Movies | Music | Music

Indrasena Movie Review

November 30, 2017
R Studios and Vijay Antony Film Corporation
Vijay Antony, Diana Champika, Mahima, Jewel Mary, Radha Ravi, Kali Venkat, Nalini Kanth and Rindu Ravi
Vijay Antony
Basha Sri
Kalyan
Rajasekhar
Anand Mani
K Dil Raju
Sandra Johnson

Vijay Antony
Radhikaa Sarathkumar and Fatima Vijay Antony
G Srinivasan

'ఇంద్రసేన' మూవీ రివ్యూ

కన్నీళ్ల కోన ...('ఇంద్రసేన' మూవీ రివ్యూ)

కుటుంబం కోసం కిడ్నీలు, జీవితం వంటివి అలవోకగా త్యాగం చేసే కొడుకులు కథలు, కొడుకుల చేతిలో చావు దెబ్బతిని వృధ్దాశ్రమం పాలయ్యే కన్నవాళ్ల కథలు, చెల్లెలు కోసం...అన్నగారు పడే కష్టాల గోరింటాకు కథలు, బిడ్డలు బాగు కోసం కాన్సర్ వచ్చినా కడదాకా పోరేడే మాతృదేవోభవ తరహా కథలు ఈ మధ్యకాలంలో సినిమా తెరకెక్కటం మానేసాయి. అవన్నీ టీవికు షిఫ్ట్ అయ్యిపోయాయి. దాంతో కొంతకాలంగా కన్నీళ్లు తెరపై ప్రవహించటం లేదు. ఆ లోటు తీర్చాలనకున్నాడో ఏమో ...విజయ్ ఆంటోని ఆ మధ్యన బిచ్చగాడు అంటూ తల్లి కోసం బిచ్చగాడుగా మారిన కొడుకు కథతో వచ్చాడు. డిఫెరెంట్ పాయింట్ తో కూడిన సెంటిమెంట్ కు కనెక్టు అయిన జనం జై కొట్టి హిట్ ఇచ్చారు. అదే ఫెరఫెక్ట్ ఫార్ములా అనుకున్నాడో ఏమో ..మరోసారి సెంటిమెంట్ టచ్ ఉన్న ఓ అన్నగారి త్యాగం తో కూడిన మెలోడ్రామా సబ్జెక్టు ఎన్నుకుని ఇంద్రసేన అన్నాడు. ఈ సినిమా కు స్పెషల్ ఎట్రాక్షన్ ఏమీటీ అంటే సెంటిమెంట్ తో పాటు కవలలు కన్పూజన్ కూడా ఉంది. కాకపోతే ఈ కవలల కన్ఫూజన్... మన హలో బ్రదర్స్ టైపు..కామెడీ యవ్వారం కాదు... కవలలు- కన్నీటి కాలవలు అనే ఊర అరవమార్క్ సెంటిమెంట్ కాన్సెప్టు. మరి ఈ సెంటిమెంట్ కవలలల సినిమాని బిచ్చగాడు సినిమాలా మన వాళ్లు ఆదరిస్తారా..లేక ఇలాంటివి టీవి సీరియల్ లో బోలెడు చూసేసాం...ఇంక చాల్లే అని ప్రక్కన పెట్టేస్తారా అనేది రివ్యూలో చూద్దాం. అలాగే ఈ సినిమాకు "తాగుడు-దాని పర్యవసనాలు" అనే టైటిల్ పెడితే యాప్ట్ అని అనిపిస్తుంది..అది ఎందుకో కూడా తెలుసుకుందాం.

కవలలు కహానీ...(కథ)

నూజివీడులో కవలలు ఇంద్ర‌సేన‌, రుద్ర‌సేన (విజయ్ ఆంటోని). సినిమాలో జనాలకోసమో లేక చూస్తున్న మన క్లారిటీ కోసమో కానీ ఒకరు గెడ్డంతో మరొకరు గెడ్డం లేకుండా కనిపిస్తూంటారు..అలా చేయకపోతే వాళ్లిద్దరూ ..ఎవరికి వాళ్లు అద్దంలో కూడా ఫలానా నేనే అని గుర్తు పట్టలేరంతగా ఒకలాగ ఉంటారు. కవలలు అయినంతమాత్రాన వాళ్ల జీవిత కథలు కూడా ఒకేలా ఉండాలని రూల్ లేదు కదా.. ఇంద్రసేన, రుద్ర సేన ల జీవితాలు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఇంద్రసేన ...ఎలిజిబెత్ అనే అమ్మాయి ప్రేమలో పడి ఆమె యాక్సిడెంట్ లో చనిపోతే... ఆ జ్ఞాప‌కాల్లో బ్ర‌తకుతూ...కాలక్షేపం కోసం తాగుతూంటాడు. ఆ తాగుడే మెల్లిగా అతని కొంప ముంచుతుంది. ఆ తాగుడు మైకంలో అనుకోకుండా ఓ వ్యక్తి మరణానికి కారణమై జైలు పాలవుతాడు.

ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అనంతరం అతను జైలు నుంచి వచ్చేసరికి...కుటుంబ పరిస్దితులు పూర్తిగా మారిపోతాయి. తమ తండ్రి నడిపే బట్టల షాప్ ని ఆ ఊరి రౌడీ కబ్జా చేసేస్తాడు. అంతకాక..స్కూల్ లో చక్కగా , బుద్దిగా పిఇటి గా ఉద్యోగం చేసుకుంటున్న అతని తమ్ముడు రుద్రసేన పెద్ద రౌడీలా మారతాడు. పనిలో పనిగా తమ్ముడు పెళ్లి ఆగిపోతుంది. ఇంద్రసేనను ప్రేమించిన అమ్మాయి వేరే వాడికి భార్య అయిపోతుంది. (లక్కీగా చెల్లి గానీ అక్క గానీ లేకలేదు..లేకపోతే ఇంకే దారుణం చూపించేవారో). ఇవన్నీ చూసిన ఇంద్రసేనకు ఏం చేయాలో అర్దం కాని సిట్యువేషన్. అసలు టీచర్ నుంచి రౌడీగా..తమ్ముడు...రుద్రసేన మారటానికి దారి తీసిన పరిస్దితులు ఏమిటి... తమ బట్టల షాప్ కబ్జా అవటానికి కారణం ఏమిటి...తెలుసుకుంటాడు. అక్కడ నుంచి తన కుటుంబాన్ని, తన తమ్ముడుని సేవ్ చేసి దారిలో పెట్టడానికి ఓ త్యాగపూరితమైన ఊహించని నిర్ణయం తీసుకుంటాడు. అసలు ఇంద్రసేన జైలు కు వెళ్లిన సమయంలో ఏం జరిగింది...కుటుంబం కోసం ఇంద్రసేన తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

బొచ్చెగాడు

నిజ జీవితంలో సంగతి ఏమో కానీ మనమంతా డబ్బింగ్ సినిమాల విషయంలో చాలా చాలా ఆశాజీవులం. ఎప్పుడో ఏ తమిళ హీరోనో, మళయాళ దర్శకుడో, హిందీ హీరోయినో తెలుగులో డబ్బింగ్ తో ఓ హిట్ కొడితే...అక్కడ నుంచి వాళ్లకు అభిమాన సంఘాలు పెట్టేసి... ప్రతీ సినిమాకు పర్మనెంట్ ప్రేక్షకుడులా మారిపోయి పోషిచేస్తూంటాం. అది ఏ స్దాయికి వెళ్లిపోతుందంటే వాళ్ల ప్లాఫ్ సినిమాలు సైతం ఇక్కడ డబ్ చేసి రిలీజ్ చేసుకుని చూసేటంత అభిమానం పెంచేసుకుంటాం. విజయ్ ఆంటోని ఎవరో ఏమిటో... 'బిచ్చగాడు' సినిమా హిట్ అయ్యేదాకా ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఇవాళ ఆయన సినిమాలు ఇక్కడ వరసగా భారీ స్దాయిలో రిలీజ్ అవుతున్నాయి. అయితే అన్ని సినిమాలు బిచ్చగాడు కావు కదా..150 రూపాయలు టిక్కెట్ పెట్టి కొనుక్కున్నవాడిని ఆ సినిమాలు బిచ్చగాడుని చూసినట్లు చూసి వెక్కిరిస్తున్నాయి. మొన్న యమన్..ఇప్పుడు ఇదిగో ఈ ఇంద్రసేన.

ఆత్మహత్యతో ముగింపు

పాసివ్ లేదా త్యాగపూరిత పాత్రలతో నడిచే చిత్రాలు హీరోలకు ఇమేజ్ లేనప్పుడు లేదా... ఆ కథే హీరోగా మారేటంత గొప్ప ఎలిమెంట్ ఉన్నప్పుడు మాత్రమే వర్కవుట్ అవుతాయి. విజయ్ ఆంటోనికి మెల్లిమెల్లిగా హీరో ఇమేజ్ వచ్చేసింది. బిచ్చగాడు టైమ్ కు అతను కొత్త గానీ ఇవాళ అతను ఓ స్దాయి హీరోనే. దానికి తగ్గట్లు మాస్ యాంగిల్ లో ట్రైలర్స్ కట్ చేసి వదులుతున్నారు. జనం కూడా అలాగే పిక్సై థియోటర్ కు వస్తున్నారు. అక్కడేమో.. విధే నడిపించే పాసివ్ పాత్రలో విజయ్ ఆంటోని కనపడుతే షాక్ అవుతున్నారు. మొన్న వచ్చిన యమన్ కు ఇప్పుడు ఇంద్రసేనకు అదే పరిస్దితి. సినిమా మొత్తం మీద విలన్ మీద హీరో ఎక్కడైనా తిరిగబడి సవాల్ విసిరే సరైన సీన్ కోసం చూస్తే అది కనిపించటం లేదు. ఇంకా దారుణం ఏమిటంటే...చివరకు హీరోనే ఆత్మహత్య చేసుకునే పరిస్దితి...ఇలా ఉంటే ఎలా భరించగలం.

అటో..ఇటో..ఎటో

అలాగే ఈ సినిమాలో ...ఓ ప్రక్కన హీరో పాత్రకు రియలిస్టిక్ టచ్ ఇస్తూ మరికొన్ని సీన్స్ వద్దకు వచ్చేసరికి.. పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ చొప్పించాలని చూడటం వద్దే సమస్య వస్తోంది. హీరో క్యారక్టరైజేషన్ ..నడక...అంతా ఆర్ట్ సినిమాలా నడుస్తూంటుంది..ఓకే .అలాగే చూద్దాం అనుకునేలోగా ఇంతలోనే ఫైట్స్, పాటలు, క్లైమాక్స్ వద్దకు వచ్చేసరికి పూర్తి సినిమాటెక్ గా కమర్షియల్ సినిమాగా మార్చేయటం జరిగింది. తీస్తే పూర్తి రియలిస్టిక్ టచ్ తో సినిమా తీయాలి లేదా కమర్షియల్ సినిమా పాటలు, పైట్స్ తో కలర్ ఫుల్ గా తీయాలి. అటూ ఇటూ కాకుండా తీస్తే.. చూసేవాళ్లకు మాత్రం ఖచ్చితంగా ఏ కోణంలో చూడాలనే కన్ఫూజన్ ఉంటుంది. ఆ పాత్రల తీరుతెన్నులు డైజస్ట్ అవటం కష్టంగా మారుతుంది. అదే...ఇంద్రసేన లో కనిపించింది. దానికి తగ్గట్లు పూర్తిగా స్లో నేరేషన్ లో సినిమా నడుస్తుంది.

విలన్ ఏడి..

ఇవన్నీ ప్రక్కన పెడితే ఈ సినిమాలో అతి పెద్ద సమస్య..ఇద్దరు హీరోలు (డ్యూయిల్ రోల్ ) ఉన్నా..విలన్ పాత్ర స్ట్రాంగ్ గా మాత్రం కనపడదు. ఇద్దరు ముగ్గురు విలన్స్ ఉంటారు. చివరకు విధే ..హీరో పాలిట...మన పాలిట పెద్ద విలన్ అని సినిమా చివరకు అర్దమవుతుంది.

ఎంటర్టైన్మెంట్ కు బై

సినిమాలో ఎక్కడా ఎంటర్టైన్మెంట్( చిన్న పాటి కామెడీ సీన్ కూడా) పెట్టకుండా కేవలం చూసేవాళ్లకు కన్నీరు పెట్టించటమే ఈ సినిమా లక్ష్యం అన్నట్లుగా దర్శకుడు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు.

అలాంటివి పెట్టలేదు లక్కీగా

ఇక ఇంద్రసేన, రుద్ర సేన గా విజయ్ ఆంటోని రెండు పాత్రల మధ్యా వేరియేషన్ చూపించటంలో ఫెయిలయ్యాడనే చెప్పాలి. కానీ రెండు ఫైట్స్ మాత్రం అదరకొట్టాయి.యాక్షన్ కొరియోగ్రాఫర్ కు హ్యాట్యాఫ్. విజయ్ స్వయంగా ఇచ్చిన పాటలు జస్ట్ ఓకే అన్నట్లుగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. టెక్నికల్ గా మిగతా విభాగాలు ..స్టాడర్డ్స్ మెయింటైన్ చేసాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడుగా శ్రీనివాసన్ మాత్రం ఇంకా ఓల్డ్ స్కూల్ లోనే ఉన్నాడు. ఎంతలా అంటే...విషాద సూచనగా...దేముడు దగ్గర దీపం ఆరిపోయినట్లు చూపటం వంటి షాట్స్ తో . ఒకటైమ్ లో హీరోయిన్ పరుగెత్తుకు దేముడు గదిలోకి వెళ్లి ..అమ్మవారి విగ్రహం ముందు పాట ఎత్తుకుంటుందేమో అని భయం వేసింది. అలాంటివి పెట్టకుండా బ్రతికించాడు.

ఫైనల్ థాట్

తాగుడు..దాని వల్ల వచ్చే నష్టాలు చెప్పే కథ ... అని పబ్లిసిటీ చేస్తే గవర్నమెంట్ గుర్తించి అవార్డ్ లు అయినా ఇచ్చే అవకాసం ఉంటుంది.

ఏమి బాగుంది: యాక్షన్ ఎపిసోడ్స్

ఏం బాగోలేదు: హీరోనే తాగుబోతు అవటం, మర్డర్ చేయటం, ఆత్మహత్య చేసుకోవటం వంటివి చేస్తూంటే...

ఎప్పుడు విరక్తి వచ్చింది : హీరో బాగా పాతకాలం సినిమాలు చూసి ఇన్సైర్ అయినట్లుగా కుటుంబం కోసం త్యాగం చేయాలని బయిలుదేరుతూంటే

చూడచ్చా ?: డబ్బింగ్ సినిమా ఏదైనా అద్బుతం...ఏదో విషయం లేనిదే డబ్బింగ్ చేయరు అని మనసా,వాచా నమ్మేవారికి ఈ సినిమా బంపర్ ఆఫర్

ADVERTISEMENT
ADVERTISEMENT