కాటమరాయుడు రివ్యూ
తొలి నుంచీ పవన్ సినిమాలకు ఓ ప్రత్యేకత ఉంటూ వస్తోంది. ఆయన సినిమాలు కేవలం అభిమానులు మాత్రమే కాకుండా...సినీ లవర్స్ కూడా మొదటే రోజే చూడటానికి ఉత్సాహపడుతూంటారు. ఆయన ఎంచుకునే కథల్లో ఆ సార్వజనీనత కనపడం, ఫ్యామిలీలకు దగ్గరయ్యే ఎలిమెంట్స్ తో సినిమాలు చేస్తూండటం,ఆయన మాత్రమే చేయగలిగే గమ్మత్తైన ఎంటర్ట్నైమెంట్... కారణం కావచ్చు. ఎప్పటిలాగే కాటమరాయుడు సైతం అలాంటి భరోసానే ఇస్తూ ధియోటర్స్ కు వచ్చింది. ఖచ్చితంగా పవన్ ఈ సారి పెద్ద హిట్ కొడతారు..అంతా అంచనాలు వేసారు. మరి ఆ అంచనాలను ఆయన రీచ్ అయ్యారా...అసలు ఓ తమిళ రీమేక్ ని ఏరికోరి మరీ చేయటానికి కారణం ఏమిటి..అందులో ఏముంది...వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథలోకి వెళ్తే... వయస్సు వచ్చి వెళ్లిపోతునా పెళ్లి, పెళ్లాం, పిల్లలు వంటి వాటిని వద్దనుకుని తనదైన ప్రపంచంలో బ్రతుకుతూంటాడు కాటమరాయుడు (పవన్). అంతేకాదు..ఆడవాళ్లంటే ఓ రకమైన అయిష్టతతో వాళ్లని దూరం పెడుతూంటాడు. ఎందుకూ అంటే..తన చిన్నప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ (అంత చిన్నవయస్సులో ప్రేమా వంటి క్వచ్చిన్స్ అడగొద్దు..ఇది తెలుగు సినిమా) ఏదో మనకు కూడా చెప్పటం ఇష్టం లేని కారణంతో దూరం పెడుతూంటాడు.
దాంతో ..పెరిగి పెద్దైనా ఆడవాళ్లకు తను దూరంగా ఉండటమే కాకుండా తన తమ్ముళ్లు నలుగురిని, పనిలో పనిగా తన స్నేహితుడు, తన కేసులు చూసి, తన వెంట ఉంటే లాయిర్ లింగ (అలీ) ని సైతం ఆడవాళ్లకు దూరంగా ఉండమంటారు. అయితే అంతా ఉప్పూ కారం కాస్త ఎక్కువై తింటున్న బ్యాచ్ కావటంతో...అన్న కు తెలియకుండా తమ్ముళ్లు, ఫ్రెండ్ కు తెలియకుండా అలీ..తమకు తగ్గ జంటను వెతుక్కుని జాలీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూంటారు. అయితే ఇలా ...ఎంత కాలం దొంగచాటు వ్యవహారం...ఏదో రోజు ఈ మ్యాటర్ అన్నదగ్గర బయిటపడితే... ఈ డౌట్ మనకే కాదు..వాళ్లకీ వస్తుంది.
దాంతో తమ ప్రేమని గెలిపించుకోవాలంటే అన్నయ్య కాటమరాయుడిని ప్రేమలో పడేయాలని నిర్ణయించుకుంటారు. అందుకు ప్లాన్స్ వేయటం మొదలెడతారు. ఈ క్రమంలో తన అన్న చిన్ననాటి ప్రేమ జ్ఞాపకాలను గుర్తుచేసే అమ్మాయి అవంతిక (శృతి హాసన్) ని వెతికి, పడతారు. నానా కష్టాలు పడి,అబద్దాలు ఆడి, స్కెచ్ లు వేసి...తమ కాటమరాయుడుని అవంతికతో ప్రేమలో పడేలా చేస్తారు. హమ్మయ్య ఓ గొడవ పూర్తైందని వాళ్లు భావించి పండగ చేసుకుంటారు. అయితే అక్కడనుంచే అసలు కథ మొదలవుతుంది.
మన కాటమరాయుడుతో ప్రేమలో పడ్డ సదరు హీరోయిన్ అవంతక కి అసలు గొడవలు,ఫైట్స్ అంటే సుతరాము ఇష్టం ఉండదు. కానీ కాటమరాయుడు అదే వృత్తి అన్నట్లుగా బ్రతుకుతూండే క్యారక్టర్. దాంతో ఈ విషయం అవంతకకి ఓ సుముహార్తాన తెలిసి, నో..నీ ప్రేమకు, నీకు బై బై అనేస్తుంది. అయ్యో...లేటు వయస్సులో అయినా ఘాటుగా ప్రేమలో పడితే ఇలాంటి ట్విస్ట్ వచ్చిందేమిటి దేముడా అని కాటమరాయుడు బాధపడతాడు. ఆ తర్వాత శృతి ప్యామిలీకు దగ్గర అవటానికి ఏం చేస్తాడు. అసలు మన హీరోయిన్ కు ఈ గొడవలు, పైట్స్ అంటే ఇష్టం లేకపోవటం ఏమిటి..ఆమె కు ఉన్నగతం ఏమిటి... ఆమెకు కూడా తన చిన్నప్పుడే మన కాటమరాయుడులా ఫ్లాష్ బ్యాక్ ఉందా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఇది నిజానికి ..వీరమ్ అనే తమిళ సూపర్ హిట్ కు రీమేక్. అయితే ఆ వీరమ్..తెలుగులో వచ్చిన పెద్దరికం నుంచి స్టోరీ లైన్ లేపి, దానికి అనేక శ్రీను వైట్ల ఫార్ములా సినిమాల ఎపిసోడ్స్ కలిపి వండిన వంటకంగా ఉంటుంది. దాంతో మన పాత సినిమా ఏదన్నా మళ్లీ చూస్తున్నామా అని సినిమా చూస్తున్నప్పుడు అప్పుడప్పుడూ డౌట్ వస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ ఎదురుగా ఉండటంతో ...కాదు కొత్త సినిమానే చూస్తున్నాం అనే ధైర్యం తెచ్చుకుంటాం.
ఫస్టాఫ్ ...మనకు జగపతి బాబు సూపర్ చిత్రం పెద్దరికం గుర్తుకు తెస్తే..సెకండాఫ్ మొత్తం రామ్, మంచు విష్ణు, వెంకటేష్ వంటి హీరోలంతా శ్రీను వైట్ల దర్శకత్వంలో చేసిన సినిమాలను గుర్తు చేస్తాయి. హీరోయిన్ ఫ్యామిలీకి ఓ విలన్ ఉండటం, అదే ఇంటిలో ..హీరో సెటిలయ్యి..వారి సమస్యలను తీర్చటం, మధ్యలో ఒక కామెడీ క్యారక్టర్ బకరా అవటం..పైనల్ గా విలన్ తో భారీ ఫైట్ తో క్లైమాక్స్..అది చూసిన హీరోయిన్ కుటుంబం అంతా కళ్లు విప్పార్చుకుని, చెమర్చిన కళ్ళతో మీ అంత గొప్పవాడు లేడు..నీకే మా అమ్మాయి,పెళ్లి చేసుకో అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయటం. ఇదంతా వరసపెట్టి జరిగిపోతూంటుంది. అవి ఓ స్దాయి హీరోలకు నప్పే కథలు. కానీ పవన్ వంటి పవర్ స్టార్ ఇమేజ్ కలిగిన వ్యక్తికి సరిపడతాయా. అందుకే రజనీ ..కాంత్ ఇలాంటి కథలు ముట్టుకోవటం లేదు అనుకుంటా..లేకపోతే ఆయనకూడా ఈ ఫార్ములాలో ఓ నాలుగైదు సినిమాలు చేసేద్దురేమో.
అయితే మీరో మాట అనొచ్చు...పవన్ సినిమాకు కథ కోసం వెళ్తామా అని...అదీ నిజమే..పవన్ సినిమాకు అద్బుతమైన కథ కోసం వెళ్లం..కానీ కథ కూడా ఉంటే,అదీ కొంచమైన కొత్తగా ఉంటే బాగుండుని ఆశిస్తాం. అంతేకానీ ...పవన్ కళ్యాణ్ ని కేవలం పరిస్దితులకు స్పందించే పక్కా ప్యాసివ్ పాత్రలో ఊహించలేం కదా. సెకండాఫ్ లో పవన్ తను ఇష్టపడ్డ అమ్మాయి కుటుంబాన్ని సేవ్ చేయాలి అని ఫిక్సై, వరసగా అటు విలన్ వైపు నుంచి వచ్చే ఎటాక్స్ కి రెస్పాండ్ అయ్యి..వారిని చావకొట్టి పంపుతూంటాడు కానీ...తనే యాక్టివ్ గా మారి..అవతలి విలన్ భయపడే స్టెప్ తీసుకోండి. దాంతో యాక్టివ్ గా ఉంటూనే ప్యాసివ్ గా నడుస్తూ ...సినిమా పై ఇంట్రస్ట్ ని మెల్లిగా తగ్గించేయటంలో వింతేముంది.
అలాగే ఫస్టాఫ్ లో ఉన్న ఫన్ ని సెకండాఫ్ లో కూడా కంటిన్యూ చేస్తే..ఆ సమస్య అంతగా అనిపించేది కాదు. గబ్బర్ సింగ్ లో ఇలాంటి సమస్య ఉన్నా దాన్ని...అంత్యాక్షరి వంటి అద్బుతమైన ఎపిసోడ్స్ తో లేపి నిలబెడ్డారు. అదే ఇక్కడ కొరవడింది. ద్వితీయార్దంలో చెప్పుకోదగ్గ ఎపిసోడ్ లేదు..గుర్తించుకోదగ్గ ఎలిమెంట్ లేదూ. అత్తారింటికి దారేది స్దాయిలో ఎమోషన్ అసలు లేదు
ఇక ప్లస్ ల విషయానికి వస్తే... సినిమాలో ... పవన్ కళ్యాణ్ లో తన వయస్సుని ఓ ఇరవై ఏళ్లు వెనక్కి నెట్టినట్లుగా ఉషారు,జోష్ కనిపిస్తుంది. డైలాగులు చెప్పే తీరులోనూ కొత్తదనం, ఓ విభిన్నమైన స్లాంగ్ తో రక్తి కట్టించారు. ఇక శృతి హాసన్ తో చేసే సీన్స్ లో రొమాన్స్ మనకు ఖుషీ రోజులు గుర్తు కు వస్తాయనటంలో సందేహం లేదు. ఇక వీరమ్ లో లేని కొత్త సీన్స్ ఫస్టాఫ్ లో చాలా వరకూ డిజైన్ చేసారు. అలాగే తెలుగు నేటివిటికు ఇవి లొంగవు అనుకున్న సీన్స్ నిర్దాక్ష్యణంగా తొలిగించి, వాటి ప్లేస్ లో మంచి సీన్స్ వర్కవుట్ చేసారు. కానీ ఆ పట్టుని సెంకాడాఫ్ లో స్క్రిప్టు డిపార్టమెంట్ వదిలేసింది.
ఇక రావు రమేష్ ..రాయలసీమ యాసలో చెప్పే డైలాగ్స్ చాలా చాలా బాగున్నాయి. ప్రదీప్ రావత్ రొటీన్ నటనే. ఇంట్రవెల్ ఫైట్..యాజటీజ్ వీరమ్ లోదే షాట్ బై షాట్ దింపినా..మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి బాగున్నాయి. ముఖ్యంగా పల్లెటూరు అందాలను ప్రసాద్ మురెళ్ల చాలా కలర్ ఫుల్గా తన కెమెరాతో ప్రాణం పోసి చూపించారు. నిర్మాణవిలువలు..విషయానికి వస్తే..పవన్ స్దాయికి తగ్గ పెద్ద బడ్జెట్ పెట్టలేదని అర్దమవుతుంది. కాకపోతే దర్శకుడు తన నైపుణ్యంతో మిగతా టెక్నీషియన్స్ సాయింతో ఆ లోటు మనకు ఎక్కడా రానివ్వడు. సంగీతం బాగున్నా...వాటిని చిత్రీకరించిన విధానం సోసో అన్నట్లుగా ఉంది.
డైలాగులు కొన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకునే స్దాయిలో ఉన్నాయి.నాకు ప్రేమించడం తప్ప, దాన్నెలా చెప్పాలో తెలియదు...నాకు కొడుకులాంటి అల్లుడుని తెస్తావనుకుంటే నా ఆశయానికి అండను తెచ్చావు..జీవితంలో ఎవరికి ఎదురు పడకుండా ఉంటే బావుంటుందని అనుకుంటావో అలాంటి వాడిని నేను. భూమి అంటే హోదా కాదు, బాధ్యత తరహా డైలాగ్స్ మెప్పిస్తాయి.
ఫైనల్ గా 'గబ్బర్ సింగ్' స్దాయిలో ఉందని చెప్పలేం కానీ 'సర్దార్ గబ్బర్ సింగ్' స్దాయిలో మాత్రం లేదని మాత్రం ఘంటాపధంగా చెప్పవచ్చు. పవన్ ఫ్యాన్స్ కు నచ్చే ఎలిమెంట్స్ ఉన్న ఈ చిత్రం ...వారి ఆదరణ ఏ స్దాయిలో ఉంటుందనే విషయంపై విజయం స్దాయి ఆధారపడి ఉంటుంది.
నటీనటులు: పవన్ కల్యాణ్, శ్రుతిహాసన్, నాజర్, అలీ, రావు రమేష్, ప్రదీప్ రావత్, తరుణ్ అరోరా, శివ బాలాజీ, అజయ్, చైతన్య కృష్ణ, కమల్ కామరాజు తదితరులు . సంగీతం: అనూప్ రూబెన్స్, కూర్పు: గౌతంరాజు , ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ల , నిర్మాత: శరత్ మరార్, దర్శకత్వం: డాలీ