Movies | Music | Masti Close Aha Ad
Movies | Music | Music

Anando Brahma Movie Review

August 18, 2017
70mm Entertainments
Taapsee Pannu, Srinivasa Reddy, Shakalaka Shankar, Vennela Kishore, Posani Krishna Murali, Tanikella Bharani, Vidyllekha Raman and Prabhas Srinu, Thagubothu Ramesh
Anish Tarun Kumar
Shravan Katikaneni
Sabbani Ramakrishna and Monika Nigotre Sabbani
Mahi V Raghav
K (Krishna Kumar)
Vijay Chilla and Shashi Devireddy
Mahi V Raghav

ఆనందమేది... ఖర్మ!!('ఆనందో బ్రహ్మా' మూవీ రివ్యూ)

సాధారణంగా దెయ్యాలు ఏం చేస్తూంటాయి....వాటి వృత్తి ధర్మమేమిటి...అవి ప్రొద్దునే లేచింది మొదలు మనుష్యులను భయపెడుతూ ఎందుకు బిజీగా ఉంటాయి. అవీ మనుష్యుల నుంచి వచ్చినవే కదా...మనుష్యులంటే అంత ద్వేషం ఎందుకు.. అలాగే మరీ అల్లరి చిల్లరి వ్యవహారంగా...కిటీకీ తలుపులు మూయడం, తీయటం, టీవీ ఆన్‌ చేయడం , నేల మీద వున్న బంతిని పైకిలేపడం, అదోలా అర్థరాత్రి పాటలు పాడడం చేయటమెందుకు.. అంతగా కాలక్షేపం కాకపోతే ..ఏ ఫేస్ బుక్ లోనో, ట్విట్టర్ లోనో పోస్ట్ లు పెట్టుకుంటూ,వాదనలు చేసుకుంటూ, సెల్పీలు దిగుతూ వాట్సప్ లలో షేర్ చేసుకుంటూ, మరీ విసుగొస్తే తమపై తీసిన దెయ్యం వీడియోలుని, సినిమాలనూ యూట్యూబ్ లో చూస్తూ కాలక్షేపం చెయ్యచ్చు కదా.

అబ్బే..అవేమీ వాటికి పట్టవు..ముఖ్యంగా సినిమాల్లో కనిపించే దెయ్యాలకు..ఇంకా పాత కాలం సినిమాల్లో దెయ్యాల్లాగ ఓ పాడు పడి, బూజులు పట్టిన ఇంటిని పట్టుకుని వేళ్లాడుతూ కాలక్షేపం చేస్తూంటాయి. తమ బయోపిక్ లు తమ జీవిత సంఘటనలు జనాలు తీస్తున్నారని తెలిసినా కొత్తగా, డిఫరెంట్ గా ఉండటానికి ప్రయత్నించవు. దగాపడిన దెయ్యాలు-వాటికి మనుష్యులు సాయిపడిన కథా,కథనాలతో సినిమాలు తీసి, మనుష్యులు తమని తాము హైలెట్ చేసుకుంటున్నారని తెలిసినా అడ్డుపడవు.

అందులోనూ ఈ మధ్యన ఓ కొత్త ట్రెండ్ మొదలైంది. దెయ్యాలును చూసి భయపడటం మానేసి నవ్వేసుకోవటం జనం మొదలెట్టారు. ఇప్పుడు మరో దర్శకుడు ..మరో అడుగు ముందుకేసి... మనుష్యులను చూసి దెయ్యాలు భయపడే కథ చెప్తున్నా ...అంటూ ముందుకు వచ్చాడు.. మరి ఈ సారి వచ్చిన ఈ కొత్త దెయ్యాల కథేంటి..మనుష్యులను చూసి భయపడాల్సిన పరిస్దితి వాటికేం వచ్చింది... అందులో నవ్విటానికి ఏముంది...మనుష్యులేనా..దెయ్యాలు కూడా ఈ సినిమా చూస్తాయా......వంటి విషయాలు కోసం రివ్యూలోకి వెళదాం.

కథేంటి..

అనగనగా ఓ దెయ్యాల కొంప. అందులో తాప్సీ, విజయ్ చందర్ పాటు మరో రెండు దెయ్యాలు అక్కడే నివసిస్తూ ఉంటాయి. వాటి మధ్య ఎమోషన్స్, అనురాగం, ఆత్మీయత, అప్యాయత, మమకారాలతో ప్రేమాలయం సినిమాని తలపిస్తూ జీవిస్తూంటాయి. ఈ లోగా ఆ ఇంటిని అమ్మేయటానికి ఆ ఇంటి యజమాని ఎన్నారై రాము (రాజీవ్ కనకాల) ప్రయత్నాలు మొదలెడతాడు. అయితే ఆ ఇల్లు వదలటం ఇష్టపడని దెయ్యాలు...కొనుక్కోవటానికి వచ్చేవాళ్లని భయపెడుతూంటాయి. దాంతో ఆ ఇల్లు దెయ్యాల కొంప అని బయిట పాపులర్ అయిపోతుంది. ఇలా అయితే ఇల్లు అమ్మడం కష్టమని భావించిన రాముని ఓ రోజు సిద్దు (శ్రీనివాసరెడ్డి) కలిసి ఓ సలహా ఇస్తాడు.

తాను తన ఫ్రెండ్స్ తో కలిసి ఓ నాలుగు రోజులు ఆ ఇంట్లో ఉంటామని..అక్కడ దెయ్యాలు లేవని ప్రూవ్ చేస్తామని, అప్పుడు ఎవరైనా ధైర్యంగా ఆ ఇల్లు కొనుక్కుంటారని చెప్తారు. రాము సరే అంటాడు. అప్పుడు ఆ ఇంట్లోకి రకరకాల కారణాలతో డబ్బు అత్యవసరమైన సిద్దు, ఫ్లూట్ రాజు (వెన్నెల‌కిషోర్‌) , తుల‌సి (తాగుబోతు ర‌మేష్‌), బాబు (ష‌క‌ల‌క శంక‌ర్‌) వస్తారు. మ‌రి ఆ ఇంట్లోకి వెళ్లాక వాళ్ల‌కి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? దెయ్యాల్ని చూసి మ‌నుషులు భ‌య‌ప‌డ్డారా? లేక మ‌నుషుల్ని చూసి దెయ్యాలే భ‌య‌ప‌డ్డాయా? ఇంత‌కీ ఈ కథలో అసలు ట్విస్ట్ ఏమిటి? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పైనే చూడాలి.

వాటీజ్ ఇన్ వాట్సప్ వీడియో

ఆ మధ్యన వాట్సప్ లో ఓ వీడియో వచ్చింది. అందులో ఒకడు ఫుల్ గా మందు కొట్టేసి ఉంటాడు. ఆ విషయం తెలీని ఓ ఆడ దెయ్యం వాడి వెంట పడి...రకరకాలుగా భయపెట్టాలని ట్రై చేస్తుంది. తన టెక్నిక్ లన్నీ ప్రయోగిస్తుంది. టీవి లోంచి హఠాత్తుగా ముందుకు వచ్చి మొహంలో మొహం పెట్టి భయపెట్టబోతే వాడు దాన్ని మోహంతో ముద్దు పెట్టుకోబోతాడు. ఇంకోసారి మరో దెయ్యం చేష్టేదో చెయ్యబోతే దాని జుట్టు పట్టుకు కొడతాడు. ఇలా భయం లేకుండా దెయ్యానికి దడ పుట్టిస్తాడు. ఫైనల్ గా ఇలా దెయ్యాలకే ..దడ పుట్టించే ధైర్యం రప్పించే ఫలానా బ్రాండ్ తాగండి..అని ఆ వీడియో ముగుస్తుంది. ఈ సినిమా చూస్తూంటే ఆ వీడియోనే పదే పదే గుర్తు వస్తుంది. ఎందుకంటే ఇందులో ఓ పాత్ర తాగేసి..దెయ్యాలకు భయపడకుండా ఎదురు భయపెడుతుంది. అలాగే మరో పాత్ర రేచీకటి, చెముడుతో ఎదురుగా దెయ్యం వచ్చినా పట్టించుకోని స్దితిలో ఉంటాడు. మరొకడు..పగలంతా యూట్యూబ్ వీడియోలు చూసి రాత్రి అవగానే తాను చూసిన వీడియోల్లో పాత్రను ఏకపాత్రాభినయం చేసేస్తూంటాడు. ఇలా దెయ్యం ఎదురుగా ఉన్నా భయపడని క్యారక్టర్స్ తో కామెడీ చేయటానికి ప్రయత్నించారు. ఇది కొత్త కామెడీ అనుకుంటే ..కొత్తే ...అయితే అనుకున్న స్దాయిలో ఆ సీన్స్ ని రాసుకోలేకపోయారు. కేవలం ఈ పాత్రలు అనుకుని, దెయ్యాలతో వాటికి సీన్స్ వేసుకుని సినిమా మొదలెట్టేసారు. ఎక్కడా డెప్త్ లోకి వెళ్లలేదు. ఎమోషన్ ని రిజిస్టర్ చేయలేదు.

బడ్జెటే కాదు కామెడీ కూడా తగ్గించారు

సినిమా బడ్జెట్ తగ్గాలంటే ఏం చేయాలి? అప్పట్లో ఈ ప్రశ్న ప్రముఖ నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత చక్రపాణి గారిని మిత్రులు అడిగితే..ఆయనో ఆణిముత్యంలాంటి మాట అన్నారు..ఆర్టిస్ట్ ల డబ్బులు ఎగ్గొట్టడమే అని. అదే ఈ రోజుల్లో తక్కువ బడ్జెట్ లో సినిమా అవ్వాలి అంటే...ఏం చేయాలి అంటే ఏ నిర్మాత అయినా వెంటనే తడుముకోకుండా ఇచ్చే సమాధానం... దెయ్యాల కథతో కామెడీ సినిమా తీసేయాలని. ప్రేమ కధా చిత్రమ్ పుణ్యమా అని ఈ దెయ్యం కామెడీ కథా చిత్రమ్ లు వరస పెట్టి రావటం మొదలెట్టాయి. అయితే ఈ మధ్యన చాలా దెయ్యం కథలు నవ్వించలేక నవ్వులు పాలయ్యి డిజాస్టర్స్ అయ్యిపోయాయి. దాంతో దెయ్యాల కామెడీలు దెయ్యాలు కూడా చూసి నవ్వుకోలేని పరిస్దితి ఏర్పడింది. ఈ సమయంలో ప్రతీ సారి దెయ్యాలను చూసి మనుష్యులు భయపడటమేనా, మనుష్యులను చూసి భయపడే దెయ్యాలు ఉండవా..వాటి కథ చెప్తా... ఆనందో బ్రహ్మా అనిపిస్తా...దెయ్యాల కామెడీతో తెగ నవ్వించేస్తా అంటూ ఈ సినిమా వచ్చింది. అయితే అనుకున్న స్దాయిలో సినిమా నవ్వించలేదనే చెప్పాలి. సినిమా లో కామెడీ కూడా బాగా తక్కువగా ఉంది.

ప్లాష్ బాక్ లన్నీ పాతవే

ఈ సినిమాలో ప్రతీ పాత్రకూ ఫ్లాష్ బ్యాక్ ఉంది. అయితే ఈ సినిమా స్పెషాలిటి ఏమిటంటే..ఆ ప్లాష్ బ్యాక్ లన్నీ గతంలో వేర్వేరు సినిమాల్లో వచ్చినవే కావటం. చూసేవాళ్లకు పెద్దగా ఇబ్బంది పెట్టకూడదని దర్శకుడు పాతవాటితోనే లాగించేసినట్లున్నారు. లేకపోతే జనాలకి జ్ఞాపక శక్తి ఉండకపోవచ్చు అనే ఆలోచన కూడా ఉండి ఉండవచ్చు.

ఫస్ట్ సీన్ టాప్

సినిమాలో చెప్పుకోదగ్గ ఎపిసోడ్ ఉందీ అంటే అదీ మొదట పదినిముషాల లోపు తాప్సీ ఇంట్రడక్షన్ కు చెందినదే. గతంలో వచ్చిన The Others (2001) అయినా బాగా పండింది.

హర్రర్ లో థ్రిల్లర్ ట్విస్ట్...

ఇక ఈ సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్ ఒకటుంటుంది. అదీ శ్రీనివాస రెడ్డి , అంజలి కాంబినేషన్ లో వచ్చిన గీతాంజలిని గుర్తు చేయటం యాధృచ్చికమేనా..ఏమో

నవ్వించబోయి...

లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన గంగ త‌ర్వాత తాప్సీ చేసిన హార‌ర్ కామెడీ ఇది. అయితే హిందీలో దుమ్ము రేపుతున్న తాప్సీ పెర్ఫామెన్స్‌కు పెద్ద‌గా స్కోప్ లేదు. గుండె స‌మ‌స్య ఉన్న వ్య‌క్తిగా కామెడీ థెర‌ఫీ చేసుకునే వ్య‌క్తిగా శ్రీనివాస‌రెడ్డి కామెడీ చేద్దామనుకున్నాడు కానీ ఆ సీన్స్ ఏమీ పేలలేదు. అలాగే తాగుబోతు ర‌మేష్ ష‌క‌ల‌క శంక‌ర్ పాత్రల కామెడి సెకండాఫ్‌లో ఓకే అన్నట్లుగా ఉంది. రేచీక‌టి, చెవిటివాడుగా ఉంటూ వెన్నెల‌కిషోర్ చేసే కామెడీ బాగుంది. ష‌క‌ల‌క శంక‌ర్ పవన్, చిరంజీవి వంటి స్టార్స్ ను ఇమిటేట్ చేస్తూ చేసే కామెడీ ఫరవాలేదు. ఇక ప్ర‌భాస్ శ్రీను, విద్యుల్లేఖా రామ‌న్ కామెడి అసలు పండలేదు.

బెంగాలి మూలమైనా

మనుష్యులకు భయపడే దెయ్యాలు అనేది తప్ప ఈ చిత్రం కథలో చెప్పుకోదగ్గ ఎలిమెంట్ లేదు. ఇల్లు అమ్మకండా దెయ్యాలు అడ్డు పడటం అనే ఎలిమెంట్ Bhooter Bhabishyat (2012) అనే బెంగాళి సినిమాని గుర్తు చేస్తుంది. అయితే ఆ సినిమాలో ఉన్న కామెడీలో వన్ పర్శంట్ కూడా ఈ సినిమా స్క్రిప్టు లో తేలకపోయారు. ఇక ఫస్టాఫ్ మొత్తం క్యారక్టర్స్ పరిచయానికే కేటాయించటంతో ఏమీ జరిగినట్లు అనిపించదు. సెకండాఫ్ కథలోకి వెళ్లాడనుకున్నా స్పూఫ్ లతో కాలక్షేపం చేసేసారు. క్లైమాక్స్ ట్విస్ట్ పేలవంగా తేలిపోయింది.

టెక్నికల్ గా

దర్శకుడుగా మ‌హి వి.రాఘ‌వ్‌ స్క్రిప్టుపై మరింత కసరత్తు చేసి ఉంటే ఖచ్చితంగా మంచి సినిమా వచ్చి ఉండేది. అతని దర్శకత్వానికి మాత్రం వంక పెట్టలేం. అలాగే అనిష్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు.

డైరక్టర్ గారూ వీటి సంగతేంటి

చివరకు దెయ్యాలు తమ అవతారం చాలించాయా..లేక వేరే ఇల్లు చూసుకుని వెళ్లిపోయాయా లేక దెయ్యాలు చచ్చిపోయాయా...ఏమయ్యాయి..అర్దాంతరంగా ముగించారు. లేక ఆ దెయ్యాలతో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా...

అలాగే సినిమా ఫ‌స్టాఫ్‌లో దెయ్యాలుండే ఇంట్లోవెళ్లిన జీవా, సుప్రీత్‌లో సుప్రీత్ చివరకు ఏమయ్యారు...అనే విషం తేల్చలేదు. అలాగే..శశాంక్ పాత్ర కూడా అర్దాంతరంగా ముగించేసారు. కథలో కీలకమైన విజ‌య్ చందర్ భార్య శ్రీనివాస‌రెడ్డి ద‌గ్గ‌ర‌కు ఎలా వ‌స్తుందో, ఎందుకు వ‌స్తుందో క్లారిటీ ఇవ్వలేదు.

ఫైనల్ ధాట్

తమ చుట్టు తిరిగే కథతో తీసిన ఈ సినిమా చూడటానికి దెయ్యాలు థియోటర్ కు తరలి వస్తే..వాటినుంచి టిక్కెట్ డబ్బులు వసూలు చేస్తేనే వర్కవుట్ అయ్యే వాతావరణం కనపడుతోంది. అందుకు ప్లాన్ చేసుకోవాలి.

ఏమి బాగుంది: ప్రారంభంలో తాప్సీ ఎపిసోడ్, రొటీన్ లవ్ ట్రాక్, పాటలు లేకపోవటం

ఏం బాగోలేదు: తాప్సీ ప్లాష్ బ్యాక్ , ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్, క్లైమాక్స్

ఎప్పుడు విసుగెత్తింది : దెయ్యాలు భయపడే సీన్స్ ..రకరకాలుగా రిపీట్ చేయటం

చూడచ్చా ?: టీవి బాగా చూసే అలవాటు ఉంటే...కామెడీ బిట్లు గా దీన్ని భరించవచ్చు

ADVERTISEMENT
ADVERTISEMENT