భలే ఉంది 'గురు' (రివ్యూ)
ఎప్పుడు చూసినా అవే క్యారెక్టర్లు, అవే స్టోరీలు కొత్తవి రావా అని దూకుడులో మహేష్ బాబు అన్నట్లుగా..మన రీజనల్ సినిమాలు చాలావరకూ .. సేఫ్ జోన్ లో ఉండటానికే ట్రై చేస్తూ అవే మూస కథలు, అవే రొటీన్ కథాంశాలు పట్టుకుని వేళ్లాడుతూంటాయి. కొద్దో గొప్పో చిన్న సినిమాలు ఏమన్నా కొత్తదనం చూపించి పెళ్లి చూపులు లాగ హిట్ కొట్టే అవకాసం ఉందేమో కానీ, పెద్ద బడ్జెట్ సినిమా కథలు మాత్రం గానిగెద్దులా..ఆ మూస,మాస్ అంటూ అలాగే చెప్పిన పాయింట్ చుట్టూనే ప్రదిక్షాలు చేస్తూంటాయి.
ఆ పరిస్దితికి ఎవరి ఎన్ని కారణాలైనా చెప్పచ్చు కానీ, ప్రేక్షకుడు మాత్రం తప్పనిసరై చాలా సార్లు భరిస్తున్నాడు. వీకెండ్ లో ఏదో ఒక సినిమా...అదీ కాసేపు నవ్విస్తే చాలు అనే స్దితికి వచ్చేసారు. కానీ ఈ సిట్యువేషన్ మారదా... అంటే నే ట్రై చేస్తాను అంటూ ఈ వారం మన ముందుకు వచ్చేసాడు వెంకటేష్.
ఆయనకు ఎంత ధైర్యం లేకపోతే తెల్లగెడ్డం పెట్టుకుని, ఒక హీరోయిన్ కూడా లేకుండా చేయటానికి సై అంటారు. అంతేకాదు తనకు అలవాటైన కామెడీని కొంచెం కూడా ఎక్కడా పలకించకుండా , సీరియస్ గా ఫేస్ పెట్టి సినిమా మొత్తం లాగించేయటానికి ఓకే అంటారు. పోనీ ఆయన కామెడీ చెయ్యలేదు సరికదా...సినిమాలో కూడా ఎక్కడా మొహమాటానికి కూడా కామెడీ సీన్ పెట్టలేదు. నిజమా...అంత గొప్ప కథేంటో చిన్న ముక్కలో చెప్పు అంటారా...ఓకే ...ఇంట్రోకి ఫుల్ స్టాప్ కు పెట్టి రివ్యూలోకి వెళదాం.
ఓ రకంగా రీమేకే...
1996లో వరల్డ్ భాక్సింగ్ చాంపియన్ షిప్ లో పాల్గొనేందుకు రెడీ అవుతున్న ఆది (వెంకటేష్), సెలక్షన్ కమిటీలో రాజకీయాల మూలంగా ఆ అవకాశం కోల్పోతాడు. చీఫ్ సెలెక్టర్ దేవ్ ఖత్రీ (జకీర్ హుస్సేన్) కావాలనే ఆదిని ఆట కు దూరం చేస్తాడు. ఆ ప్రభావం అతని పర్శనల్ లైఫ్ మీద కూడా పడుతుంది. ఆనాటినుంచీ తన ముక్కుసూటితనంతో ...బాక్సింగ్ అకాడమీలోని రాజకీయాలని ఎదిరిస్తూ...ఫైనల్ గా ఏమీ సాధించలేక, అందులోంచి వచ్చిన ప్రస్టేషన్ కోపంతో మిగలిపోతాడు...రగిలిపోతూంటాడు.
ఈ క్రమంలో ఆది...ఎలాంటి ప్రాధాన్యం లేని విశాఖపట్నంలో అమ్మాయిల బాక్సింగ్ కోచ్‌గా ట్రాన్సఫర్ అవుతాడు. అయితే అక్కడ మన ఆది జీవితం మలుపు తిప్పే రాములు (రితికా సింగ్) కనిపిస్తుంది. కూరగాయలు అమ్ముకొంటూ తల్లిదండ్రుల్ని పోషించే ఆమెను చూడగానే ఓ లక్ష్యం ఫిక్స్ చేసుకుంటాడు ఆది. రాములలో ఓ మంచి బాక్సర్ దాగుందని, దానికి మెరుగులు దిద్దితే భారత్‌కు పతకాలు సాధించి పెడుతుందని నమ్ముతాడు. అందుకోసం తన సర్వస్వం ఒడ్డటానికి సిద్దపడతాడు. అయితే అవన్నీ రాములకు అనవసరం. తనకు డబ్బు కావాలి. అందుకోసం కోచింగ్ లో పాల్గొంటుంది.
మరో ప్రక్క తనకు కోచింగ్ ఇస్తానని తీసుకువచ్చిన ఆది..అమ్మాయిల పిచ్చోడు, అందుకే తనను కావాలని తీసుకు వచ్చాడని భావిస్తూంటుంది రాములు. అంతేకాకుండా ఆ యాంగిల్ లోనే ఆదిని చులకనగా చూస్తూ, మధ్య మధ్యలో వార్నింగ్ లు గట్రా ఇస్తూంటుది. అలాంటి అమ్మాయిని మన ప్రస్టేషన్ ‘గురు’ భాక్సింగ్.. ఛాంపియన్‌గా తీర్చిదిద్ద గలిగాడా? నిజంగానే ఆది..అమ్మాయిల పిచ్చోడా..అనేది తెరపై తేల్చుకోవాల్సిన విషయం.
స్పోర్ట్స్ డ్రామా... సోది డ్రామా కాదు
వాస్తవానికి ..ఇదే కథని చక్కగా..వెంకటేష్ హీరో కాబట్టి నయనతార ని హీరోయిన్ గా పెట్టి ఓ ఐదు పాటలు, వేర్వేరు లొకేషన్స్ లో ప్లాన్ చేయవచ్చు. అలాగే భాక్సింగ్ కోచింగ్ జరిగే చోట బ్రహ్మానందం, అలీ వంటి సీనయిర్ కమిడయన్స్ పెట్టి పూర్తి స్దాయి కామెడీ ట్రాక్ రన్ చేయవచ్చు. ఇంకా ఎలాగో భాక్సింగ్ గేమ్ కాబట్టి..విలన్స్ పెట్టి, ఛాలెంజ్ లు సెట్ చేసి, అక్కడ యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేయవచ్చు. ఇలాంటి పరమ రొటీన్ తెలుగు సినిమా ఆలోచనలు చేయకపోవటమే ఈ సినిమా సగం సక్సెస్. దర్శకురాలు పూర్తి స్దాయిలో ఈ సినిమాని స్పోర్ట్స్ డ్రామాలా నడపాలని ఫిక్స్ అయ్యి..అలాగే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ షాట్ వరకూ ప్లాన్ చేసి సక్సెస్ అయ్యింది.
రీమేక్ అయినా...
ఈ చిత్రం తమిళ, హిందీ భాషల్లో ఘన విజయం సాధించిన ఇరుద్ది సుత్రు, సాలాఖద్దూస్ సినిమాలకు రీమేక్ . ఒరిజినల్ వర్షన్ ను తెరకెక్కించిన సుధ కొంగర దర్శకత్వంలోనే తెలుగులో వెంకటేష్ హీరోగా తెరకెక్కించారు. తమిళ, హిందీ భాషల్లో నటించిన చాలా మంది నటులు తెలుగులోనూ అదే పాత్రల్లో కనిపించారు. అవే సీన్స్ కూడా యాజటీజ్ వాడారని అర్దం అవుతోంది. అయితే ఎక్కడా రీమేక్ అనే ఫీలింగ్ రాలేదు.
డైరక్టర్ కు ఆ ఛాధస్తం లేదు
ఈ సినిమాని మొదటి నుంచీ చివరి వరకూ ఒకే ఎమోషన్ లో నడపటంలో సక్సెస్ అయ్యారామె. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ ఫెరఫెక్ట్ గా సెట్ అయ్యాయి. చాలా చోట్ల మనమూ కథలో లీనమై... అరే..ఆ అమ్మాయి ఎలాగైనా గెలిస్తే బాగుండును అనే ఫీలింగ్ క్లైమాక్స్ కు తీసుకువచ్చింది దర్శకురాలు. అలాగే భాక్సింగ్ చూసేవాళ్లలో ఎంత మందికి తెలుసు..ముందు ఆ ఆట గురించి ఇంట్రడక్షన్ ఇద్దాం, ఎడ్యుకేట్ చేద్దాం అనే ఛాదస్తం పెట్టుకోకుండా...బ్రతికించింది.
హైలెట్
ఈ సినిమాకు ప్రాణం ఫెరఫెక్ట్ గా రాసుకున్న స్కిప్టు. ఎక్కడా ప్రక్కదారి పట్టనివ్వని స్క్రీన్ ప్లే. కమర్షియల్ ఎలిమెంట్స్ పేరు తో కాలం గడపని సీన్స్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. అలాగే వెంకటేష్, రితికాసింగ్ ల రెండు పాత్రలను చాలా స్ట్రాంగ్ గా డిజైన్ చేసుకుని, వారి మధ్య సాగే కాంప్లిక్ట్స్ ని సమర్దవంతంగా డీల్ చేసారీ స్క్రిప్ట్ లో . అదే సినిమాని ఈ స్దాయిలో నిలబెట్టింది.
వెంకీ ది గ్రేట్...
మొదటే చెప్పుకున్నట్లు ఇది వెంకటేష్ విజయం. కెరీర్ క్రాస్ రోడ్స్ మీద నిలబడి...తన వయస్సుకు ఎలాంటి కథలు చేస్తే ఆడతాయనే ఆలోచనలతో ఉన్న వెంకికి ఈ సినిమా ధైర్యాన్ని ఇచ్చి కొత్త కథలతో దూసుకుపో, కొత్త క్యారక్టర్స్ తో రెచ్చిపో, అవే నిన్ను గెలిపిస్తాయి అనే భరోసా ఇచ్చింది. ఇక సినిమాలో ఆయన ఇలా చేసాడు..ఆ సీన్ చింపేసాడు, ఈ ఎమోషన్ లో ఏం ఎక్సప్రెషన్ పెట్టాడు అని ప్రత్యేకంగా చెప్పుకోవటం అనవసరం. ఎందుకంటే ఆయన నటనా సమర్దుడు అని చాలా సార్లు ప్రూవ్ అయ్యింది.
ఈమె లేకపోతే
ఇక ఈ సినిమాలో వెంకేటేష్ తో సమానమైన క్యారక్టర్ చేసింది రితికాసింగ్. ఆమె ఎంతలా ఈ పాత్రలో ఇమిడిపోయిందంటే ఆమె లేకపోతే ఈ సినిమా వేరే వాళ్లు ఇంత బాగా చెయ్యలేరేమో అనిపించేంతలా. క్లైమాక్స్ అయ్యిపోయాక భాక్సింగ్ లో గెలిచిన ఆమె వచ్చి వెంకటేష్..మీదకు ఉరికే ఒక్క షాట్ చాలు..ఆమె ప్రతిభ..చలాకితనం చెప్పటానికి ... అఫ్ కోర్స్ హిందీలోనూ ఆ పాత్ర ఆమే చేసింది.
అలాగే విలన్ పాత్రలో జకీర్ హుస్సెన్ , వెంకీకి జూనియర్ గా నాజర్ చాలా బాగా చేసారు.అలాగే రఘుబాబు, అనితాచౌదరి, ముంతాజ్ సర్కార్ లు కూడా తమ పాత్రలకు న్యాయం చేసారు.
మైనస్ పాయింట్స్
ఫస్టాఫ్ రన్ స్పీడుగా అసలు కాలమే తెలియదు అన్నట్లు గడిచిపోయిన ఈ సినిమా సెకండాఫ్ స్లో అయ్యింది. క్యారక్టర్స్ మధ్యన ఎమోషన్ సీన్స్ డిజైన్ చేసిన తీరు,సాగతీసిన ఫీలింగ్ తీసుకు వచ్చింది. అలాగే రితికా సింగ్..కథకు అవసరం కాబట్టి హఠాత్తుగా పెద్ద భాక్సర్ అయ్యిపోయినట్లు చూపించారు...ఆమె ఎదిగిన తీరిను ఆ స్దాయిలో ఎస్టాబ్లిష్ చేయలేదు. అలాగే ఎంత బాగుందనుకున్నా..క్లామాక్స్ ...సినిమాకు తగ్గ స్దాయిలో డిజైన్ చెయ్యలేకపోయారనిపిస్తుంది.
సంగీతం, సాంకేతిక అంశాలు
పాటల్లో వెంకటేష్ స్వయంగా పాడిన జిగిడి..జిగిడి పాట బాగుంది. అలాగే సంతోష్ నారాయణ అందించిన బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ సినిమా స్థాయిని పెంచాయి. ఇక హర్షవర్థన్ మాటలు ఫెరఫెక్ట్ గా సీన్ కు సింక్ అయ్యాయి, కె ఎ శక్తివేల్ సినిమాటోగ్రఫి, సతీస్ సూర్య ఎడిటింగ్, వై నాట్ స్టూడియోస్ నిర్మాణ విలువలు ..వంక పెట్టలేని విధంగా ఉన్నాయి.
ఫైనల్ గా ... కేవలం ఈ సినిమానో స్పోర్ట్స్ డ్రామాగా చూస్తూ..మనకు పెద్దగా ఆటలంటే ఇంట్రస్ట్ లేదు కదా. అయినా మనకు భాక్సింగ్ గురించి ఏమి తెలుసని ఆ సినిమాకు వెళ్లటం, అర్దమవుతుందా.... వంటి అర్దం పర్దం లేని అనుమానాలు పెట్టుకోకుండా చక్కగా ఫ్యామిలీతో వెళ్లి చాడాల్సిన సినిమా. ముఖ్యంగా మన ఇంట్లో ఎదిగే పిల్లలు ఉంటే..వారిలో ప్రేరణ కలిగించటానికి, స్పోర్ట్స్ పై ఓ అవగాహన కలిగించటానికి పనికొచ్చే సినిమా. డోంట్ మిస్ ఇట్.
నటీనటులు: వెంకటేష్, రితికా సింగ్, ముంతాజ్, నాజర్, తనికెళ్ల భరణి, రఘుబాబు, అనితా చౌదరి తదితరులు. సంగీతం: సంతోష్ నారాయణన్, ఛాయాగ్రహణం: శక్తివేల్, మాటలు: హర్షవర్థన్, నిర్మాత: ఎస్.శశికాంత్, సంస్థ: వై నాట్ స్టూడియోస్, రచన, దర్శకత్వం: సుధ కొంగర.