Movies | Music | Music

Vunnadhi Okate Zindagi Movie Review

October 27, 2017
Sravanthi Movies and PR Cinema
Ram Pothineni, Anupama Parameswaran, Megha Aksha, Sri Vishnu
Sameer Reddy
Srikar Prasad
AS Prakash
Devi Sri Prasad
Sravanthi Ravi Kishore
Kishore Tirumala

వాట్ అమ్మా.. వాటీజ్ దిస్ అమ్మా ...('ఉన్నది ఒకటే జిందగీ' రివ్యూ)

ఫేస్ లు ఎవరివో, ఏమిటో కూడా తెలియని వేల మంది స్నేహితులని కలిగి ఉంటున్న ఫేస్ బుక్ రోజులివి. ఇలాంటి రోజుల్లో... స్నేహమేరా జీవితం..స్నేహమేరా శాశ్వతం అని పాడుకోగలిగే నిజ జీవిత ప్రాణ స్నేహితుని కలిగి ఉండటం.. నిజంగా విశేషమే. అయితే అంతటి ప్రాణ స్నేహితులు కూడా ఒక్కోసారి ఒకరి ప్రాణం మరొకరు తీసుకునే పరిస్దితులు సంభవించవచ్చు.. అదీ... ఓ అమ్మాయి వల్ల (ఆ ప్రాణ స్నేహితులు అబ్బాయిలు అయితేనే సుమా) . అలాంటి మసాలా ఉన్న కథలు భాక్సాఫీస్ కు భలే ఇష్టం. ఆ మధ్య కాలంలో అడపా,దడపా అఫ్పుడప్పుడూ ఇలాంటి కథలు వచ్చి హిట్ అయ్యేవి. కానీ ఈ మధ్యన అలాంటి కథలు కాస్తంత అరుదయ్యాయనే చెప్పాలి. ఆ మధ్యన ఇవివి సత్యనారాయణ గారు...చాలా బాగుంది అంటూ శ్రీకాంత్,వడ్డే నవీన్ లతో ఓ ఇద్దరు ప్రాణ స్నేహితుల కథని తెరకెక్కించి హిట్ కొట్టిన రీతిలో తెలుగులో మళ్లీ ఎవరూ చేయలేదు. అయితే చాలా కాలం తర్వాత హీరో రామ్ ఆ సాహసానికి పూనుకున్నాడు.

డిజిటల్ యుగంలో కూడా డియరెస్ట్ ఫ్రెండ్ అనేవాడు ఒకడుంటాడని చెప్పే ప్రయత్నం చేసాడు. అందుకు తనకు గతంలో నేను శైలజ వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు సాయం ఎంచుకున్నాడు. నేను..నా ఫ్రెండ్ వంటి టైటిల్ పెట్టగలిగే కథతో మన ముందుగు వచ్చాడు. దర్శకుడు కిషోర్ సైతం నేను ..నా నమ్మకం స్దాయిలో నమ్మి ఈ కథని రాసుకున్నాడు.

నిజానికి ...ఏ హీరో అయినా ...వరస ఫ్లాఫ్ ల్లో ఉన్నప్పుడు.. హిట్ ఇచ్చి నిలబెట్టిన దర్శకుడుతో మళ్లీ సినిమా చేస్తున్నారంటే ఆ ప్రాజెక్టు మీద అంచనాలు అనంతం..అనేకం. అదే జరిగింది..రామ్, కిషోర్ తిరుమల కాంబినేషన్ రిపీట్ అయినప్పుడు. అయితే పెరిగిన అంచనాలుని అందుకోవటానికి అన్నట్లుగా రామ్ కష్టపడి మరీ గెడ్డంతో సహా గెటప్ ఛేంజ్ చేసాడు. దర్శకుడు కూడా ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా తెరకెక్కించుకోని...ప్రేమ,స్నేహం మధ్య నలిగే పాత్రలతో నడిచే ప్రేమదేశం లాంటి సబ్జెక్టుని ఎంచుకున్నాడు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా...ఒకసారి జరిగిన మ్యాజిక్ రిపీట్ అవటం అనేది అరుదు. అఫ్ కోర్స్ దాన్ని బ్రేక్ చేసిన కాంబినేషన్ లు ఉన్నాయి. ఆ లిస్ట్ లోకి రామ్, కిషోర్ ఎక్కారా... ఎంతో నమ్మకంగా తెరకెక్కిన 'ఉన్నది ఒకటే జిందగీ' కథేంటి...కథకూ, రామ్ పెంచిన గెడ్డానికి లింక్ ఏమన్నా ఉందా... సినిమా రిజల్ట్ ఎలా ఉండచ్చు వంటి విషయాలు తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే.

జిందగీలో ఉన్న కథ ఇదే...

బాల్య స్నేహితులైన అభి (రామ్), వాసు (శ్రీవిష్ణు) లు ప్రాణ స్నేహితులు కూడా. వీళ్లిద్దరూ తమ స్నేహంలోని మధురిమలు మెల్లిగా (అంటే సినిమా కూడ స్లోగా నడుస్తుంది) పంచుకుంటూ.....మధ్య మధ్యలో ప్రెడ్షిప్ మీద పాటలు గట్రా పాడుకుంటూ...చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూంటారు. చీకూ చింతా లేకుండా చల్లగా జీవితం గడుపుతున్న వారి మధ్యలోకి మహా (అనుపమ పరమేశ్వరన్) అనే హౌస్ సర్జన్ ప్రవేశిస్తుంది. ఇద్దరూ ఒకళ్లకు తెలియకుండా మరొకరు ఆ అమ్మాయితో ప్రేమలో పడతారు. అల్లరి ప్రియుడు సినిమాలో రమ్యకృష్ణ,మధుబాల ...టైప్ లో వీళ్లిద్దరూ... ఓ సుముహూర్తాన తామిద్దరికి తాము ప్రేమలో పడింది ఒకరితోనే అనే విషయం రివీల్ అవుతుంది. అక్కడ నుంచి వాళ్ళ మధ్య మెల్లిమెల్లిగా మనస్పర్థలు మొదలై ఒకరికొకరు దూరమైపోయే స్దాయికి వెళ్లిపోతాయి. మరి అంత గొప్ప ఫ్రెండ్షిప్ ఓ అమ్మాయితో ప్రేమ వలన విడిపోవటం ఏమిటి..అనే ఆశ్చర్యం వేస్తోంది కదా..అందుకు కారణం ఉందీ... అదేంటి....తిరిగి అభి, వాసులు మళ్ళీ ఎలా కలుసుకుని... విడిపోయినందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు, ఫైనల్ గా మహా ని ఎవరు చేసుకున్నారు, ప్రాణ స్నేహితులైన అభి, వాసులు విడిపోవటానికి కారణమైన ఆ డైలాగులు ఏమిటి....ఈ మధ్యలో మేఘన (లావణ్య) క్యారక్టర్ కు ఈ కథలో ఏం పని... వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

వాట్ అమ్మా.. వాటీజ్ దిస్ అమ్మా ...

నిజానికి టైటిల్, ప్రోమోలు చూసి ఏదో కొత్త తరహా కథ చూడబోతున్నాం అనే ఆశని రేకిత్తించారు దర్శకుడు, హీరో. అయితే సినిమా ప్రారంభమైన పది నిముషాలకే అర్దమైపోతుంది. దోస్తానా రోజుల్లో చెప్పబడ్డ ఈ కథ కాస్త ఓల్డ్ టైప్ లో నడుస్తోంది అని, ఇద్దరు స్నేహితులు ..మధ్యలో అమ్మాయి ..ఎవరు త్యాగం చేయాలి వంటి సాజన్ టైప్ సినిమాలు బోలెడు చూసేసిన మనకి కొత్తగా అనిపించదు. దానికితోడు ...దర్శకుడు ఫీల్ గుడ్ మూవిలో ఉన్న ఫీల్ ని మనలోకి ఇంకేలా చేయాలంటే కాస్తంత స్లోగా నడపాలని ఫిక్స్ అయినట్లున్నాడు. దాంతో కథ కదలదూ, సీన్స్ కదలవు...మనం మాత్రం మనకు తెలియకుండానే సీట్లలో అసహనంతో కదులుతూంటాము.

అలాగే అభి,వాసులు ఇద్దరూ ప్రాణ స్నేహితులు అని ఎస్టాబ్లిష్ చేసే సీన్స్ ..మరికొన్ని పెట్టుకుంటే బాగుండేది. ఇక లావణ్య త్రిపాఠి పాత్ర అయితే సెకండాఫ్ ని ఫిల్ చేయటానికి మాత్రమే ఉన్నట్లు ఉంటుంది తప్ప... కథలో ఓ కీలకమైన ఎలిమెంట్ లా అనిపించదు. ఆమెతో రామ్ ప్రేమలో పడే విషయం సైతం స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు. దాంతో ఆ సీన్స్ కూడా చాలా ఉదాశీనంగా,నీరసంగా అనిపిస్తాయి.

పండని ప్రీ క్లైమాక్స్ ..ట్విస్ట్

నిజానికి సెకండాఫ్ ముగియటానికి ముందు వచ్చే ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ తో సినిమా ఒక్కసారి లేస్తుందని దర్శకుడు భావించినట్లున్నాడు. ఫస్టాఫ్ లో జరిగిన సంఘటనలకు కంక్లూజన్ ...అక్కడ దాకా దాచిపెట్టి అక్కడ ఒక్కసారిగా రివీల్ చేసాడు. అయితే ఈ డిజిటల్ రోజుల్లో హీరోయిన్ డైరీ రాయటం, దాన్ని వేరొకరు చదివి... అసలు నిజం తెలుసుకోవటం వంటి విషయాలు కిక్ ఇవ్వలేదు.

ముచ్చటేస్తుంది

సినిమా ఎలా ఉందనే విషయం ప్రక్కన పెడితే దర్శకుడు ఓ కన్విక్షన్ తో ప్రెండ్షిప్ బేస్ మీద ప్రతీ సీన్ అల్లుకోవటం ముచ్చటేస్తుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో పిచ్చి కామెడీలు,పెద్ద పెద్ద ఫైట్స్ పెట్టే ప్రయత్నం చేయలేదు..

అదే కిషోర్ బలం

సెకండ్ హ్యాండ్, నేను శైలజ, 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాలలో కామన్ హైలెట్ అయిన ఓ విషయం కనిపిస్తుంది. అది ప్రతిభావంతంగా రాసుకున్న డైలాగులు. ఈ సినిమాలోనూ డైలాగులు చాలా బాగున్నాయి.

‘క‌ల‌వ‌డానికి ర‌మ్మాన్నావ‌నుకొన్నా క‌ల‌ప‌డానికి అనుకోలేదు’

వ‌య‌సులో ఉన్న‌ప్పుడు ప్రేమ గురించి తెలుస్తుంది...వ‌య‌సు అయిపోయేట‌ప్పుడు జీవితం గురించి తెలుస్తుంది. కానీ స్నేహానికి వ‌య‌సుతో ప‌ని లేదు. అలా తెలిసి పోతుందంతే..`,

`ఎక్స్‌పీరియెన్స్‌తో చెప్పిన‌ప్పుడు ఎట‌కారంగా తీసుకోకూడ‌దు`..,

`అడ్జ‌స్ట్ కావ‌డం అల‌వాటైన వారికి ఇష్టాల‌తో ప‌ని లేదు`..

`అవ‌స‌రం టైమ్ చెప్పి రాదు`...

`మ‌న‌కు న‌చ్చిన వ్య‌క్తి గురించి ఇంట్లో వారితో అర్గ్యుమెంట్ చేయ‌వ‌చ్చు, కానీ న‌చ్చిన వ్య‌క్తితో ఆర్గ్యుమెంట్ చేయ‌లేం`...

`మ‌హా లైఫ్‌లో చివ‌రి రెండు లైన్స్ మాత్ర‌మే ప‌రిమితం చేశావు..మ‌ళ్లీ మ‌రో అమ్మాయి జీవితంలో నన్ను రెండు లైన్స్‌కు ప‌రిమితం చేయ‌కు` ఇలా వరస పెట్టి డైలాగులతో అదరకొట్టాడు.

ఎవరెలా చేసారు

నటీనటుల్లో రామ్, శ్రీవిష్ణు ఇద్దరూ...తమ పాత్రలకు పూర్తి స్దాయిలో న్యాయం చేసారు. లావణ్య త్రిపాఠి ఎప్పటిలాగే ఓకే, అనుపమ పరమేశ్వరన్ ఎమోషన్ సీన్స్ లో తమ యాక్టింగ్ స్కిల్స్ ఏంటో చూపెట్టింది. ప్రియదర్శి, కిరీటి, హిమజ బాగా చేసారు.

టెక్నికల్ గా చెప్పాలంటే ... ఊటీ, వైజాగ్ అందాలను తమ కెమెరాతో అద్బుతంగా చూపారు సమీర్ రెడ్డి. ఎడిటర్ కాస్త స్పీడు పెంచేలా షార్ట్ కటింగ్ చేసుకుంటూ వెళ్తే బాగుండేది. ముఖ్యంగా ఫస్టాఫ్ చాలా పెద్ద సినిమా చూస్తున్న ఫీల్ వచ్చేసింది. దాన్ని ఓ అరగంట లేపేయచ్చు అనిపించింది.

ఎప్పటిలాగ దేవిశ్రీ సంగీతం ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. టైటిల్ సాంగ్ , వాట్ అమ్మా, ట్రెండ్ మారినా పాటలు బాగున్నాయి.

ఫైనల్ థాట్

కథ రొటీన్ ది అయినప్పుడు హీరో డిఫరెంట్ గా గెడ్డం పెంచినా పెద్ద కలిసొచ్చేదేమీ ఉండదు

ఏమి బాగుంది: సినిమాలో కొటేషన్స్ లా నిలిచిపోయే చాలా డైలాగ్స్

ఏం బాగోలేదు: అసలే ట్విస్ట్ లు, టర్న్ లు లేని ఈ కథని మరింత స్లోగా నడిపే ప్రయత్నం చేయటం

ఎప్పుడు విసుగెత్తింది : ఫస్టాఫ్ లో సీన్స్ వెళ్తూ..వెళ్తూ ..ఉంటే..ఇంటర్వెల్ కోసం ఎదురుచూస్తున్నప్పుడు

చూడచ్చా ?: ప్రాణ స్నేహితులు ఉన్నవాళ్లు వాళ్లతో కలిసి వెళ్లి చూడచ్చు...