Movies | Music | Music

Vijay Devarakonda's Arjun Reddy Movie Review

August 25, 2017
Bhadrakali Pictures
Devarakonda Vijay Sai, Shalini, Jia Sharma, Priyadarshi, Kamal Kamaraju, Sanjay Swaroop, Kanchana
Rajakrishnan
Sync Cinema
Hari Krishna
Sura Reddy
Ananth Sriram, Sresta, Rambabu Gosala
Krishna Vodapalli
Raj Thota
Shashank
Radhan
Pranay Reddy Vanga
Sandeep Reddy Vanga

అరాచకం...('అర్జున్ రెడ్డి' మూవీ రివ్యూ)

లిప్ లాక్ పోస్టర్ల ద్వారా కావచ్చు.. ప్రోమోల్లోని బూతుల వల్ల కావచ్చు.. అడల్ట్ కంటెంట్ వల్ల కావచ్చు.. ప్రి రిలీజ్ ఈవెంట్లో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడిన ‘అతి’ మాటల వల్ల కావచ్చు.. దీని చుట్టూ నెలకొన్న వివాదాల వల్ల కావచ్చు.. మొత్తానికి అర్జున్ రెడ్డి సినిమాకు ఓ రేంజిలో హైప్ వచ్చిన మాట వాస్తవం. ఆ హైప్ ..బలుపా..వాపా అన్నది అందరికీ డౌటే. ఎందుకంటే... ఈ టైప్ హైప్ ఓపెనింగ్స్ కు ఉపయోగపడొచ్చేమో కానీ.. సినిమాను నిలబెట్టేయదు. కంటెంట్ ఉంటేనే ఏ సినిమా అయినా నిలబెట్టి ఆడుతుంది.

ఆసక్తికర టీజర్.. ట్రైలర్ కట్ చేసినంత మాత్రాన అదే స్థాయిలో సినిమా ఉంటుందని ఆశించలేం. కొన్ని కబాలీలు కావచ్చు. అయితే చిన్న సినిమాకు ఈ మాత్రం ప్రమోషన్ అవసరమే. లేకపోతే ఎప్పుడు వచ్చి, ఎప్పుడు వెళ్లిపోయిందో అర్దం కాని సిట్యువేషన్ ఉంటుంది. ఈ విషయంలో అర్జున్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. అయితే నమ్మి థియోటర్ కు వచ్చిన వారికి న్యాయం చేయగలిగారా.....హైప్ కు తగ్గ కిక్ సినిమాలో ఇవ్వగలిగాడా... దర్శకుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నట్లుగా... ఈ సినిమా డ్రగ్ లాగా పని చేస్తుందని.. ఏళ్ల తరబడి నిలిచిపోతుందని అన్న మాటలు నిజమవుతాయా...ఇంతకీ ఈ సినిమాని వీకెండ్ కు ఫ్యామిలీలు ప్లాన్ చేసుకోవచ్చా అనే విషయాలు రివ్యూలో మాట్లాడుకుందాం.

కథేంటి

కత్తిలాంటి కుర్రాడే కానీ కోపాన్ని కంట్రోలు చేసుకోలేని బలహీనుడు అర్జున్ రెడ్డి (విజయ్ దేవరకొండ) . తన కోపమే తన శత్రువు అన్న రీతిలో అది తన జీవితాన్ని సవాల్ చేస్తుందని ఊహించలేకపోతాడు. మెడికల్ స్టూడెంట్ అయిన అర్జున్...ఓ ఫుట్ బాల్ మ్యాచ్ లో గొడవపడి, క్షమాపణ చెప్పటం ఇష్టం లేక కాలేజీ వదిలి వెళ్లిపోదామనుకుంటాడు. అయితే ఈ లోగా ఆ కాలేజిలో ఫ‌స్ట్ ఇయ‌ర్ ఎంబిబిఎస్ స్టూడెంట్ అయిన ప్రీతి శెట్టి(షాలిని పాండే)ని చూసి ఆగిపోతాడు. ఆమెతో ప్రేమ‌లో ప‌డి, తొలి పరిచయంలోనే ఆమెకు ముద్దు పెట్టేస్తాడు, ఆమె కోసం అదే కాలేజీలో కంటిన్యూ అయిపోతాడు.

కొన్నిరోజులకు ఆ అమ్మాయి కూడా అతన్ని ప్రేమించి, మానసికంగా, శారీరకంగా దగ్గరవుతుంది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకోవాలనుకునే సమయానికి ఆమె ఇంట్లో వాళ్లు కాస్ట్ ఫీలింగ్ తీసుకు వచ్చి..వేరే కులం అంటూ ఆమెకు వేరే పెళ్లి చేసేస్తారు. దాంతో డిప్రెషన్ లోకి వెళ్లిన అర్జున్ రెడ్డి...ఇంట్లోంచి బయిటకు వచ్చేసి డ్రగ్స్,తాగుడు వంటి అలవాట్లకు బానిసైపోతాడు. ఇంతలో అనుకోకుండా హాస్పిటల్ లో చేసిన సర్జరి ఒకటి ఫెయిల్ కావడంతో కేసులో ఇరుక్కుంటాడు. అప్పుడు అర్జున్ రెడ్డి పరిస్దితి ఏమిటి...అతని జీవితం మళ్లీ యధా స్దితికి వచ్చిందా..అతని ప్రేమ కథ ఓ కొలిక్కి వచ్చిందా..అర్జున్ రెడ్డి, ప్రీతిలు క‌లుసుకుంటారా? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఫస్టాఫ్ కేక..

ఖచ్చితంగా ఈ సినిమా న్యూ జనరేషన్ ని టార్గెట్ చేసిందే. అందులో డౌటే లేదు. అప్పట్లో హిందీలో వచ్చిన దేవ్ డి, తమిళ డబ్బింగ్ చిత్రం సూర్య సన్నాఫ్ కృష్ణన్ ని గుర్తు చేసే ఈ అపర దేవదాసు కథ ...ఫస్టాఫ్ ఎక్సలెంట్ అనిపిస్తుంది. సెకండాఫ్ ఈ సాగుడు ఏంటిరా బాబు అనిపిస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్ ఎంత ఎంత ఎంటర్టైనింగ్ గా డీల్ చేసారో, సెకండ్ హాఫ్ అంత డల్ గా రన్ చేసారనిపిస్తుంది , మధ్య మధ్యలో రాహుల్ రామకృష్ణ కామెడీ కొంచెం ఊరట. ఫస్ట్ హాఫ్ లో ప్రతి సీన్ కి వినిపించిన ప్రేక్షకుల చప్పట్లు విజిల్స్ సెకండ్ హాఫ్ లో తగ్గిపోవటానికి కారణం.. హీరో బాధని ఎక్కువగా డెప్త్ గా ఎస్టాబ్లిష్ చేయాలని, పదే పదే అదే విషయాన్ని సీన్స్ లో చూపించడంతో పాటు, అతని క్యారెక్టర్ కూడా దిగజార్చేసారు.

కలిసిరాని క్లైమాక్స్

అలాగే క్లైమాక్స్ క్యారక్టర్ డ్రైవ్ కు తగ్గట్లు ఉండదు. మరో చరిత్ర లాగ నెగిటివ్ క్లైమాక్స్ సూటయ్యే కథ ఇది. సెకండాఫ్ అంతా..లవ్ ఫెయిల్ వాడు ఎంతలా కుంగి కృశించి పోతాడో చూపటానికే కేటాయించాం కదా ..పాపం హ్యాపీ ఎండింగ్ ఇచ్చి ఖుషీ చేద్దామనుకున్నారో ఏమో కానీ బలవంతంగా పాజిటివ్ గా ముగింపు ఇచ్చారు. అదే పెద్ద వెలితి అనిపిస్తుంది. ఇలాంటి క్లైమాక్స్ అనుకున్నప్పుడు మొదటనుంచి అందుకు తగ్గ సీడ్స్ వేసుకుంటూ వస్తే ప్రిపేర్ అవుదుము కదా. అప్పుడు ఇంత నిరాశ అనిపించదు.

ఫస్ట్ టైం డైరక్షన్ ...

దర్శకుడుగా సందీప్ వంగా తొలి చిత్రం అంటే నమ్మబుద్ది కాదు. ఈ మధ్యకాలంలో పరిచయమైన చాలా మంది న్యూ జనరేషన్ ఫిల్మ్ మేకర్లు కన్నా ఎక్కువ ప్రతిభ ఉందనిపించింది. కమర్షియల్ హిట్ కోసం అని, రెగ్యులర్ మూసలో కొట్టుకుపోకుండా..కొత్తదనం కోసం అన్వేషించే అతని ప్రతిభ ప్రతీ ఫ్రేమ్ లోనూ ఆవిష్కృతమై మనని అబ్బుర పరుస్తుంది. కేవలం విజువల్స్ కే ప్రయారిటీ ఇస్తున్న దర్శకులు చాలా మంది ఎమోషన్ ని కూడా అంతే బలంగా చూపితే ఎలాంటి సన్నివేశాలు రూపొందుతాయో, ఏ స్దాయిలో ప్రేక్షకులని ఆకట్టుకోవచ్చో ఈ సినిమా చూసి తెలుసుకోవచ్చు.

అయితే అవసరానికి మించి బోల్డ్ నెస్ చూపించేమో అనిపిస్తుంది చాలా చోట్ల(16 లిప్ లాక్ కిస్ లు). అదే వాస్తవిక ధృక్పధం అంటే చెప్పేదేమీ లేదు. అలాగే స్లో నేరేషన్ లో నే లవ్ స్టోరీ చెప్పాలి అని ఫిక్స్ అయ్యి తీసినట్లున్నాయి చాలా సీన్స్. టెక్నికల్ గా చెప్పాలంటే దర్శకుడిగా సందీప్ కు మొదటి చిత్రమే అయినే మేకింగ్ పరంగా ఇరగదీసాడు. షాట్ డివిజన్ లో విభిన్నత చూపుతూ సీన్స్ కంపోజ్ చేసిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. ట్రీట్ మెంట్ రాసుకునేటప్పుడే కాస్త కంట్రోలులో ఉంటే ఇంత లెంగ్త్ వచ్చేది కాదు.సెంకడాఫ్ విసిగించేది కాదు. అలాగే హీరోయిన్ షాలిని పాత్రలో క్లారిటీ మిస్ అయినట్లుగా అనిపిస్తుంది. హీరోతో ఆమె ప్రేమలో ఎలా పడిందనే విషయంపై పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు. అయితే క్యారక్టర్ డ్రైవన్ గా నడిచే అర్జున్ రెడ్డి పాత్రను డిజైన్ చేసిన తీరు మెచ్చుకోబుద్దేస్తుంది. తెలుగులో ఈ మధ్యకాలంలో ఇలాంటి క్యారక్టర్ డ్రైవన్ కథలు రాలేదు.

తెలుగు ఇమ్రాన్ హష్మీ..దుమ్ము రేపాడు

అర్జున్ రెడ్డి గా విజయ్ దేవరకొండ జీవించాడనే చెప్పాలి. ఆటిట్యూడ్ చూపించే అతని పాత్ర చాలా మందికి కనెక్ట్ అవుతుంది. తన డైలాగ్స్, నటనతో ఆడియన్స్ ను మెప్పించాడు. ఈ సినిమాతో ఖచ్చితంగా విజయ్ స్టార్ ఇమేజ్ వస్తుంది. అలాగే లిప్ లాక్ కలిసి వచ్చి..ఇంక ప్రతీ సినిమాలోనూ కంటిన్యూ చేసి తెలుగు ఇమ్రాన్ హష్మీ అనిపించుకుంటాడేమో.

ఇక ఈ సినిమాలో మరో చెప్పుకోదగ్గ విషయం ఏమిటి అంటే..హీరో ఫ్రెండ్ పాత్రలో రాహుల్ రామకృష్ణ నటన. తన పాత్ర ద్వారా కామెడీను జెనరేట్ చేసి ఆడియన్స్ ను రిలీఫ్ ఇచ్చాడురు. కమల్ కామరాజు, సంజయ్ స్వరూప్, గోపీనాథ్ భట్ తమ పాత్రల పరుధుల్లో బాగా నటించారు.

తెర వెనక బ్యాచ్ సంగతేంటి

ఒరిజినల్ లొకేషన్స్ లో సినిమాను షూట్ చేయటంతో సినిమాకు సహజత్వం కలిగింది. దానికి తోడు కెమెరా పనితనం బాగుంది. ఎడిటింగ్ మరింత షార్ప్ గా చేసి అనవసరమైన సీన్స్ తొలగించేస్తే బాగుండేది. బెటర్ అవుట్ పుట్ కోసం సినిమాను ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది.సంజయ్ రెడ్డి వంగ ఈ సినిమాను ఉన్నత విలువలతో నిర్మించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయింది. అలానే పాటలు కూడా సంధర్భానుసారంగా బాగానే ఉన్నాయి. డైలాగులు సినిమాలో చాలా చోట్ల కేక పెట్టించే స్దాయిలో ఉన్నాయి.

ఫైనల్ థాట్

లవ్, బ్రేకప్ వంటి స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్న కుర్రాళ్లకు ఈ సినిమా 'అరాచకం రా మామా' అనాలనిపిస్తుంది. మిగతావాళ్లకు 'ఏంటి అరాచకం?' అని నిట్టూర్చబుద్దేస్తుంది.

ఏమి బాగుంది: ఫస్టాఫ్ సీన్స్ , ఇంటర్వెల్

ఏం బాగోలేదు: క్లైమాక్స్

ఎప్పుడు విసుగెత్తింది : సెకండాఫ్ లో ఒకే విషయం రిపీట్ అవటం

చూడచ్చా ?: మీరు ఈ న్యూ జనరేషన్ కు చెందిన వాళ్లైతే...ఖచ్చితంగా

ADVERTISEMENT
ADVERTISEMENT