రొటిన్ గా బలి ('కాదలి' రివ్యూ)
అప్పట్లో శోభన్ బాబు ఒకరికి తెలియకుండా మరొకరని పెళ్లి చేసుకుని...ఇద్దరినీ మ్యానేజ్ చేస్తూ..నలిగిపోయే... కథలు వరస పెట్టి చేస్తే , కొద్ది కాలం తర్వాత వాటినే కొద్ది పాటి మార్పులతో మోహన్ బాబు వంటి హీరోలు అల్లరి మొగడు లాంటి కథలు, ఆ తర్వాత జగపతిబాబు చేసి హిట్స్ ని తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే ఇద్దరి పెళ్లాల ముద్దుల మొగడు కథలు బోర్ కొట్టాయో ఏమో.. ఈ మధ్యన అటువంటి సినిమాలు పూర్తిగా తగ్గాయి. అయితే ఆ కాన్సెప్టుల మీద మోజు పోక...రీసెంట్ గా నాని కూడా ఆ స్టోరీ లైన్ నే కొద్దిగా మార్చి 'మజ్ను' అంటూ ఇద్దరు అమ్మాయిల మధ్యన ఇరుక్కుని,మ్యానేజ్ చేసే కుర్రాడి కథచేసిపారేసాడు.
ఇదిగో ఇప్పుడు మరింత అడ్వాన్స్ ధాట్ అంటూ అదే ఐడియాని ఇంకొంచెం అటూ ఇటూ చేసి...ఇద్దరు అబ్బాయిలతో ఒకేసారి డేటింగ్ చేస్తూ... వారిలో ఎవరిని ఎంచుకోవాలని మధనపడి,నలగిపోయే అమ్మాయి కథని మన ముందుకు తీసుకువచ్చారు. ఇదే నేటి తరం యూత్ పరిస్దితి అన్న లెవెల్లో సినిమాతో స్టేట్ మెంట్ ఇచ్చేసే ప్రయత్నం చేసేసాడు. అయితే రొటీన్ గా తరతరాలు నుంచి వస్తూ సక్సెస్ అవుతున్న ఈ స్టోరీ లైన్ ...ఈ సారి అదే స్దాయి విజయం అందుకుంటుందా..ట్రైలర్స్ లతో , టైటిల్ ల్లో కొత్తదనం చూపి క్రేజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా దర్శకుడు సినిమాలోనూ కొత్త దనం చూపాడా..వంటి విషయాలు తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే.
కథేంటి
సంప్రదాయ పెళ్ళి చూపులు సెట్ కాక డాక్టర్ బాంధవి (పూజా కె.దోషి) తన ఫ్రెండ్స్,బామ్మ సలహా తో ఓ కుర్రాడిని తనే ఎంచుకుని ప్రేమించి పెళ్లికోవాలని ఫిక్సై అన్వేషణ మొదలెడుతుంది. ఆ క్రమంలో కార్తీక్ (హరీష్ కల్యాణ్), క్రాంతి (సాయి రోనక్) తో పరిచయం ఏర్పడుతుంది.ఇద్దరూ బాగానే ఉండి..ఆమెకు నచ్చినా, అందరిలాగే వాళ్లకూ కొన్ని ప్లస్ లు మైనస్ లు ఉండటంతో సమస్య వస్తుంది. దాంతో వీళ్లిద్దరిలో ఎవరిని జీవిత భాగస్వామిగా చేసుకుని, లైఫ్ జర్ని చేయాలో డిసైడ్ చేసుకోలేని డైలమోలో పడుతుంది. అవేమి తెలియని పాపం ఇద్దరు కుర్రాళ్లు మాత్రం ఆమెతో ప్రేమ కంటిన్యూ చేస్తూంటారు. ఈ పరిస్దితుల్లో బాంధవి ఎవరిని,ఎలా తన భర్తగా ఎంచుకుంటుంది...ఏం నిర్ణయం తీసుకుంటుంది అనే విషయం తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
సాదాసాదీగా అనిపించే ఈ స్టోరీ లైన్ ...సినిమా కథగానూ ట్రీట్ మెంట్ లోనూ అంతే సాదాసాదీగా తెరకెక్కించాడు దర్శకుడు. దాంతో మనకు ఎక్కడా కొత్తగా ఫీలవ్వం. తెరపై కొత్త నటీనటులే తప్ప కొత్త సీన్స్, కొత్త క్యారక్టర్స్, కొత్త కథ,కొత్త స్క్రీన్ ప్లే కనపడదు. పెద్ద సినిమాకు కొత్త కనపడకపోయినా ఎడ్జెస్ట్ అవగలం..ఎందుకంటే పెద్ద సినిమాల్లో ఎన్నో ఎట్రాక్షన్స్ ఉంటాయి. కానీ చిన్న సినిమాకు కొత్తదనం అనేదే ప్రాధమిక సూత్రం. అదే మిస్సైనప్పుడు ఇంక ఏం చూసి ఆ సినిమా బాగుందనుకోవాలి.
అదే కాదలి సినిమాలో కనపడుతోంది. టైటిల్ పెట్టడంలో చూపిన క్రియేటివిటీని దర్శకుడు అక్కడితోనే వదిలేసాడు. సినిమాని పరమ రొటీన్ గా నడిపాడు.
అయినా ఓ పది సినిమాలు డైరక్ట్ చేసేసి, అప్పటికప్పుడు హీరో డేట్స్ ఉండి, కథ లేక..సర్లే ఏ పాత హిట్ సినిమానో కాస్త మార్చి చేద్దాము అనుకుని ఉత్సాహపడితే పోన్లే అవసరం అంటూ క్షమించవచ్చు. కానీ కొత్తగా పరిచయం అయ్యే డైరక్టర్స్ కూడా అవే రొటీన్ కథాంశాలను అంతే రొటీన్ గా తీస్తూంటే మాత్రం కొత్త నీరు ఇంత పలచగా... నిరుత్సాహంగా ఉందేంటి అనిపిస్తుంది.
అదే ప్రేమదేశంకి ఈ సినిమాకూ తేడా
ప్రేమ దేశం సినిమాను గుర్తు చేసే ఈ సినిమాకి స్క్రీన్ ప్లేనే మైనస్ గా నిలిచింది. ప్రేమదేశం డైరక్టర్ పాయింటాఫ్ వ్యూలో నడిస్తే..ఈ సినిమా మొత్తం హీరోయిన్ పాయింటాఫ్ వ్యూలో నడుస్తుంది. ఇక ఉన్న కాస్తంత చిన్న కథని స్క్రీన్ ప్లేతో మెప్పించాల్సింది పోయి బోర్ గా సీన్స్ రాసుకుంటూ,వాటిలో ఏ మాత్రం కొత్తదనం లేకుండా చూసుకుంటూ వరసపెట్టి పేర్చుకుంటూ పోయాడు దర్శకుడు. అలాగే ప్రేమదేశంలో డైరక్టర్ కదిర్ ..తెలివిగా అప్పటికే బాగా పాపులర్ అయిన టబుని ఎంచుకున్నారు. దాంతో సినిమా ఆమె మేజర్ సీన్స్ ఆమెపైనే ఉంటూ,ఆమె చుట్టూ కథ జరిగినా...డైరక్టర్ పాయింటాఫ్ వ్యూలో కథ నడిపినా సమస్య రాలేదు.
అదే ఈ సినిమా విషయానికి వస్తే... ఎవరో తెలియని కొత్త హీరోయిన్ పాయింటాఫ్ లో కథ నడుస్తూంటే...ఆమెతో ఐడింటెటీ అయ్యి..ఆమె ఎమోషన్స్ తో భాగస్వాములం అవ్వాలంటే కాస్త కష్టమనిపిస్తుంది. అఫ్ కోర్స్ కొత్త హీరోయిన్ ని తీసుకున్నా...దర్శకుడు తన టాలెంట్ తో అది మరిపించగలిగే సామర్ధ్యం ప్రదర్శించగలగాలి. ఫస్టాఫ్ లో వచ్చిన సీన్స్ చాలా వరకూ సెంకండాఫ్ లోనూ రిపీట్ అవటం, క్లైమాక్స్ కూడా అర్దాంతరంగా ముగిసిందనిపించటం దర్శకుడు అవగాహనా లేమే.
హెలెట్స్
మళయాళంలో 2014లో వచ్చిన Ohm Shanthi Oshaana సైతం ఓ అమ్మాయి దృష్టికోణంలో జరుగుతుంది. తెలుగులో అలాంటి కథలు అరుదు. మన కథలన్నీ హీరో చుట్టూ తిరిగే కథలతోనే నడుస్తాయి. అయితే ఈ కొత్త దర్శకుడు ఈ సినిమాతో అలాంటి ప్రయత్నం చేసారు. అక్కడిదాకా ఈ దర్శకుడుని మెచ్చుకోవచ్చు. అలాగే డైలాగులని చాలా సహజంగా మనం రోజూ వారి మాట్లాడుకునేటట్లు రాసుకున్నారు. అవీ చాలా చోట్ల మెప్పిస్తాయి. అలాగే సినిమాలో కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది.
మైనస్
చిన్న సినిమాకు కథ,కథనం ప్రధాన ఎట్రాక్షన్ గా ఉండాలి. మన సినిమాలో స్టార్స్ ఉండరు కాబట్టి మిగతా అన్ని విభాగాలు స్టార్స్ స్దాయి ఫెరఫార్మన్స్ ఇస్తేనే గెలుస్తాము అనే భావనతో పనిచేస్తేనే చిన్న సినిమా పెద్దదవుతుంది. అదే ఇక్కడ లోపించింది. కొత్త హీరోలు ఇద్దరూ తమ పరిధిలో బాగానే ట్రై చేసినా కథలో డెప్త్ లేకపోవటంతో.. వారి నటన రాణించలేదు. ఈ కథ అల్లుకున్న విధానాన్ని బట్టి హీరోయిన్ ఈ సినిమాకు కీలకమై నిలవాలి. ఆమె బావభావాలు సినిమాకు ప్లస్ అవ్వాలి. అయితే ఆమే ఈ సినిమాకు మైనస్ అయ్యింది. ఫన్ పెద్దగా లేదు. అలాగే ఎమోషన్ తో నిలిచిపోవాల్సిన క్లైమాక్స్...పూర్తిగా తేలిపోయింది.
టెక్నికల్ గా...
ఈ సినిమాతో పరిచయమైన ఈ కొత్త డైరక్టర్ .. రొటీన్ స్టోరీ లైన్స్ తో కొత్తగా ఏమీ చేయలేమని ఈ ప్రయత్నంతో అయినా అర్దం చేసుకోవాలి. సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ ఏ సినిమాలోనూ మనని ఇంతలా బాధపెట్టి ఉండదు. పైన చెప్పుకున్నట్లు సినిమాలో కెమెరా విభాగం అప్ టు ది మార్క్ పనిచేసింది. శ్రీలంకలో షూట్ చేసిన లొకేషన్స్ అద్బుతం అనిపిస్తాయి. ప్రవీణ్ శ్యాం సంగీతం అద్బుతం కాదుకానీ ఓకే అనిపిస్తుంది. కానీ లవ్ స్టోరీలకు జనాల్లోకి వెళ్లిపోయే పాటలు కావాలి. అవి మిస్ అయ్యాయి. మిగతా డిపార్టమెంట్స్, నిర్మాణవిలువలు ఓకే.
బోటమ్ లైన్
సాధారణంగా ప్రేమ కథలకు మహారాజ పోషకులు యూత్. కాలేజ్ ఎగ్గొట్టి సినిమాకి రావాలన్నా, తమ గర్ల్ ఫ్రెండ్ ని సినిమాకి తీసుకుని రావాలన్నా... ఆ స్దాయిలో సినిమాలో ఉండాలి. అందులోనూ ఇప్పటి యూత్ వరల్డ్ సినిమా చూసేస్తున్నారు. ఖాళీ ఉంటే సోషల్ మీడియాలో సరదాగా గడుపుదామా లేక సినిమా కు వెళ్దామా అనే పందెం వేసుకునే టట్లు ఉన్నారు. వాళ్లను లాగగలగాలి. అయితే ఈ సినిమాలో యూత్ ని థియోటర్ వైపుకు లాక్కెచ్చి, చివరి దాకా కూర్చేబెట్టే అంశాలు పెద్దగా ఏమీలేవు కాబట్టి .. ఓపినింగ్స్ వరకూ ఓకే అనిపించుకున్నా..తర్వాత పరిస్దితి ఏంటనేది వేచి చూడాల్సిన అంశమే.