, లుక్స్‌, కొత్త మేన‌రిజ‌మ్స్‌తో సినిమాను యమ స్పీడిగా లాగేసిన పూరి సెకండాఫ్‌లో దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. కథలేని సినిమాని స్క్రీన్ ప్లే రాయటం ఎంత కష్టమో అనిపిస్తుంది ఈ సీన్స్ చూస్తూంటే. చాలా పేలవంగా నడిచే సీన్స్ తో బోర్ కొట్టడం మొదలవుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ అందరూ ఊహించేదే కాబట్టి పెద్దగా పేలలేదు.

బాలయ్యా..క్రెడిట్ నీదేనయ్యా

ఈ సినిమాని మొదటి నుంచి చివరి వరకూ చూడగలిగాము అంటే అది బాలయ్య గొప్పతనమే. అంత రొటీన్ కథని తన డిఫరెంట్ మ్యానరిజంలుతో , డైలాగ్ డెలవరీతో భుజ‌స్కంధాల మీద లాక్కువ‌చ్చాడు. కానీ ఆయన భుజాలు నొప్పి వచ్చినట్లున్నాయి..అక్కడక్కడా వదిలేసారు. అప్పుడు అది మన భుజం ఎక్కడంతో దాన్ని మనం మొయ్యలేక నొప్పి మొదలవుతుంది.

పాపం ..వాళ్లకా అవకాసం ఏదీ

ఉన్నంతలో శ్రియ ..సినిమాలో హీరోయిన్ గా రిజిస్టర్ అయ్యేలా చేసింది. మిగతావాళ్లు ..హీరోయిన్స్ అని చెప్పారు కాబట్టి..ఓహో అనుకోవాల్సిందే. అంతేతప్ప వాళ్లకు ప్రయారిటీ లేదు. కాబట్టి ముస్కాన్, కైరా దత్ ల గురించి మాట్లాడుకునేదేం లేదు. విలన్ గా విక్రమ్ జీత్ బాగున్నాడు. రా ఆఫీసర్ గా కబీర్ బేడి చేసారు. అంత గొప్ప నటుడుని ..అంత చిన్న పాత్రలో కనిపించటం ఆశ్చర్యం అనిపిస్తుంది. హిందీ శాటిలైట్ మార్కెట్ కోసమోమో మరి. ఇక ఫస్టాఫ్ లో 30 ఇయర్స్ పృధ్వీ, సెకండ్ హాఫ్ లో ఆలీ కామెడీ జస్ట్ ఓకే.

ఏ విభాగం బాగా పనిచేసిందంటే...

డైలాగ్ రైటర్ గా ఈ సినిమాలో పూరి తన పెన్ పవన్ తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నారు. చాలా పంచ్ డైలాగ్స్ విజిల్స్ వేయించాయి. అనూప్ రూబెన్స్ అందించిన పాటల సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫెరఫెక్ట్. ముఖేష్ జి సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. జునైద్ సిద్ధికి ఎడిటింగ్ నో కామెంట్స్. నిర్మాణ విలువలు బాలయ్య సినిమాకు తగ్గట్లు లేవు. ఫస్టాఫ్ లో చాలా చోట్ల చీప్ గా లాగేసారే అనిపించింది. ‘పైసా వసూల్’, ‘మామా ఏక్‌ పెగ్‌లా’ మాస్‌కు నచ్చేలా డిజైన్ చేసారు. ఆర్ట్ వర్క్ దారుణంగా ఉంది.

ఫైనల్ థాట్

'పోకిరి' ని బాలయ్యతో తీస్తే ఎలా ఉంటుంది అని చిలిపి ధాట్ వస్తే...దానికి తెరరూపమే ఇది, కాబట్టి మీలోనూ అలాంటి చిలిపి ఆలోచనలు ఉంటే బాగా ఎంజాయ్ చేస్తారు.

ఏమి బాగుంది: హీరో క్యారక్టరైజేషన్ , పోర్చుగల్ లో శ్రియను రక్షించే ఎపిసోడ్, అప్పుడు వచ్చే జంగిల్ బుక్ డైలాగ్

ఏం బాగోలేదు: పూరి జగన్నాథ్ ..అంత హైప్ ట్రైలర్ తో తెచ్చి ఇలాంటి సినిమాని తీయటం

ఎప్పుడు విసుగెత్తింది : క్లైమాక్స్ లో దేశభక్తి డైలాగులు చెప్తూంటే...

చూడచ్చా ?: బాలయ్యే ఓ డైలాగులో చెప్పినట్లు... 'ఓన్లీ ఫ్యాన్స్‌ అండ్‌ ఫ్యామిలీ, ఔటర్స్‌ నాట్‌ అలౌడ్‌'