విజయ్ 'అదిరింది' రివ్యూ
మసాలా సరిగ్గానే పడింది ('అదిరింది' రివ్యూ)
అదేంటో తమిళ స్టార్ హీరో విజయ్... సినిమాలపై మన వాళ్లు మొదటి నుంచీ పక్షపాతం చూపిస్తూ వస్తున్నారు. రజనీ, కమల్, విక్రమ్ , సూర్య, కార్తి, లను కౌగలించుకున్నట్లుగా విజయ్ ని వాటేసుకోవటం లేదు. అయినా తన పోరాటం ఆపేది లేదంటున్నాడు విజయ్. తెలుగులో పాగా వెయ్యటానికి తన సినిమాలను వరసగా డబ్బింగ్ చేసి వదులుతూనే ఉన్నాడు. నిజానికి మన తెలుగు వాళ్లు విభిన్నమైన సినిమాలను భాషా భేధం,ప్రాంతీయ భేధం లేకుండా ఆదరిస్తున్నారు. అది బిచ్చగాడు కావచ్చు...సింగం కావచ్చు ..అపరిచితుడు కావచ్చు, భారతీయుడు, రోబో, ప్రేమిస్తే, మన్యం పులి ఇలా చాలా విభిన్నమైన ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు అంటేనే మోజు. రొటీన్ గా మన హీరోలు చేసే సినిమాలు లాగ లేకుండా డిఫరెంట్ గా ఉంటే హాలీవుడ్ డబ్బింగ్ లను సైతం వంద రోజులు ఆడించేస్తున్నారు. అదే విజయ్ కు దెబ్బ కొడుతున్నట్లుంది. ఆయన... చేసే సినిమాలు మన తెలుగు మాస్ హారోల సినిమాల లాగానే ఉండటంతో , మనకు లోకల్ గా దొరికే మ్యాటర్ ప్రక్క రాష్ట్రం నుంచి తెచ్చుకోవటం ఎందుకుని పట్టించుకోవటం లేదు. ఈ నేపధ్యంలో విజయ్ తాజా చిత్రం 'అదిరింది' ఈ రోజు తెలుగులో రిలీజ్ అయ్యింది.
రకరకాల కారణాల వల్ల తెలుగులో రిలీజ్ లేటైన ఈ చిత్రం ఆల్రెడీ తమిళంలో మంచి హిట్ అవటంతో ఇక్కడా మంచి అంచనాలే ఉన్నాయి. దానికి తోడు ఈ సినిమా వివాదాల్లో ఇరుక్కుంది...సినిమాలో కేంద్రప్రభుత్వాన్ని, వైద్య వృత్తిని అవమానించేలా డైలాగ్స్ ఉన్నాయంటూ పెద్ద దుమారమే చెలరేగింది. ఈ విషయాన్ని మన తెలుగు మీడియా గంటకో సారి బ్రేకింగ్ న్యూస్ లు ఇస్తూ .. హోరెత్తించటం తో ఆ వివాదం ఏంటో చూసేద్దాం అనే ఉత్సాహం అయితే జనాల్లో ఏర్పడింది. సినిమాకు ఇక్కడ ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసింది. ఈ నేపధ్యంలో రిలీజ్ అయిన ఈ సినిమా తమిళంలో లాగా ఇక్కడా పెద్ద హిట్ అవుతుందా...అక్కడ అంత పెద్ద హిట్ అవటానికి కారణం ఏంటి, కథలో ప్రత్యేకత ఏమన్నా ఉందా...తమిళంలో వివాదంగా మారిన ఆ అంశాలు మన తెలుగు వాళ్లు చూసేందుకు ఉంచారా..సెన్సార్ లో లేపేసారా, ఎంతో కాలం నుంచీ తెలుగు మార్కెట్ కోసం పోరాడుతున్న విజయ్ ఈ సినిమాతో తన టార్గెట్ రీచ్ అయ్యాడా..?వంటి విషయాలు తెలుసుకోవాలంటే రివ్యూ చదాల్సిందే.
ఇదీ కథ
ఐదు రూపాయలకే పేదలకు వైద్యం చేసే డాక్టర్ భార్గవ్(విజయ్). పేదలందరికీ ఉచితంగా వైద్యం అందించాలన్నది అతని ఆశయంను, చేస్తున్న సేవను గుర్తించిన ఓ సంస్థ ...అంతర్జాతీయ హ్యుమానిటేరియన్ అవార్డును ఇస్తామని భార్గవ్ ని ఇన్వైట్ చేస్తుంది. దీంతో భార్గవ్ ఫారిన్ వెళ్తాడు. అక్కడ డా.అర్జున్ జకారియా(హరీష్ పేరడీ) చేతులు మీదుగా ఆ అవార్డ్ అందుకుంటారు. అంతేకాదు ఆయన దగ్గర పనిచేసే పల్లవి(కాజల్)తో ఓ మెజీషియన్ లా పరిచయం చేసుకుంటాడు. తన మ్యాజిక్ షో కు డాక్టర్ అర్జున్ ని కూడా తీసుకుని రమ్మంటాడు. రాగానే షో జరుగుతూండగా అందరి ఎదురుగా డాక్టర్ అర్జున్ ని పొడిచి చంపేస్తాడు. ఇదిలా ఉంటే మరోపక్క ఇండియాలో కార్పోరేట్ హాస్పటల్స్ లో వైద్య వృత్తిలో ఉన్నవారు వరుసగా కిడ్నాప్‌లు అవుతారు. దానికి కారణం భార్గవ్ అని అరెస్ట్ చేస్తారు. అప్పుడో షాకిచ్చే ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఇంతకీ డాక్టర్ అర్జున్ హత్యకీ, ఇండియాలో కిడ్నాప్‌లకు ఉన్న సంబంధం ఏంటి? భార్గవే ఆ హత్యలు చేసాడా... అందుకు కారణాలేంటి... సినిమాలో అసలు ట్విస్ట్ ఏమిటి...ఇంతకీ ఈ సినిమాలో సమంత క్యారక్టర్ ఏమిటి..నిత్యామీనన్ ఏం చేస్తుంది ...వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఇదే పడుతుంది...
‘ఓ మిడిల్ క్లాస్ మనిషి.. ఆరోగ్యం బాగోలేదని పొరపాటున కార్పొరేట్ లేదా ప్రెవేట్ హాస్పిటల్‌కు వెళ్తే..అక్కడ ఆ టెస్ట్, ఈ టెస్ట్ అంటూ అవసరం ఉన్నా లేకపోయినా తమ ల్యాబ్ లో ఉన్న పరీక్షలన్నీ చేసి జేబుకు ఖాళీ చేస్తున్నారు. డాక్టర్ చెప్పారు కాబట్టి కాదనలేని పరిస్దితి. జలుబుకు వైద్యానికి వెళ్ళినా ...శరీరంలో టెస్ట్ లన్నీ చేయిస్తున్నారు. దోపిడి జరుగుతోంది అని అందరికీ తెలిసినా..ఎవరూ అడగలేకపోతున్నారు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు ఉంటోంది. ఈ సిట్యువేషన్ ...దాదాపు అందరికీ అనుభవమే. మరికొన్ని హాస్పిటల్స్‌లో సాధారణ ప్రసవాలకు అవకాసం ఉన్నా.. కావాలని సిజరిన్లు చేస్తున్నారు. సామాన్యుడుకు గుండె రగిలిపోతోంది..’ ఇదే పాయింట్ ని బేస్ చేసుకుని సినిమా చేసాడు ..కాబట్టి చాలా మంది ఐడిటింఫై అయ్యే అవకాసం ఉంది.
ఎలా ఉంది..
కొంత మెసేజ్..మరికొంత మాస్ మసాలా మసాజ్...కొన్ని అభ్యుదయ నినాదాలు, కొద్దిపాటి వాస్తవికత, బోలెడు గారిడి, కొంత కల్పనా, కొంత అనుకరణా, కొన్ని పాటలూ, కొన్ని ఫైట్స్ కలిపి తమిళ దర్శకుడు అట్లీ వండిన వంటకం 'అదిరింది'. కథగా కొత్త కథేమీ కాదు..ట్విస్ట్ లు అయితే ఇప్పటికి చాలా సార్లు చూసినవే. అయితే లావిష్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించటం, టెక్నికల్ గా సినిమా బాగుండటం తో మనకు చూస్తున్నంతసేపూ రొటీన్ అయినా ఆ తేడా తెలియకుండా రొటీన్ గా చూసేస్తూంటాము.
తమిళ అతి ఉన్నా..
ఈ సినిమాలో విజయ్ మూడు పాత్రల్లో (విజయ్.. భార్గవ్.. దళపతి )మెచ్చుకోదగిన ఫెరఫార్మెన్స్ ఇచ్చాడు. చక్కటి వేరియేషన్ మూడు పాత్రల్లో చూపించి మెప్పించాడు. అయితే సీన్స్ లో తమిళ అతి కనపడుతూంటుంది. దాన్ని తమిళ నేటివిటి అనాలేమో. అయితే అవన్నీ విజయ్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని రాసుకున్న సీన్స్ కాబట్టి క్షమించెయ్యటమే.
తెలుగులో అదే దెబ్బ కొట్టారు
ఈ సినిమాలో వివాదాస్పదమైన సీన్, డైలాగుల కోసం వెళితే... (జీఎస్‌టీపై హీరో చెప్పే డైలాగ్స్, నోట్ల రద్దుపై డైలాగు) ఇక్కడ మ్యూట్‌లో పెట్టేసారు. ఠాగూర్, శివాజి సినిమాల్లో సీన్స్ మనకు అక్కడక్కడా గుర్తుకు వస్తూంటాయి.
భయం వేస్తుంది
సమంత, విజయ్, రాజేంద్రన్ మధ్య వచ్చే సీన్స్ కు, విజయ్, నిత్యామేనన్, ఎస్.జె. సూర్యల మధ్య నడిచే ఆస్పత్రి ఎపిసోడ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కార్పోరేట్ వైద్య రంగంలో లోపాలను ఎత్తి చూపుతూ స్క్రీన్ ప్లే రాసుకున్న విధానం బాగుంది. నార్మల్ డెలివరీని కేవలం డబ్బుల కోసం సిజేరియన్‌గా ఎలా మారుస్తున్నారో చూపించే సీన్.... ప్రెవేట్ లేదా కార్పోరేట్ హాస్పటిల్స్ లో జరుగుతున్న దౌర్జన్యాన్ని కళ్లకు కడుతుంది. ఆ సీన్స్ హార్ట్ టచింగ్‌గా..ఇంకా చెప్పాలంటే కార్పోరేట్ హాస్పటిల్ కు వెళ్లాలంటే భయపెట్టేలా ఉన్నాయి. విలన్ గా ఎస్‌జే సూర్య అరిపించాడు. తన బిజినెస్ కోసం ఎలాంటి అన్యాయమైనా అలవోకగా చేసేస్తూ వెన్నులో వణుకు పుట్టిస్తాడు.
ఆ సీన్స్ ట్రిమ్ చేయాలి
ఫస్టాఫ్ ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు అక్కడక్కగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పెట్టుకున్న అట్లీ.. సెంకడ్‌హాఫ్‌లో కాస్త స్లో అయ్యాడు. అయితే ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరింది. కానీ సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లెంగ్త్ ఎక్కువై, తమిళ వాసన పెరిగిపోయి.. విసుగు తెప్పించింది. దాన్ని చాలా ట్రిమ్ చేయాలి తెలుగు ప్రేక్షకుల కోసం. పాటలు విషయానికి వస్తే... ఏఆర్ రెహమాన్ స్దాయిలో లేవు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం భీబత్సం..మనను సినిమా పూర్తయ్యాక కూడా హాంట్ చేసేలా డిజైన్ చేసారు. విష్ణు సినిమాటోగ్రఫీ సినిమా కు ప్రాణం. నిర్మాణ విలువలు సినిమా స్టాండర్డ్ కి తగ్గట్టుగా ఉన్నాయి.
ఫైనల్ థాట్
కమర్షియల్ మసాలా సినిమాలతో ఓ సుఖం ఏమిటంటే..చూస్తున్నంతసేపూ మన బుర్రకు పనికల్పించకుండా వెళ్తూ ...విసిగించే పోగ్రాం పెట్టుకోవు. అలాగని పూర్తిగా మసాలా తో నింపేస్తే...వెగటు కూడా వస్తుంది. అతి సర్వత్రా వర్జయేత్ కదా.
ఏమి బాగుంది: ఇంటర్వెల్ ట్విస్ట్, సినిమాకు ఎంచుకున్న కార్పోరేట్ హాస్పటల్స్ దోపిడీ నేపధ్యం
ఏం బాగోలేదు: ఫ్లాష్ బ్యాక్ సీన్స్
ఎప్పుడు విసుగెత్తింది : తమిళ వాసనలు ఎక్కువైన సీన్స్ వచ్చినప్పుడు
చూడచ్చా ?: ఖచ్చితంగా ఎందుకంటే...ఎప్పుడో అప్పుడు మనందరం కూడా ప్రెవేట్ లేదా కార్పోరేట్ వైద్యంతో విసిగిపోయినవాళ్లమే కాబట్టి నచ్చతుంది