Movies | Music | Masti Close Aha Ad
Watch Latest Movies & Web Series on AHA!
Movies | Music | Music

Virus Movie Review

June 30, 2017
ASN Films banner
Sampoornesh Babu, Geeth Shah, Nidhisha, Vennela Kishore, Viva Harsha, Chammak Chandra
Sunil Kashyap
VJ
Marthand K Venkatesh
Meenakshi Bhujang
Salim MD and Srinivas Mangala
SR Krishna

సోకనివ్వకండి (సంపూ 'వైరస్' రివ్యూ)

సోషల్ మీడియా సాయింతో ఎదిగిన హీరో సంపూర్ణేష్ బాబు. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో ఉన్న లోటుపాట్లు,దాన్ని అడ్డం పెట్టుకుని చేసే నేరాలుపై సినిమా చేయటం మెచ్చుకోదగ్గ విషయమే. అక్కడివరకూ గ్రేట్. అయితే ఆ సినిమా అదే సోషల్ మీడియా వినియోగిస్తున్న జనం మెచ్చుకునేలా ఉందా...లేదా...చూసుకోలేదు. డీజే డైలాగులా...ఈ సినిమా చేసి సోషల్ మీడియాకు ఏం సందేశం ఇస్తున్నట్లు అన్నట్లు తయారైంది. అయితే ఇవన్నీ పట్టించుకుంటున్నట్లు లేడు సంపూ. హిట్,ఫ్లాఫ్ లకు సంభందం లేకుండా...తన సినీ ప్రయాణం కొనసాగిస్తున్న సంపూ.. తాజాగా వైరస్ అనే సినిమాతో థియోటర్స్ లో దిగాడు. ఆ సినిమా ఎలా ఉంది...అని సంపూ అభిమానులకు ఆసక్తి ఉండటం సహజం. బాగుంటే ఈ వీకెండ్ ప్లాన్ చేసుకోవాలి కదా.

కథేంటి

యుఎస్ లో నెలకు 20 లక్షలు సంపాదించే ప్రొఫెషనల్ హ్యాకర్ కిట్టు(సంపూర్ణేష్ బాబు). ఓ రోజు ఏమైందో...ఏం తెలిసిందో ఏమో...బంగారం లాంటి ఆ ఉద్యోగం వదిలేసి హైదరాబాద్ లోని ఎస్. ఆర్. నగర్ లోని వంశీ ఎన్క్లేవ్ కి వచ్చేసి అక్కడ కేబుల్ బోయ్ గా ఐదు వేల జీతానికి చేరిపోయాడు. అంతేకాకుండా ఆ అపార్టమెంట్ లో అక్రమ సంభందాలు పెట్టుకున్నవాళ్లని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజుకోవటం మొదలెడతాడు. ఈ లోగా తను ఉంటున్న అపార్టమెంట్ ప్రెసిడెంట్ రామారావు మర్డర్ జరుగుతుంది. ఆ కేసు మన సంపూపై పడటంతో..పోలీస్ లు వచ్చి అరెస్ట్ చేస్తారు. అసలు అంత సంపాదన వదులుకుని వచ్చి వచ్చి ఈ మర్డర్ కేసులో ఇరుక్కోవటం ఏమిటి... అసలు సంపూ ప్లాష్ బ్యాక్ ఏమిటి...ఈ కథలో అనన్య ( హీరోయిన్) పాత్ర ఏమిటి....ఈ విషయాలన్నిటికి... వైరస్ అనే టైటిల్ పెట్టడానికి కారణం ఏమిటి...వివరాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. అంత ఓపిక లేకపోతే..క్రింద స్పాయిలర్ ఎలర్ట్ లో అసలు విషయం ఇచ్చాం చదవండి.

ఎలా ఉంది

ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వల్ల జరుగుతున్న నేరాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కటం మంచి విషయమే. ఎంచుకున్న స్టోరీలైన్ వరకూ బాగానే ఉంది కానీ.. వెండితెరపై దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు దర్శకుడు. అలాగే తాను చెప్పాలనుకున్న పాయింట్ కోసం తయారుచేసుకున్న సీన్స్ ఎక్కడా ఆకట్టుకునే విధంగా లేవు.

ఇక దర్శకుడు సినిమా కోసం ఎత్తుకున్న పాయింట్ బాగానే ఉన్నప్పటికి..అందుకు తగ్గ స్క్రీన్ ప్లే, సీన్స్ తయారు చేసుకోలేకపోయాడు. అంతేకాకుండా ఇష్టం వచ్చినట్లు వచ్చిపడే పాటలు, అర్దం పర్దం కాని కామెడీ సీన్స్ విసిగిస్తాయి. హీరోయిన్ ని కేవలం ....ఓ గ్లామర్ డాల్ లాగే చూపారు. ఇక హాస్య నటులు వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర, వైవ హర్షలు కామెడీ ఓకే అన్నట్లుగా ఉంది. సునీల్ కాశ్య‌ప్ సంగీతం సినిమాకు తగినట్లుగా డల్ గా ఉంది.

సంపూ ఎలా చేసాడంటే...

తన చిత్రమైన ఆహార్యం, మేనరిజంలతో 'హృదయ కాలేయం' అంటూ మన ముందుకు వచ్చిన సంపూర్ణేష్ బాబు ఆ సినిమా తెచ్చిన క్రేజ్ తో ఆ తర్వాత వరస సినిమాలు అయితే చేయగలిగాడు.కానీ సరైన కథా బలం ఉన్న సినిమాని పట్టుకోలేక హిట్ లు కొట్టలేకపోయాడు. అయితే 'హృదయ కాలేయం' పుణ్యమా అని... సంపూ సినిమా అంటే అల్లరి నరేష్ సినిమాలోలాగ కామెడీ ఉంటుందని ఆశించి వెళ్లే అభిమానులను అయితే తయారు చేసుకోగలిగాడు. అలాగని ఆయన చేస్తున్న ప్రతీ సినిమా తెగ నవ్వించేస్తున్నాయని కాదు...నవ్వించే ప్రయత్నం చేస్తున్నాయి అంతే...చాలా వరకూ విఫలమవుతున్నాయి.

ఇక ఈ సినిమాలో సంపూ విషయానికి వస్తే..అతన్ని ఇష్టపడేవారికి కొంతలో కొంత నచ్చే సినిమా ఇది. సంపూ తన రెగ్యులర్ మ్యానరిజంలు, యాక్టింగ్ మర్చిపోకుండా,రిపీట్ చేసారు. అతను ఇక కొత్తగా ట్రై చేయటం అనవసరం వీటితోనే తన నటనా జీవితం కొనసాగించేయాలనే నిర్ణయానికి వచ్చినట్లున్నారు. చక్కగా గుర్తింపు వచ్చింది కాబట్టి సరైన కథలు, పాత్రలు ఎంచుకుంటూ తన యాక్టింగ్ ని మెరుగుపరుచుకుంటే ఖచ్చితంగా మంచి స్దాయికి వెళ్లే అవకాసం ఉంది. దాన్ని తనంతట తానే మిస్ చేసుకుంటున్నారు అనిపిస్తుంది..సంపూ వరస సినిమాలు చూస్తూంటే.

టెక్నికల్ గా

సినిమా సాంకేతిక విషయాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సంపూ సినిమాలకు డైలాగలును ప్రత్యేకంగా డిజైన్ చేస్తేనే పేలుతుందని హృదయకాలేయం విషయంలో ప్రూవ్ అయ్యింది. దాన్ని వదిలేసారు ఈ దర్శక,రచయితలు. అలాగే ఎడిటింగ్ విషయానికి వస్తే...ఇప్పటికైనా ఓ ఇరవై నిముషాలు ట్రిమ్ చేస్తే...ఇంకాస్త చూడబుల్ గా తయారువు అవుతుంది.

ఫైనల్ గా

ఈ వైరస్ మనకు సోకకుండా ఉంటే బాగుండేదని సినిమా చూసాక అనిపిస్తుంది కాబట్టి..తగు జాగ్రత్తలు తీసుకోవటం అవసరం.

స్పాయిలర్ ఎలర్ట్

కాఫీ షాప్ లో పనిచేసే కిట్టు టాలెంట్ ని చూసి అన‌న్య‌(నిధిషా) మాస్ట‌ర్ డిగ్రీ అమెరికాలో చేయ‌మ‌ని ప్రొత్స‌హిస్తుంది.. దీంతో మాస్ట‌ర్ డిగ్రీ పొంది మంచి సాప్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. అయితే అత‌డికి అండ‌గా నిలిచి,ఎదుగుదలకు కారణమైన ఆన‌న్య ఆత్మ‌హ‌త్య చేసుకుంటుంది.. అస‌లు ఆమె ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకుందో తెలుసుకునేందుకు కిట్టూ రంగంలోకి దిగుతాడు..

ఆ క్రమంలో ‘వైరస్ డాట్ కాం’ అనే వెబ్‌సైట్‌లో అమ్మాయిల అశ్లీల వీడియోలు పెడుతూ ఓ ముఠా దారుణాలకు పాల్పడుతోందని, వారికి హీరోయిన్ ..చావుకి మధ్య లింక్ వుందని సంపూ తెలుసుకుంటాడు.ఇది ప్లాష్ బ్యాక్ లో వస్తుంది. అసలు ఆ వెబ్‌సైట్‌ని ఎవరు నిర్వహిస్తున్నారు అనే విషయం ఎలా సంపూ కనుక్కున్నాడనేది అనే ప్రాసెస్ లో జరిగేదే అసలు కథ.