Movies | Music | Music

Spyder Movie Review

September 27, 2017
NVR Cinema
Mahesh Babu, Rakul Preet Singh, SJ Surya, Bharath, Priyadarshi Pullikonda, RJ Balaji, Hareesh Peradi and Chandrakanth
A Sreekar Prasad
Santhosh Sivan
Rupin Suchak
Peter Hein, Anal Arasu, Ravi Varma and Ram-Lakshman
Harris Jayaraj
Tagore Madhu and NV Prasad
AR Murugadoss

స్పై 'డర్' (రివ్యూ)

'స్పైడర్' థియోటర్ లో నా ప్రక్కన ఓ ముగ్గురు పిల్లలు కూర్చుని చాలా ఆసక్తిగా చూస్తున్నారు. అరే పిల్లలు కూడా రిలీజ్ రోజు మార్నింగ్ షోకు బాగానే వచ్చారే.... దశరా సెలవలు అని వచ్చారో లేక మహేష్ ఫ్యాన్స్ ఏమో, (లేక నాలా రివ్యూ రాయటానికి ఏదన్నా సైట్ ఒప్పుకున్నారో ) అనుకున్నా... సినిమా ప్రారంభమైన కాస్సేపటికి మొదలెట్టారు..వాళ్ల నాన్నని , ప్రక్కన కూర్చున్న నన్నూ ... రోబో స్పైడర్ ఎప్పుడు వస్తుందా అని అడగటం. ఆ అడగటం కాస్తా ..కాస్సేపటకి పీకటం గా మారింది... అప్పుడు అర్దమైంది వాళ్లు ఈ సినిమాకు ఏం ఎక్సపెక్ట్ చేసి వచ్చారో... సినిమా ప్రమోషన్ కోసం మొదట వదిలిన గ్లింప్స్ చూసి...ఈ సినిమాలో 'రోబో సాలీడు' ఉంటుంది అని ఫిక్సై వచ్చారని..పాపం సినిమా చివరి వరకూ ఎదురుచూస్తూనే ఉన్నారు...ఆ రోబో సాలీడు ఎక్కడైనా ..ఏదైనా ఓ మూలైనా కనపడుతుందేమో అని... సినిమా అయిపోయింది..వాళ్ల కళ్లలో నిరాశ. సర్లేండి వాళ్ల సంగతి వదిలేయండి..ఎన్నో అంచనాలతో ఈ సినిమాకు వచ్చిన మిగతావాళ్లు హ్యాపీ ఫీలయ్యారా.. అసలు ఈ స్పైడర్ కథేంటి...ఈ సినిమాతో మహేష్ హిట్ కొట్టారా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటంటే

ఇంటిలిజెన్స్ బ్యూరో లో కాల్ ట్యాపింగ్ డిపార్టమెంట్ లో పనిచేసే శివ (మహేష్ బాబు) కొంచెం అత్యుత్సాహి. సొంతంగా ఓ సాప్ట్ వేర్ తయారు చేసి..దాని సాయింతో ట్యాపింగ్ చేసే కాల్స్ లో ఎవరు హెల్ప్ అని అరిచినా, ఏడ్చినా, అనుమాన స్పందంగా బిహేవ్ చేసినా వెంటనే స్వయంగా రంగంలోకి దిగి క్రైమ్ జరగకుండా ఆపుచేసి, జనాలకు సాయిం చేస్తూంటాడు. అలా అతని పనిలో అతను ఉండగా ఓ రోజు ఓ అమ్మాయి చేసిన కాల్ వింటాడు.తన స్నేహితురాలతో తను ఒంటరిగా ఇంట్లో ఉన్నాను..తనకు భయంగా ఉంది అని చెప్పిన అమ్మాయిని రక్షించాలనుకుంటాడు. తన ఫ్రెండ్ అయిన లేడీ కానిస్టేబుల్ ని ఆ ఇంటికి పంపుతాడు. తెల్లారిసరికే...ఆ ఇద్దరూ హత్య చేయబడతారు. అంతేకాకుండా ఆ చంపిన వ్యక్తి ...క్రూరంగా శవాలను సైతం ముక్కలు ముక్కలు గా చేసారని తెలుస్తుంది. దాంతో శివ... ఆ సైకో ఆచూకి తీసి, ఆట కట్టించాలని నిర్ణయించుకుంటాడు. ఆ ప్రాసెస్ లో వెతుకుతూంటే అతనికి సైకో కిల్లర్‌ భైరవ(సూర్య) గురించి తెలుస్తుంది. అతన్ని వెంటాడతాడు. ఆ క్రమంలో ఎన్నో దారణమైన విషయాలు భైరవ గురించి బయిటకు వస్తాయి. ఇంతకీ ఆ భైరవ ఎవరు? అతని నేపథ్యం ఏంటి? సైకోగా ఎందుకు మారాడు.... వరస హత్యలు ఎందుకు చేస్తుంటాడు? ప్రమాదమైన అతన్ని శివ ఎలా అంతమొందించాడు? అనే విషయాలు తెలియాలంటే ‘స్పైడర్‌’ సినిమా చూడాల్సిందే.

మహేష్ ని ముంచింది ఈ క్రాఫ్టే...

తన చేష్టలతో అల్లకల్లోలం సృష్టిస్తున్న సైకో కిల్లర్ ని వేటాడి, వెంటాడి పట్టుకునే తెలివిగల హీరో కథ అనుకున్నప్పుడు ..సాధారణంగా... మొదట సైకో క్రూర చేష్టలు చూపించి...ఆ తర్వాత హీరో అతన్ని ఎలా వలేసి పట్టుకున్నాడు...ఆ పట్టుకునే ప్రాసెస్ లో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి...వాటిని తన తెలివితో హీరో ఎలా దాటాడు వంటి వాటితో నడుపుతూంటారు. దాదాపుగా ఈ స్పైడర్ కధ కూడా పైనుంచిచూస్తే అలాగే కనపడుతుంది. కానీ హీరో క్యారక్టర్ ని పాసివ్ గా మార్చేసి రాసుకున్నారు. అదే సమస్య అయ్యి కూర్చుంది. దాంతో సినిమా అంతా హీరో పూర్తి యాక్షన్ లో ఉన్నట్లే కనపడతాడు కానీ నిజానికి అది విలన్ చేష్టలకు రియాక్షన్ మాత్రమే అని ఒక్క క్షణం ఆలోచిస్తే అర్దమవుతుంది. ఈ సమస్యతో సినిమాలో ఎక్కడా ఒక్కసారి కూడా విజిల్ కూడా వేయాలనిపించే సన్నివేశం ఎదురుకాలేదు.

మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ ని పెట్టుకున్నా...అతనేమి చెయ్యలేని పరిస్దితుల్లో కథని డిజైన్ చేయటం నిజంగా సాహసమే.చాలాసార్లు సినిమా చూస్తున్న మనలాగే అతను కూడా విలన్ చేష్టలకు బిక్క చచ్చిపోయి చూస్తూంటాడు. సినిమాలో సైకో పాత్ర మొదలైన దగ్గరనుంచి ఆ పాత్ర దే పై చెయ్యగా ఉంటుంది. విలన్ యాక్షన్ కు హీరో రియాక్షన్ తప్ప.. పరిస్దితులని హీరో చేతుల్లోకి తీసుకుని విలన్ ని దడదడలాడించే సీన్స్ లేకపోవటంతో విసుగెత్తుతుంది. ఎంతసేపూ విలన్ వెనక హీరో పరుగెట్టడమే తప్ప..విలన్ ని భయంతో ఉరుకెత్తించే సన్నివేశం సినిమాలో లేవు. కాబట్టి ఇది ఓ సైకో కథ..ఎస్ జె సూర్యని విలన్ గా ఎస్టాబ్లిష్ చేయటానికి రాసుకున్న కథ, సినిమా అని చెప్పాలి. ఇది మహేష్ వంటి స్టార్ ఎందుకు గమనించలేకపోయాడో అర్దం కాదు.

విలన్ ఫ్లాష్ బ్యాక్ విచిత్రమే...

సినిమాలో సైకో కిల్లర్ అయిన విలన్ ..కి చెందిన చిన్నప్పటి ప్లాష్ బ్యాక్ చెప్పారు. శ్మశానంలో పుట్టి పెరిగిన అతను ఎదుటి ఏడుపులో ఆనందం వెతుక్కుంటాడని, ఆ ఏడుపు వినటం కోసం హత్యలు చేస్తున్నాడని చెప్పారు. అయితే అది అంత కన్వీన్సింగ్ గా అనిపించదు. చాలా విచిత్రంగా ఉంటుంది. అంతేకాకుండా ఆ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొత్తం ఏదో తమిళ సినిమా చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఎక్కడా తెలుగు వాసన కనపడదు.

మెసేజ్ తో మసాజ్

‘మనకు పరిచయం లేని వాళ్లకు కూడా సాయం చేయడమే నిజమైన మానవత్వం’ అనే అంశం ఆధారంగా తెరకెక్కించిన చిత్రమని, ఫేస్ బుక్ లో లైక్ లు షేర్ లు కన్నా బయిట ఉన్నవారికి నిజమైన ప్రేమను అందించటం మిన్న అని చెప్పిన ఈ సినిమాలో ఆ మెసేజ్ ని బలంగా చెప్పలేక తడబడ్డాడనే చెప్పాలి. ఏదో మొక్కుబడికి మురుగదాస్ సినిమా అంటే మెసేజ్ ఎక్సపెక్ట్ చేస్తారు కాబట్టి ఇరికించాడు అనిపిస్తుంది.

అలా దెబ్బకొట్టావేంటి బాస్

ఈ సినిమా చూస్తూంటే కొరియాలో వచ్చే సైకో థ్రిల్లర్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. అంతేతప్ప మన మహేష్ బాబు చేసిన సినిమాలా అనిపించదు. మహేష్ చేసే ఎంటర్టైన్మెంట్ కానీ, మసాలా కానీ లేదు. ఇంతోటి దానికి మహేష్ ఎందుకు ఇమేజ్ రాని ఏ చిన్న హీరోని పెట్టి ఈ సినిమాని తీసినా బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే మహేష్ సినిమా అంటే అబిమానులకే కాదు రెగ్యులర్ సినిమా ప్రేక్షకులకు కూడా కొన్ని ఎక్సపెక్టేష్స్ ఉంటాయి కదా.

టెక్నికల్ గా హైలెట్స్...

సినిమా లో టెక్నికల్ గా ఏదైనా హైలెట్ ఉందీ అంటే అది సంతోష్ శివన్ కెమెరా వర్క్ మాత్రమే అని చెప్పాలి. యాక్షన్ సీన్స్, పాటలు ఏదనా తన క్లాసీ టచ్ తో అదరకొట్టాడు. ఆ తర్వాత హ్యారీశ్ జైరాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్స్ ని ఎఫెక్టివ్ గా నిలబెట్టింది. పాటలు మాత్రం అంత గొప్పగా లేవు. ఎడిటర్ కు స్పెషల్ గా చేప్పారో ఏమో కానీ కొన్ని కీలకమైన సీన్స్ మాత్రం రేసీగా పరుగెత్తాయి. మిగతావన్నీ స్లోగా నడిచాయి. డైలాగ్స్ యావరేజ్ గా ఉన్నాయి. పీటర్ హెయిన్స్ మాత్రం తన విభాగానికి పూర్తి న్యాయం చేసాడు. నటుడుగా మహేష్, అతనికి ఫెరఫెక్ట్ గా పోటీ ఇస్తూ ఎస్ జె సూర్య నటించారు. రకుల్ ప్రీతి సింగ్ క్యూట్ గా ఉంది. అంతకు మించి ఆమెకు సినిమాలో పెద్ద పాత్రమే లేదు.

ఇక విఎఫెఎక్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. ఇక టెక్నికల్ గా డ్రాబ్యాక్స్ లో సినిమాకు ఎంచుకున్న కథ..అది మహేష్ స్దాయికి తగ్గది కాదు..దానికి రాసుకున్న స్క్రీన్ ప్లే అయితే మరీ దారుణం.

ఫైనల్ థాట్

మహేష్ వంటి సూపర్ స్టార్ .. మంచు విష్ణు వంటి హీరోలు చెయ్యాల్సిన కథలు జోలికిపోకుండా ఉంటే బెస్ట్.

ఏమి బాగుంది: సైకో కిల్లర్ గా ఎస్ జే సూర్య నటన, మహేష్ స్టైల్, రకుల్ గ్లామర్

ఏం బాగోలేదు: స్పైడర్ కథ చూపెడతానని చెప్పి, సైకో కథ చెప్పటం

ఎప్పుడు విసుగెత్తింది : సెకండాఫ్ లో హీరో...విలన్ ని పట్టుకోవటానికి ప్లాన్ చేసిన గేమ్ షో ఎపిసోడ్

చూడచ్చా ?: నిరభ్యంతరంగా... అయితే ఓ కండీషన్ మీకు క్రైమ్ థ్రిల్లర్స్ అంటే విపరీతమైన ఇష్టం ఉండాలి