Movies | Music | Masti Close Aha Ad
Movies | Music | Music

Seetha - Ramunikosam Movie Review

December 15, 2017
Tasmay Chinmaya Creations and Roll Camera Action
Sharath Sreerangam, Karunya Chowdary
eBox Telugu TV

NA
Shilpa Srirangam, Saritha Gopi Reddy and Don Nandan
Anil Gopi Reddy

'సీత రాముని కోసం' రివ్యూ

సినిమా..సెంటిమెంట్ కోసం ('సీత రాముని కోసం' రివ్యూ)

దెయ్యాలు, ఆత్మలు గోల తెలుగు తెరపై ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయింది. సెన్సాఫ్ హ్యూమర్ కానీ కామన్ సెన్స్ కాని కొంచెం కూడా లేని కక్కుర్తి దెయ్యాలు ఎక్కువైపోయాయి. అవి వాటిష్టం వచ్చినట్లు వచ్చి వేళా పాళా లేకుండా రెచ్చిపోతున్నాయి. ఏదో కాస్త బుర్రన్న దెయ్యాలనైతే భరించగలం ..అలా కాకుండా ...మతి పోయిన దెయ్యాలు మన బుర్రలను తినటం మొదలెడితే కష్టం కదా. మొదట్లో మనవాళ్లు దెయ్యాలను ఆహ్వానించిన మాట వాస్తవమే. అయితే ఆదరించాం కదా అని అదే పనిగా ...వారానికొకటి చొప్పున వచ్చేస్తూంటే బోర్ కొట్టేసి, కొత్త దెయ్యం ఊళ్లోకి వచ్చిందంటే పేరేంటని కూడా అడగకుండా దొబ్బేయమంటున్నారు.

దానికి తోడు సరైన సత్తా ఉన్నా దెయ్యం ఏదీ కూడా వాటిల్లో ఉండటం లేదు. చిల్లర మల్లర దెయ్యాలతో సరైన కాలక్షేపం కూడా కావటం లేదు. దాంతో ఏ మంత్రగాడు అయినా వచ్చి ముగ్గులు వేసి, ఆ దెయ్యాలను సీసాల్లో బంధించి భూ స్దాపితం చేస్తే బాగుండుని అని తెలుగు ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇంత దారుణమైన సిట్యువేషన్ లో ..మరో దెయ్యం నేనున్నా అంటూ వచ్చి పలకరించింది. మరి ఈ దెయ్యం...అన్ని దెయ్యాల్లాగే బోర్ కొట్టిస్తుందా..లేక విషయం ఉన్న దెయ్యమేనా ...అనేది రివ్యూలో చూద్దాం.

కథేంటి...

విక్రాంత్ అలియాస్ విక్కీ (శరత్) ఆత్మలకు సంబంధించిన పరిశోధన చేసే పారా సైకాలజిస్ట్. హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లోల తన మేనకోడలు కోసం విక్రాంత్ ఓ విల్లా కొంటాడు. అయితే ఆ విల్లాలో ..గజ్జెల చప్పుళ్లు, చిన్నపాప మాటలు వినిపిస్తుంటాయి. అంతేకాకుండా విక్కీకి ఆ విల్లాలో రెండు డైరీలు కనపడతాయి. దాంతో ఆ విల్లాలో తల్లి,పిల్ల ఆత్మలు ఉన్నయని తెలుసుకుంటాడు. వాళ్లపేర్లు అంజలి, సీత అని అర్దం చేసుకుంటాడు. అంతేకాకుండా ఆ తల్లి ఆత్మ తనకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోందని అర్దం చేసుకుంటాడు. అప్పుడు తన వృత్తి పరమైన ఉత్సాహంతో పరిశోధనలోకి దిగుతాడు. ఆ విల్లా తాను కొనటానికి ముందు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలెడతాడు.

పాత ఓనర్ రామ్ (అనిల్ గోపిరెడ్డి)ని కలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఆ క్రమంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. అసలు విల్లాలో ఉన్న ఆ ఆత్మలు ప్లాష్ బ్యాక్ ఏమిటి..? విక్రాంత్ తో ఆ ఆత్మలు ఏం చెప్పాలనుకున్నాయి..? ఆ డైరీలో ఏముంది? ఆ ఆత్మలు విల్లానే అంటిపెట్టుకుని ఎందుకు ఉన్నాయి..? విక్రాంత్ వాటిని విల్లా నుండిపంపించేశాడా..? ఆ విల్లాలో ఏం జరుగుతోంది. పాత ఓనర్ రామ్ కి ఆ ఆత్మలకు సంబంధం ఏంటి..? అన్నదే మిగతా కథ.

మిగతా దెయ్యాల కథలకీ, దీనికి ఇదే తేడా

నిజానికి ఇది రెగ్యలర్ గా వచ్చే దెయ్యాల సినిమాల రొటీన్ స్క్రీన్ ప్లేలో నడిచే కథే, స్క్రీన్ ప్లేనే. ఓ ఇల్లు కొనటం..ఆ ఇంట్లో దెయ్యాలు లేదా ఆత్మలు ఉండటం. వాటికో ప్లాష్ బ్యాక్ ఉండటం. అంతా రొటీన్ గా అలా అలా జరిగిపోతుంది. అయితే ఈ సినిమాకు మిగతావాటికి తేడా ఏమిటంటే మిగతా సినిమాల్లో దెయ్యాలు లేదా ఆత్మలు పగ ,ప్రతీకారాలతో రగిలిపోతూంటాయి. ఆ ఎలిమెంట్ మాత్రం ఈ సినిమాలో లేదు

ఈ సినిమాలో తల్లి సీత ఆత్మకు ఓ సెంటిమెంట్ ప్లాష్ బ్యాక్ ఉంది. అది ఎమోషన్స్ తో నిండి ఉంటుంది. జీవితాంతం తోడుగా ఉంటానని మాటిచ్చిన భర్త మధ్యలోనే వదిలేస్తే ఆ భార్య ఎంత బాధపడుతుంది.భర్త కోసం ఎంతలా తపిస్తుంది, చనిపోయాక కూడా ఆమె భర్త ప్రేమ అతని కోసమే ఎలా ఎదురుచూస్తుంటుంది అనే అంశాలను హైలెట్ చేస్తూ సెంటిమెంట్ ప్రధానంగా సాగుతుంది. అదే మిగతా దెయ్యాల సినిమాలకు దీనికి తేడా.

అదే బలం..అదే బలహీనత

మంచో , చెడో పూర్తిగా హారర్ సినిమాగా తీసి జనాలని భయపెట్టే ప్రయత్నం చేస్తే..అలాంటి ఎక్సపీరియన్స్ కోసం వచ్చేవర్గం ఈ సినిమాని మోస్తారు. అదే ధోరణిలో హారర్ జోనర్ ని ఈ సినిమాకు తీసుకున్నప్పుకీ హారర్ ఎలిమెంట్స్ బాగా తగ్గించి సెంటిమెంట్ డోస్ ని బాగా ఎక్కువ చేసారు. ఇది భయపెట్టే దెయ్యం కథ కాదు. ప్రేమను పంచే దెయ్యం కథ అని సెకండాఫ్ లో రివీల్ అవుతుంది. తన భర్త మీద ప్రేమ చావక, చనిపోయినా ఆత్మలా మారి ఆ ఇంట్లోనే తిరుగుతూ తన భర్త కోసం ఎదురు చూసే ఒక సీత కథగా రివీల్ అవుతుంది.దీంతో దెయ్యం సినిమా చూద్దాం,కాసేపు భయపడే అనుభూతికి లోనవుదాం అని వచ్చిన వారికి పూర్తిగా నిరాశే. హారర్ సినిమాలో ఉండాల్సిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఒక్కటి కూడా లేకపోవటం విసిగించింది. అయితే చివరి 40 నిమిషాలు ఇంట్రస్టింగ్ గా సాగింది. క్లైమాక్స్ సీన్స్ కదిలిస్తాయి. అదే ఈ సినిమాకు ప్లస్ అయ్యి నిలిచింది

ఐటం సాంగ్ ఎందుకు సామీ

దెయ్యం సినిమాలు అనగానే పెట్టుబడి పెద్దగా లేక, సినిమా తియ్యాలనే ఆసక్తి మాత్రమే ఉండి..చుట్టేద్దామనుకునే వారి ఆప్షన్ గా మారిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అలా చుట్టేసే సినిమాలను అంతే వేగంగా జనాలు పసిగట్టి తరిమికొడుతున్నారు. ఇక ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్ లో తీసారు. అందులో తప్పేమి లేదు .. బాగా క్వాలిటీగా తీయచ్చు. అదేమీ లేకపోగా.. మళ్లీ కమర్షియల్ కక్కుర్తి.. ఓ ఐటమ్‌ సాంగ్ రూపంలో పలకరిస్తుంది. కథకు కానీ చూస్తున్న జనాలకు కానీ వన్ పర్శంట్ గా ఉపయోగం లేకుండా ఈ ఐటం సాంగ్ సాగుతుంది. దానికి తోడు స్లో నేరేషన్ ఒకటి మనల్ని ఏడిపిస్తుంది.

టెక్నికల్ గా చూస్తే..

‘లాలీ లాలీ’ అన్న పాట సినిమాలో హైలెట్. సినిమాటోగ్రఫీ కలర్‌ఫుల్‌గా చక్కగా ఉంది. ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్ లేపేస్తే ఇంకా బాగుండేది. సీతగా నటించిన అమ్మాయి ...బాగా చేసింది.

ఫైనల్ థాట్

ఖచ్చితంగా థియోటర్ కు వెళ్లి చూడాల్సిన సినిమా మాత్రం కాదు. అలాగని మరీ తీసి పాడేయాల్సిందీ కాదు. చూడాలా వద్దా అనేది మీ దగ్గర ఉన్న సమయం, డబ్బు, తీరుబాటుని పై ఆధారపడి ఎంచుకునే అంశం.

ADVERTISEMENT
ADVERTISEMENT