ఆది 'నెక్ట్స్ నువ్వే' రివ్యూ
దెయ్యా లతో చచ్చే చావు ('నెక్ట్స్ నువ్వే' రివ్యూ)
అనగనగా ఓ ఆడ దెయ్యం. ఆ దెయ్యానికి చచ్చిపోయినా ...(ఉండటానికి ఓ ఇల్లు కావాలి. అలాగని ఓ ఇల్లు కొనుక్కోదు..అద్దెకు తీసుకోదు) దాంతో తనకు నచ్చిన ఓ ఇంటిలో స్దిర నివాసం ఏర్పాటు చేసుకుని కాలక్షేపం చేస్తూంటుంది. ఆ ఇంట్లో దెయ్యం ఉందనే విషయం తెలియక ఎవరైనా కొని ఆ ఇంట్లోకి వస్తే... ఆ దెయ్యం...ముఖానికి బూడిదో, ఫౌడరో కాస్తంత ఎక్కువ వేసుకుని రంగంలోకి దూకుతుంది. అలాంటివి మా ఆడోల్లు దగ్గర నుంచి చాలా చూసి ఉన్నాం ఛల్ లైట్ అంటే...కాస్సేపటికి...కిటికీల వెనక నుంచి గండు పిల్లిలా స్పీడుగా పరుగెట్టడం మొదలెడుతుంది. అప్పటికి ఆ కొనుక్కున్నవాళ్లు భయపడకపోతే... కుర్చీలు గాల్లోకి లేపటం, లైట్లు తీసేసి కిటీకి తలుపులు టపటపా కొట్టడం వంటి అనేక రకరకాల తింగరి వేషాలు వేస్తుంది.
వాటిని పిల్లలు చూసి ఏ మెజీషియన్ ఇంట్లో ఉండి ట్రిక్స్ భలే చేస్తున్నారు అని టప్పట్లు కొడితే ...ఏం చేయాలో అర్దం కాక తలగోక్కుంటుంది. ఖాళీ ఉన్నప్పుడు దెయ్యం సినిమాలు యూట్యూబ్ లో చూస్తుందో ఏమో కానీ ఇలా... పాత కాలం దెయ్యంలా రొటిన్ ట్రిక్స్ ప్లే చేయటమే కాక, అర్దం పర్దం లేని ఓ పాట సైతం అందుకుంటుంది. ఆ వచ్చినవాళ్లు దెయ్యం పాటలు అంటే ఇంట్రస్ట్ ఉన్నవాళ్లు అయ్యి.. సెల్ ఫోన్ లో రికార్డ్ చేసుకుని కాలర్ ట్యూన్ గా పెట్టుకుందామనుకున్నారనుకోండి..విరిక్తి చెందిన ఆ దెయ్యం వచ్చిన వాళ్లను చంపేస్తుంది.
ఇలాంటి పాడు దెయ్యం ఉన్న ఇంట్లోకి హీరో గారు దిగుతారు. తర్వాత మెల్లిగా ఆ ఇంట్లో దెయ్యం ఉందనే విషయం అర్దం చేసుకుని, సైక్రాటిస్ట్ లా..దాని ప్లాష్ బ్యాక్ తెలుసుకుంటాడు...ఇలా జరుగుతూంటాయి...మన దెయ్యం సినిమా కథలు.. ఇలాంటివి ఎన్నో చూసేసిన మనని మెప్పించటం కొంచెం కష్టమే. అయితే మనిషి ఆశాజీవి కదా..ముఖ్యంగా తెలుగు సినిమా ప్రేక్షకుడు.. ఊళ్లోకి ఓ కొత్త దెయ్యం సినిమా వస్తోందంటే ...ఈ సారి దెయ్యం 2.0 వెర్షన్ ఏమో అని ఆసక్తి చూపి థియోటర్లో దూరటం సహజం.అలాగే ఆశలు రేపుతూ...నెక్ట్స్ నువ్వే వచ్చింది.
గీతా ఆర్ట్స్ లాంటి బ్యానర్ వెనక ఉండటం, ఈటీవి ప్రభాకర్ డైరక్ట్ చేయటం, అన్నిటికన్నా ముఖ్యంగా తమిళంలో సూపర్ హిట్ చిత్రం రీమేక్ కావటంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే పెరిగాయి. పెరిగిన అంచనాలను దర్శక,నిర్మాతలు సద్వినియోగం చేసుకుని క్యాష్ చేసుకోగలిగారా...డబ్బు పెట్టి రైట్స్ కొన్నాం కదా అని యాజటీజ్ దింపేసారా..లేక ఏమమ్నా మార్పులు చేర్పులు చేసారా...వరస ఫెయిల్యూర్స్ లో ఉన్న ఆదికి ఈ సినిమా ఏమన్నా ప్లస్ అయ్యిందా..దర్శకుడుగా ఈటీవి ప్రభాకర్ సక్సెస్ అయ్యారా వంటి విషయాలు తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే.
ఇంతకీ ఈ సినిమా కథేంటి
‘జీవితం సేమ్యా ఉప్మా’ అనే టైటిల్ తో ఓ టీవి సీరియల్ డైరక్ట్ చేస్తూంటాడు కిరణ్ (ఆది). (కుర్ర డైరక్టర్ అలాంటి టైటిల్ పెట్టడం ఏమిటో...సాధారణంగా ..సీరియల్ టైటిల్స్ ..హిట్ సినిమా టైటిల్స్ పెడుతూంటారు కదా). ఆ సీరియల్ పెద్ద ఫ్లాఫ్ అవుతుంది...ఛానెల్ వాళ్లు ఆపేస్తారు. దాంతో ఆ సీరియల్ కోసం జేపీ(జయప్రకాష్‌రెడ్డి) వద్ద చేసిన అప్పు రూ.50లక్షలు ఎలా తీర్చాలో అర్దం కాదు. జెపీ...వచ్చి ‘వారం రోజుల్లో అప్పు చెల్లించకపోతే నీ లవర్(వైభవి)ని ఎత్తుకెళ్ళి నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసుకుంటా’ అంటూ ఓ వార్నింగ్ ఇస్తాడు. లవర్ కు కుటుంబం ఏమీ ఉన్నట్లు లేదు... ఎత్తుకుపోతే పోరాడటానికి, అందుకే మన హీరోనే భయపడి..ఏం చేయాలో అని ఆలోచనలో పడతాడు. ఈలోగా అతనికో కొరియర్ వస్తుంది.
ఆ కొరియర్ ద్వారా తెలిసే విషయం ఏమిటి అంటే...అరకులో అతనికో ప్యాలెస్ ఉందని, దానికి తానే ఓనర్ అని. దీంతో ఇదేదో బాగానే ఉందని... జాక్ పాట్ తగిలిందని మురిసిపోతూ ఆ ప్యాలెస్‌ను వెతుక్కుంటూ వెళ్తాడు కిరణ్. అక్కడ శరత్(బ్రహ్మాజీ) రష్మి(రష్మి గౌతమ్) పరిచయం అవుతారు. వాళ్ల సలహా మీద వాళ్లతో కలిసి ఆ ప్యాలెస్‌ను బాగుచేసి దాన్నో రిసార్ట్‌లా తీర్చిదిద్ది టూరిస్ట్ లకు ఆతిధ్యమిస్తూ సంపాదించాలనుకుంటాడు. అనుకున్నట్లుగానే ఫస్ట్ గెస్ట్ లు వస్తారు. అంతా పండగ చేసుకుంటారు. అయితే తెల్లారేసరికి ఆ జంట చనిపోతారు. అక్కడ నుంచి మొదలు..ఆ ప్యాలెస్ లోకి అడుగు పెట్టిన గెస్ట్ లంతా విచిత్రమైన కారణాలతో తెల్లారేసరికి చనిపోతూంటారు.
పోలీస్ లకు చెప్తే తాము జైలు పాలవుతామని, తమ గెస్ట్ హౌస్ కు బ్యాడ్ నేమ్ వస్తుందని భయపడి చనిపోయిన గెస్ట్ ల శవాలను ఎప్పటికప్పుడు పాతి పెట్టేస్తూంటారు. చివరకు పోలీస్ లు వచ్చేస్తారు...అసలు విషయం బయిటపడుతుంది. కానీ అంతకన్నా భయంకర నిజం వాళ్ల ద్వారా తెలిసి కిరణ్ షాక్ అవుతాడు. అసలు తాము ఆ గెస్ట్ హౌస్ లోంచి ప్రాణాలతో బయిటపడగలమా అనే సందేహం వస్తుంది. అక్కడ నుంచి వాళ్లేమి చేసారు. పోలీసులు వచ్చాక తెలిసిన నిజం ఏమిటి... వచ్చిన గెస్ట్ లు తెల్లారే సరికి ఎందుకు చనిపోతున్నారు? ఆ ప్యాలెస్ వెనక మిస్టరీ ఏమిటి? చివరకు కిరణ్ పరిస్దితి ఏమైంది..కష్టాల నుంచి బయిటపడ్డారా అన్నదే ఈ సినిమా.
రీమేక్ ..మేకైంది
తమిళంలో ఘన విజయం సాధించిన ‘యామిరుక్క భయమే’ రీమేక్ ఎంచుకోవటం మంచి విషయమే. అలాగే సినిమా రైట్స్ తీసుకున్నాం కదా అని యాజటీజ్ దింపేయలేదు...చాలా మార్పులు చేసారు. అక్కడిదాగా బాగానే ఉంది. అయితే తమిళంలో ఏవైతే పే ఆఫ్ చేసాయో ఆ ఎలిమెంట్స్ మాత్రం వదిలేసి, సొంత పాత్రలు, సీన్స్ తో కథ తయారు చేసారు. హీరో క్యారక్టర్ దగ్గర నుంచి మొత్తం మార్చుకుంటూ వచ్చారు.
తమిళంలో హీరో పాత్ర ...పెద్ద ఛీటర్. కన్నింగ్ తెలివితేటలతో జీవితం లాగే బేవార్స్. అదే ఇక్కడకి వచ్చేసరికి కాస్తంత కాస్త డోస్ తగ్గించి డిగ్నిఫైడ్ గా మార్చారు. కన్నింగ్ పాత్ర ఇరుకున పడితే ...భలే ఇర్కుకున్నాడురా అనిపించి సానుభూతి రాకుండా నవ్వు వస్తుంది. అదే తమిళంలో ప్లస్ అయ్యింది. ఆ క్యారక్టరైజేషన్ మార్చడంతో హీరో ఆ గెస్ట్ హౌస్ లో సమస్యలతో ఇరుక్కుపోయినా నవ్వు రాలేదు.
అలాగే దెయ్యం ..దానికి ఇల్లంటే పిచ్చి అంటూ కథకు పిచ్చి లాజిక్ పెట్టాలని చూడటంతో పాత మూసలోకి వెళ్లిపోయింది. దానికి తోడు ఆ దెయ్యం..వ్యవహారం మొత్తం కామెడీలా తయారైంది. దెయ్యం వచ్చాక...ఆ ఇంట్లో కు వచ్చి జనం చచ్చిపోతున్నారనే ఎలిమెంట్ మ్యాజిక్ మాయమైంది. ఇక ఎల్బీ శ్రీరాం ప్లాష్ బ్యాక్ , పాట చూస్తే..విసుగు వచ్చేసింది.
లాజిక్ వదిలేయటం అంటే మరీ ఇంతలా
ఇక తమిళంలో ... ఆ గెస్ట్ హౌస్ కు వచ్చిన జనం వచ్చినట్లే చనిపోతుంటే..వారి శవాలను హీరో పాతిపెట్టేస్తూంటే ...వాడంతే వెధవ , ఛీటర్ కాబట్టి అలాగే బిహేవ్ చేస్తాడు అని ఆ సీన్స్ సహజంగా అనిపిస్తాయి. అదే తెలుగుకు వచ్చేసరికి..హీరో ..ఏంటి ఇలా చేస్తున్నాడు. పాపం ఎవరో తమ హోటల్ కు వచ్చి అర్దాంతరంగా తెల్లారేసరికి చనిపోతే... వాళ్ల వాళ్లకు కూడా తెలియబరచాలని అనుకోడు.వాళ్లెవరో ఎంక్వైరీ చెయ్యడు...గొయ్య తీసి పాతి పెట్టేస్తాడు. మరుసటి రోజూ వచ్చిన వాళ్లు చచ్చిపోతే అలాగే చేస్తాడు.
శవాలను ఇలా వరస పెట్టి పాతిపెడుతూంటే భయం వెయ్యదా...ఎందుకు ఇలా జరుగుతోందని కారణం అన్వేషించడా... దానికి తోడు గెస్ట్ లుగా వచ్చిన వాళ్లు రాత్రికి ఛస్తారా లేదా అని క్యూరియాసిటీగా ఎదురుచూడటం ఏమిటి...అతనేమన్నా సైకోనా..ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనే డౌట్ వస్తుంది. చట్టానికి,పోలీసులకు దొరకకుండా ఇలాంటి వెధవ పనులు చెయ్యటమేంటి అని అనిపిస్తుంది. అలా డౌట్ రావటానికి కారణం ...హీరో క్యారక్టరైజేషన్ ,, డైరక్టర్ ఆ మూడ్ క్రియేట్ చేయకపోవటం. ఈ సినిమా ప్రారంభంలో ..ఆల్ఫెడ్ హిచ్ కాక్ చెప్పిన "వేర్ డ్రామా బిగెన్స్,లాజిక్ ఎండ్స్" వేసారు. అంటే మీరు ఈ సినిమాలో లాజిక్ వెతకద్దు అని ...కరెక్ట్ కానీ మరీ లాజిక్ లెస్ గా చేస్తారని మాత్రం ఊహించం.
అవుట్ డేటెడ్ దెయ్యం, లైటైన రీమేక్
ఇక ఈ సినిమాలో చూపించిన దెయ్యం బాగా అవుట్ డేటెడ్ గా ఛీఫ్ గ్రాఫిక్స్ తో గ్లామర్ కోల్పోయింది. రేష్మి గ్లామర్ , డబుల్ మీనింగ్ డైలాగులు వృధా. ఇక దెయ్యాన్ని డీల్ చెయ్యటానికి వచ్చే రఘుబాబు పాత్ర గతంలో అంజలి హీరోయిన్ గా వచ్చిన గీతాంజలిలో బ్రహ్మానందంగా యాజటీజ్ చూసిందే. కాబట్టి రఘుబాబు ఎంతలా ట్రై చేసినా..పెద్ద పేలలేదు. రీమేక్ లు లేటైతే ఇదే సమస్య.
బాగుంది భయ్యా
ఇక ఈ సినిమాలో ఏమీ బాగోలేదా అంటే... ఖచ్చితంగా కొన్ని చెప్పుకోదగ్గ ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటిలో ముఖ్యమైంది బ్రహ్మాజీ కామెడీ. సినిమాని ఆ కాసేపయినా చూడగలిగాము అంటే బ్రహ్మాజీ..చేసిన కామెడీనే కారణం.
ఫైనల్ థాట్
వేరే భాషలో హిట్టైన సినిమాలను రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టడం కూడా ఓ కళే...క్రియేటివిటినే. అది కొందరికే చెల్లింది.
ఏమి బాగుంది: అవసరాల శ్రీనివాస్...పెద్దైతే ఎల్బీ శ్రీరామ్ లా తయారవుతాడనే చిత్రమైన థాట్..(ఎల్బీ శ్రీరామ్ ప్లాష్ బ్యాక్ లో అవసరాలని చూపెడతారు)
ఏం బాగోలేదు: ఒక లైన్ లో చెప్పటం కష్టం
ఎప్పుడు విసుగెత్తింది : దెయ్యంతో రొమాన్స్ , సాంగ్
చూడచ్చా ?: రీమేక్ లు ఎలా చేయకూడదో తెలుసుకోవాలనుకునే ఆసక్తి ఉన్నవారు చూడచ్చు