మరో 'అష్టాచమ్మా' అయ్యేదే కానీ... ( `అమీతుమీ` రివ్యూ)
ఒక తరంలో జంధ్యాల, రేలంగి నరసింహారావు,వంశీ.. ఆ తర్వాత తరంలో ఇవివి, ఎస్వీ కృష్ణారెడ్డి, ఇప్పటి తరంలో శ్రీను వైట్ల,నాగేశ్వరరెడ్డి కామెడీలపై దృష్టి పెట్టారు. అయినా తెలుగులో కామెడీ సినిమాలు సంఖ్య తక్కువగానే ఉంది. రాజేంద్రప్రసాద్ కామెడీ హీరోగా రిటైర్ అవటం, అల్లరి నరేష్ పూర్తి గా స్ఫూఫ్ లనే నమ్ముకోవటం కూడా కామెడీకు గండి కొట్టినట్లు అయ్యింది. నిజంగా కామెడీ సినిమా చేయాలన్నా కామెడీ హీరో ఏడి అని వెతుక్కోవాల్సిన పరిస్దితి వచ్చింది.
ఈ సమయంలో కామెడీకి నోన్ ఫేస్ లే అక్కర్లేదు... కొత్తవాళ్లతో కూడా కామెడీ చేసి నవ్వించవచ్చు అంటూ అవసరాల శ్రీనివాస్ , నానిలతో అష్టాచమ్మా ఆట ఆడి నవ్వించారు ఇంద్రగంటి. అంతా హమ్మయ్యా..ఇంకో కామెడీలు తీసే దర్శకుడు తెలుగు సినిమాకు దొరికాడే అని మురసి పోయారు. కానీ ఆయన కూడా కామెడీలను ప్రక్కన పెట్టి డిఫెరెంట్ చిత్రాలంటూ తన ప్రయాణం సాగించటం మొదలెట్టారు. చివరకి అల్లరి నరేష్ తో కూడా ఓ సీరియస్ సినిమా తీసేసారు.
అయితే మళ్లీ ఏమైందో...మీరు కామెడీలు బాగా తీస్తారని ఆయనకు ఎవరైనా గుర్తు చేసారో లేక... ఓ రోజు రాత్రి తన అష్టాచమ్మానే మళ్లీ ఏ టీవీలో అయినా చూసుకున్నారో కానీ ఇదిగో ఇలా కామెడీతో `అమీతుమీ` తేల్చేసుకుంటానంటూ మన ముందుకు వచ్చేసారు. ఆయన్ని మళ్ళీ కామెడీ సినిమా తీయాలి అనిపించేటంత ప్రేరేపించిన కథ ఏంటి..అష్టా చమ్మా స్దాయి లో ఈ సినిమా ఉందా..ఏ మేరకు వర్కవుట్ అవుతుందేనే విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి
రెండు ప్రేమ జంటలు.. పెద్దలని కాదని ఒకటవ్వటానికి వేసిన స్కెచ్ లో ఇరుక్కుపోయిన ఓ కుర్రాడు ఇరుక్కుపోయి గిలగిల్లాడిన కామెడీ కథే ఈ అమీతుమీ. బాగా డబ్బున్న జనార్దన్ (తనికెళ్ళ భరణి)కి ఇద్దరు పిల్లలు విజయ్ (శ్రీనివాస్ అవసరాల), దీపిక (ఈషా) . వాళ్లిద్దరూ తమకు నచ్చినవాళ్లైన మాయ (అదితి ), అనంత్ (అడివి శేష్) లతో ప్రేమలో మునిగితేలుతూంటారు. కానీ తనదైన కారణాలతో జనార్దన్ వాళ్ల ప్రేమలకు అడ్డుగా నిలిచి,పెళ్లికి ఒప్పుకోడు. అక్కడితో ఆగకుండా తన కుమార్తె దీపికకు శ్రీ చిలిపి (వెన్నెల కిశోర్) తో పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేస్తాడు. పాపం శ్రీ చిలిపిది విచిత్రమైన సమస్య. తమ వంశంలో పెళ్లి కూతురును ఫోటో చూడకుండా పెళ్లి చూపులకు వెళ్లడం ఆచారం.
అతను ఆ సమస్యని అడ్డం పెట్టుకునే తమ ప్రేమ సమస్యల నుంచి బయిట పడాలని, ఈ రెండు జంటలూ ఫిక్స్ అవుతాయి. ఆ క్రమంలో దీపిక తన ఇంట్లో పనిమనిషి కుమారి (శ్యామల) సాయంతో దీపిక ఓ నాటకం మొదలెడుతుంది. అక్కడనుంచి అసలు కథ మొదలవుతుంది. ఇంతకీ దీపిక మొదలెట్టిన ఆ నాటకం ఏమిటి... వీళ్ళ ప్రేమ కథ మధ్యలోకి వచ్చిన శ్రీ చిలిపి ఎలా నలిగిపోయాడు ? చివరికి అతని జీవితం ఏమైంది ? అనంత్, విజయ్, శ్రీచిలిపిల పెళ్ళిళ్ల విషయంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకొన్నాయి? ప్రేమజంటల కథలు సుఖాంతమయ్యాయా? అనేదే ఈ సినిమా కథ.
కథా,కథన విశ్లేషణ
కామెడీ అనేది సీరియస్ బిజినెస్. పూర్తి జాగ్రత్తగా డీల్ చేయాల్సిన వ్యవహారం. యాక్షన్ సినిమాలో పంచ్ కాస్త ప్రక్కన తగిలినా జనం ఎడ్జెస్ట్ అవుతారు కానీ కామెడీ సినిమాలో పేలాల్సిన పంచ్ మాత్రం ఏ మాత్రం ప్రక్కకు వెళ్లినా పనిగట్టుకుని మరీ ప్లాఫ్ చేసేస్తారు. ఎందుకంటే కామెడీ సినిమాలను జనం నవ్వుకోవటానికి వెళ్తున్నాం అని ప్రిపేర్ అయ్యి మరీ థియోటర్లోకి అడుగుపెడతారు. అది ఏ మాత్రం లభించకపోయినా విరుచుకుపడతారు. ఈ సినిమా ఫస్టాఫ్ కామెడీ బాగానే పండింది కానీ సెకండాఫ్ కు వచ్చేసరికి సీన్స్ రిపీట్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది.
కథ ఎంత మాత్రం కదలకుండా అక్కడక్కడే తిరుగుతున్నట్లుగా సీన్స్ వచ్చి పోతూండటం విసిగించింది. ఎంత సిట్యువేషన్ కామెడీ అయినా సేమ్ సిట్యువేషన్ అటూ ఇటూ అయ్యి...అదే రిపీట్ అయితే బోరే కదా. వీటిన్నటికి కారణం... ఎంత కామెడీ సినిమా అయినా అష్టాచమ్మాలాగానే బలమైన పాయింట్ ఉండాల్సిందే అనే విషయం దర్శకుడు మర్చిపోయారు.
నిజానికి కన్ఫూజన్ కామెడీ కథలు ఎప్పుడూ బాగుంటాయి. అయితే ఈ సినిమాలో ఆ తరాహా కామెడీ కొంతవరకూ వర్కవుట్ అయ్యింది కానీ పోను పోను.. దాన్ని సాగదీసినట్లు అనిపించింది. కన్ఫూజన్ కామెడీ..హనుమాన్ జంక్షన్, పెళ్లాం ఊరెళితే సినిమా స్దాయిలో కన్ఫూజన్ లు తెచ్చి పెట్టే ధ్రెండ్ లు ఎక్కువుగా ఉన్నప్పుడే బాగా పేలుతాయి. ఇక్కడ అదే మిస్సైంది.
అలాగే క్యారక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేసి కథలోకి వచ్చేసరికి చాలా సేపు పట్టింది. దాంతో సినిమా ప్రారంభం ఏంటిరా..ఎంతసేపు ఉన్నా ఏమీ జరగదు అన్న ఫీల్ వచ్చింది. వెన్నెల కిషోర్ సీన్ లోకి వచ్చాకే కథలో వేడి పుట్టింది. అదేదో ఆ పాత్రను ఇంకాస్త ముందు తీసుకువచ్చినా బాగుండేది. సినిమా అవునన్నా , కాదన్నా అతని చుట్టూ తిరిగే కథ కదా.
ఇవే దెబ్బ కొట్టాయి
సినిమా పనిగట్టుకుని తణికెళ్ల భరణి కోసం తీసినట్లు అనిపించింది. ఆయన మీద ఎక్కువ సీన్స్ రాసుకున్నారు. తణికెళ్ల చేత చాలా చోట్ల ఓవర్ యాక్షన్ చేయించారు. అలాగే అవసరాల శ్రీనివాస్ సినిమా ..అతనిపై ఫన్ ఎక్కువ ఉంటుందనుకుంటే అక్కడ నిరాశపరిచారు. ఏది కావాలో అది తగ్గించారు. ఏది అక్కర్లేదో దాన్నే పెంచారు. ఇంక లవ్ స్టోరీ చుట్టూ కన్ఫూజన్ కామెడీ ప్లాన్ చేసినప్పుడు ..ఎంత కామెడీ సినిమా అయినా ఆ లవ్ సీన్లలో కాస్తంత డెప్త్ ఉంటే ..అవి చేసే చేష్టలు మనకు రీజన్ బుల్ గా కనపడి..కామెడీ బాగా పండుతాయి. ఈ విషయం దర్శకుడుకు తెలియదనుకోము.అయినా ఎందుకనో మెయిన్ లవ్ స్టోరీలను బలంగా ఎస్టాబ్లిష్ చేయలేదు. దాన్ని లైట్ గానే కొట్టుకెళ్లిపోయారు.
హెలెట్స్
సినిమా ప్లీ క్లైమాక్స్ లో పనిమనిషి, వెన్నెల కిషోర్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి. అలాగే సినిమా ఫస్టాఫ్ లో అసలు పాటలు పెట్టకపోవటం మరో రిలీఫ్. అలాగే ట్రైలర్ చూసిన వారంతా ఈ సినిమాలో గే వ్యవహారాలు ఉన్నాయేమో అని కంగారుపడ్డారు. (అఫ్ కోర్స్ ఉత్సారపడి వెళ్లేవారు ఉంటారనుకోండి) లక్కీగా సినిమాలో అలాంటి థ్రెడ్ ఏమీ లేదు. కేవలం ఒక కామెడీ సీన్ తోనే సరిపెట్టారు. సినిమాలో ఎక్కువ భాగం షెరటాన్ హోటల్ సూట్ లోనూ, తణికెళ్ల ఇంటిలోనూ లాగేసారు.. నిజంగా ఆడియన్స్ బోర్ ఫీలవకుండా అలా తీయటం మామూలు విషయం కాదు. దర్సకుడు ఈ విషయంలో హ్యాట్సాఫ్ చెప్పాలి.
టెక్నకిల్ గా..
ఈ లోబడ్జెట్ సినిమాని చాలా రిచ్ గా అనిపించేలా చూపించటంలో టెక్నికల్ క్రూ కష్టమంతా కనిపిస్తుంది. ఇక్కడ ఓ దర్శకుడునో,కెమెరామెన్ నో , మరొక టెక్నీషియన్ నో విడిగా మెచ్చుకోలేం. అంతా కలిసి సినిమాని బాగుండేలా తీసారని మెచ్చుకోవాలనిపించేలా చేసారు. ఎక్కడా సెట్టింగ్స్ లేకుండా న్యాచురల్ లొకేషన్లలో తీసిన ప్రతి ఫ్రేమ్ కలర్ ఫుల్ గా ఉంది. అలాగే నటీ నటుల హావ భావాలే సినిమాని చూడబుల్ గా చేసాయి.
నటీనటులు
కొంత ఓవర్ యాక్షన్, కొంత న్యాచురల్ యాక్షన్ తో నటీనటులంతా అలరించారు. నటన విషయం అని కాదు కానీ అవసరాల శ్రీనివాసే బాగా నిరుత్సాహపరిచారు.
బోటమ్ లైన్
అయితే తెలుగు నాట జబర్దస్త్ లాంటి కామెడీ షోలు రాజ్యమమేలుతున్న ఈ రోజుల్లో ఈ లైటర్ వీన్ కామెడీ ఏ మాత్రం జనాలకు పడుతుందో చూడాలి. అలాగే మల్టిఫ్లెక్స్ లను టార్గెట్ చేసినట్లున్న ఈ సినిమా బి,సి సెంటర్లు కష్టమనిపిస్తుంది. లో బడ్జెట్ కాబట్టి ఎక్కడ కొద్దిగా ఆడినా రికవరీకు లోటుంటుందు.