మాధవన్ 'బ్రీత్' (వెబ్ సీరిస్ రివ్యూ)
కాస్తంత క్రియేటివిటి, చేతిలో కెమెరా, మరికాస్త ఉత్సాహం ఉంటే చాలు షార్ట్ ఫిలిం తీయచ్చు..అది క్లిక్ అయితే సినిమా పట్టచ్చు అనేది పోయి..ఇప్పుడు ట్రెండ్ మారింది. షార్ట్ ఫిలిం హిట్ అయితే వెబ్ సిరీస్ మొదలెట్టచ్చు అని ఆలోచిస్తున్నారు. అందుకు కారణం వెబ్ సీరిస్ లకు మంచి ఆదరణ ఉండటమే. ప్రస్తుతం అన్ని చోట్లా వెబ్ సీరిస్ ల సీజన్ నడుస్తోంది. పెద్ద పెద్ద హీరోల సైతం వెబ్ సీరిస్ లలో నటించటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎన్నో వెబ్ సీరిస్ లు నవ్విస్తూ, కవ్విస్తూ,సీరియస్ గా భయపెడుతూ మన ముందుకు వస్తున్నాయి. తాజాగా మనందరికీ బాగా పరిచయమైన మాధవన్ ప్రధాన పాత్రలో `బ్రీత్` అనే టైటిల్ తో ఓ వెబ్ సీరిస్ మొదలైంది. మొదట నాలుగు ఎపిసోడ్స్ వదిలారు. టైటిల్‌కి తగ్గట్టే ఆద్యంతం ఊపిరి తీసుకోనంత సస్పెన్స్ ఈ థ్రిల్లర్‌లో ఉందని ప్రచారం చేసారు. మర్డర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ స్టోరిలో సైకోపాతిక్ థ్రిల్లింగ్ ఎలిమెంట్‌ని జోడించి వదిలన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. నిజంగా వాళ్లు ప్రచారం చేసిన రీతిలో బ్రీత్ ని రూపొదించారా వంటి విషయాలు చూద్దాం..
కథేంటి
డ్యానీ మస్కరెనాస్ (మాధవన్) ముంబైలో ఫుట్ బాల్ కోచ్. అతనికి తన ఆరేళ్ల కొడుకు జోష్ అంటే ప్రాణం. లంగ్ డిసీజ్ తో బాధపడుతున్న జోష్ కొద్ది నెలలే బ్రతకుతాడని తెలిసి మౌనంగా ఆవేదనతో తల్లడిల్లిపోతూంటాడు. అతని ఆవేదనని షేర్ చేసుకోవాటనికి అతనికి భార్య లేదు. తన తల్లితో కలిసి కుమారుడుని సాకుతూంటాడు. వైద్యం కోసం అమర్చిన పైపులు, ట్యూబులు తన చిన్నారి కొడుకుతో ఉండటం చూసి ఏం చేయాలో ...ఎలా ఆ సమస్యను ఛేథించాలో తెలియక సతమతమౌతూంటాడు. ఎవరైనా డోనర్స్ దొరికి తన కొడుకుకి లంగ్ దానం చేస్తే బ్రతికిపోతాడని కనిపించని దేవుళ్లకు మొక్కుతూంటాడు. అయితే డోనర్స్ లిస్ట్ లో ఆ పిల్లాడు నాలుగవ వాడు. అంటే ముగ్గురు తర్వాత మాత్రమే తన కొడుకు బ్రతుకుతాడు. ముందు ఆ ముగ్గురుకు డోనర్స్ దొరకాలి. ఆ తర్వాత కొడుక్కి డోనర్ దొరకాలి. దాంతో ఓ నిర్ణయానికి వస్తాడు. అప్పటికే డోనర్స్ గా నమోదు చేసుకున్నవారి లిస్ట్ సంపాదిస్తాడు. వాళ్లలో నలుగురు అర్దాంతరంగా అర్జెంటుగా చనిపోతే తప్ప పని కాదు అని అర్దం చేసుకుంటాడు. ఎంతో మానసిక సంఘర్షణ తర్వాత వారిని తనే స్వయంగా చంపేసి..తన కుమారుడుని బ్రతికించుకోవటానికి సిద్దపడతాడు. అందుకు తగ్గ ప్లాన్ రెడీ చేసుకుంటాడు. అయితే అదే ముంబైలో క్రైమ్ బ్రాంచ్ కి చెందిన ఓ సిన్సియర్ అధికారి కబీర్ సావంత్ (అమిత్ సాధ్) ఉంటూంటాడు. అతను ఈ విషయం తెలుస్తుందా..ఎప్పుడు తెలుస్తుంది..తెలిసాక ఏం చేశాడు? ఈ మర్డర్ మిస్టరీలో ఎవరు గెలిచారు..ఎవరు ఓడారు అన్నది మిగతా కథ.
ఎలా ఉంది..
‘బిడ్డ ప్రాణాలకు ముప్పు ఉందని తెలిస్తే ఆ బిడ్డను బతికించుకోవడానికి తల్లిదండ్రలు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. ఆఖరికి సైకోగా మారడానికి కూడా వెనుకాడరు.’ అనే స్టోరీ ఐడియాతో వచ్చిన ఈ వెబ్ సీరిస్ ... టైటిల్ లో ఉన్నంత ఇంటెన్సిటీ సీరిస్ లో లేదు. అయితే కేవలం నాలుగు ఎపిసోడ్స్ చూసే అసలు ఇందులో విషయం లేదు అని చెప్పలేం. అయితే స్లోగా..గా నడిచే ఈ సీరిస్ లో ఇప్పటివరకూ కథను సెటప్ చేయటానికే సరిపోయింది. మెయిన్ కాంప్లిక్ట్ లోకి కథ వెళ్లలేదు. ఓమనిషి తన కొడుకుని రక్షించుకోవటం కోసం సైకో గా మారటం, ఇతరులు ప్రాణాల తీయటం అనేది గొప్ప ప్లాట్ అనిపించుకోదు.
తన కొడుకు బాధ చూసిన ..ఓ బలహీన క్షణంలో ..ఆ డోనర్స్ చచ్చిపోయినా బాగుండును నా కొడుకు బ్రతుకుతాడు అనిపించటంలో వింతలేదు కానీ...అలాంటి బలహీన మైన ఆలోచనను...ఆ తర్వాత కూడా జస్టిఫై చేసుకుంటూ హత్యలు చేస్తూ పోవటం అనేది అర్దరహితంగా అనిపిస్తుంది. అతనేమీ మానసిక వ్యాధితో బాధపడటం లేదు కదా..ఇలాంటి నిర్ణయం తీసుకోవటానికి . అయినా సమాజంలో ప్రతీ ఒక్కరికి వచ్చే కష్టాలకు మరొకరు అడ్డు తొలగటమే చాలా సార్లు ఫిక్షనల్ పరిష్కారంగా కనిపిస్తుంది. అంతమాత్రాన హత్యలు చేసుకుంటూ పోతారా...పోరు కదా..అయినా ఇలాంటి ప్లాన్ చేసినా వెంటనే ఫెయిల్ అవుతారు.
ఎందుకంటే...ఇంటిచుట్టూ సెక్యూరిటీ, సీసీటివీలు ఇళ్లలో పెట్టుకుని బ్రతుకుతున్న వాళ్లే బ్రీత్ లో కనపడతారు. ఇక ఇప్పటివరకూ వచ్చిన ఎపిసోడ్స్ చూసిన వాళ్లు క్లైమాక్స్ ఏం జరుగుతుందో ఈజీగా ఊహించేయగలరు..మాధవన్ లాంటి స్టార్ ని తీసుకుని ఇంత వీక్ ప్లాట్ తో ప్లాన్ చేయటమే ఆశ్చర్యం అనిపిస్తుంది.
ఎవరెలా చేసారు
నటుడుగా మాధవన్ గురించి ప్రత్యేకంగా చెప్పేందుకు ఏమీలేదు. తన కుమారుడు చనిపోతాడన్న ఆవేదనను మనస్సులో పెట్టుకుని..ఆ విషయం తన కుమారుడుకు తెలియనివ్వకుండా మ్యానేజ్ చేస్తూ..అతన్ని బ్రతికించుకావాలని చేసే ప్రయత్నాలతో మన మనుస్సులుని గెలుచుకుంటాడు. ఇక అమిత్ సాధ్ పోలీస్ అధికారిగా తన కుమార్తెను పోగొట్టుకున్న తండ్రిగా కనిపిస్తే..అతని సబార్డనేట్ గా .. ప్రకాష్ కాంబ్లే చేసారు. ప్రకాష్ కాంబ్లే మాత్రం ఈ షోలో అందరికన్నా ప్రత్యేకంగా కనపడతారు. సహజంగా నటించుకుంటూ పోతున్నారు. దర్శకుడు మేకింగ్ పరంగా బాగున్నా స్క్రిప్టు పరంగా మాత్రం పూర్ అనిపించారు. అలాగే ప్రాపర్టీస్ విషయంలోనూ బాగా అశ్రద్ద వహించారని అర్దమవుతుంది. పిజ్జా అని చెప్తూ ... ఓ బర్గర్ ని చూపెట్టడం, హ్యారీ పొట్టర్ కథ చదువుతూ...వేరే పుస్తకం చూపెడ్డటం వంటివి చాలా దొర్లాయి.
ఫైనల్ థాట్
సరదాగా ఈ వెబ్ సీరిస్ పై ఓ లుక్కేయటానికి మాధవన్ ...సహకరిస్తాడు. మరీ గొప్ప క్రైమ్ థ్రిల్లర్ చూడబోతున్నాం అని ప్రిపైర్ కాకపోతే ఫరవాలేదనిపిస్తాడు. ఏదైమైనా చేసిన పబ్లిసిటీకు తగ్గ స్దాయిలో మాత్రం లేదు. రాబోయో రోజుల్లో మిగతా ఎపిసోడ్స్ తో అయినా అద్బుతం సృష్టిస్తారేమో చూద్దాం.