Movies | Music | Music

Padmaavat Movie Review - Deepika Padukone, Shahid Kapoor, Ranveer Singh

January 25, 2018
Bhansali Productions and Viacom 18 Motion Pictures
Deepika Padukone, Shahid Kapoor, Ranveer Singh, Aditi Rao Hydari, Jim Sarbh, Raza Murad, Anupriya Goenka, Sharhaan Singh
Sanjay Leela Bhansali
Jayant Jadhar, Sanjay Leela Bhansali, Akiv Ali
Sudeep Chatterjee
Sanjay Leela Bhansali and Sanchit Balhara
Sanjay Leela Bhansali, Sudhanshu Vats and Ajit Andhare
Sanjay Leela Bhansali

ఖిల్జీగారి కామ దహనం.. (‘పద్మావత్’ మూవీ రివ్యూ )

చదువుకునేందుకు ఏమో కానీ చూసేందుకు మాత్రం చరిత్ర ఎప్పుడూ ఆసక్తే...అయితే అందులో చక్కని,చిక్కని డ్రామా ఉండాలి...మన జాతికి..మన కులానికి, మన వంశానికి జై కొట్టే సన్నివేశాలు ఉంటే ఇంకా మహదానందం. మనోళ్లు మామూలోళ్లు కాదురా... అప్పట్లో ఇరగదీసేసారు అని చూస్తున్నంతసేపే కాదు..చూసి వచ్చాక కూడా చెప్పుకుని మరీ ఆనందపడచ్చు. దానికి స్పూర్తి పొందటం అనే పేరు పెట్టుకుని ఉత్తేజపడచ్చు. అయితే వచ్చిన చిక్కల్లా చరిత్ర మనం కావాలనుకున్నట్లు,మనకు అనుకూలంగా చాలా సార్లు ఉండదు. (ఎందుకంటే తమకి కావాల్సినట్లుగా చరిత్రను రాయించున్న రాజుల,సుల్తాన్ ల చరిత్ర మనది) . ఒకవేళ చరిత్ర ఒకరికి అనుకూలమైనమైనా చాలా మందికి అది ప్రతికూలంగా ఉంటుంది. దానికి తోడు పుస్తకాల్లో చరిత్ర వేరు..సినిమాగా తెరకెక్కే చరిత్ర వేరు. చదువుకున్న చరిత్రను యాజటీజ్ తెరకెక్కించాలంటే అందులో అందరికీ నచ్చే ఎలిమెంట్స్ ఖచ్చితంగా ఉండవు. సినిమా కు సరిపడ డ్రామా ఉండదు.

ముఖ్యంగా మనం తీద్దామనుకున్న విజువల్స్ (షాట్స్ )కు అవకాసం ఉండకపోవచ్చు. దాంతో అలాంటివన్ని క్రియేట్ చేయటం మొదలవుతుంది..అప్పుడే వస్తుంది చిక్కు... చరిత్రను చదువుకున్న వాళ్లు... చరిత్రను వక్రీకరించారు అని విమర్శ చేసేస్తేరు.. అలా అని ... ఏమీ సొంత క్రియేషన్ అనేది ఏమీ లేకుండా చరిత్ర పుస్తకాల్లో ఉన్నది ఉన్నట్లు తీసేస్తే..అబ్బబ్బే.. చరిత్ర పాఠంలా చప్పగా ఉండని చప్పరించేస్తారు. ఇలా ఎన్నో లిమిటేషన్స్ ఉన్న చరిత్ర సినిమాలతో చరిత్ర క్రియేట్ చేయటం కష్టమే అయినా సంజయ్ లీలా భన్సాలీకు ఇష్టం. అందుకే కష్టనష్టాలకు ఓర్చి, ఖర్చు పెట్టించి, కాస్ట్యూమ్స్ డ్రామాలు చేస్తూంటాడు.

‘పద్మావత్’ కూడా అలాంటిదే. కాకపోతే ఈ సినిమాకు చరిత్రను వక్రీకరించారనే టాక్ ..సినిమా ప్రారంభం రోజు నుంచే (సినిమా చూడకుండా , స్క్రిప్టు ఏమిటో తెలియకుండానే ) మొదలైంది. అది వివాదం పెద్దగా గా మారి...పబ్లిసిటీగా ఉపయోగపడింది. ఇంతకీ ఈ సినిమాలో చరిత్ర వక్రీకరణ జరిగిందా..అసలు రాణి పద్మావతి కథేంటి... సినిమా తీయ్యాలి అని ఉత్సాహం తెప్పించేటటువంటి విషయాలు ఏమున్నాయి... అసలు ఈ సినిమా చూడటానికి అనువుగా ఉందా...సెన్సార్ సీన్స్ లేపేసిందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి...

13 వ శతాబ్దం...కుటుంబ గౌరవం...ఆ కుటుంబ స్త్రీల శీలంతో ముడిపడిన రోజులు(ముఖ్యంగా రాజకుటుంబాల్లో...). మేవాడ్ లో అప్పటి రాజపుత్ర రాజు మహారావల్‌ రతన్‌ సింగ్‌ తన మొదటి భార్య కు ముత్యాలు తేవటం కోసం సింహళానికి (ఈనాటి శ్రీలంక)కు వెళ్లాడు. అక్కడ పద్మావతి (దీపిక పదుకోని) ని చూసి మోహించాడు. రెండవ రాణిగా చేసుకుందామని ఆ క్షణమే ఫిక్స్ అయ్యిపోయాడు. ఆమె ఎంత అపురూప సౌందర్యరాశి అంటే... తన నీడ కూడా ఎదుటివారిలో మోహం కలిగించేంత అందం కలది. ఆమె సింహళ దేశపు రాజకుమారి. ఆమెను పెళ్లాడి తన రాజధాని చిత్తోడ్ తెచ్చకుంటాడు. అయితే ఆ అందమే ఆమె కొంప ముంచింది..ఆ రాజ్యానికి వినాశనం తెస్తుందని ఎవరికి తెలియదు.

రాజ్యానికి వచ్చిన మొదటి రోజే... రాజగురువు రాఘవ చింతనుడు ఆశీస్సులు కోసం వెళితే ఆయన పద్మావతి అందం చూసి మోహపరవసుడైపోయాడు. దాంతో ఆ మోహావేశం ఆపుకోలేక పద్మావతి తొలిరాత్రిని దొంగచాటుగా చూడాలని ఉత్సాహపడతాడు. ఇది గమనించిన రతన్ సింగ్ ...ఆయనకి రాజ్య బహిష్కరణ శిక్ష వేస్తాడు. దాంతో ఆ రాజగురువు ఎలాగైనా మేవాడ్ ని బూడిద చేస్తానని ప్రతన పూనాడు. అలా అక్కడ తొలి బీజం పడింది.

మరో ప్రక్క భగవంతుడైన అల్లాహ్ సృష్టించిన ప్రతీ అందమైనది తనకు కావాలనుకునే అతి లాలసుడు..క్రూరుడు డిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖల్జీ. అతని పంచన చేరుతాడు ఈ రాజగురువు. ఖిల్జీ ని అడ్డం పెట్టుకుని తనను అవమానించి, రాజ్య బహిష్కరణ శిక్ష వేసిన రాజుపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. అందుకోసం ఓ కుట్ర పన్ను తాడు. అందులో భాగంగా ఖిల్జీలో పద్మావతి అందంపై ఆశలు రేకిత్తిస్తాడు. ఆమెను పొందని బ్రతుకు బ్రతుకేకాదని, ఆమె నీతో ఉంటే స్వర్గంలో ఉన్నట్లే అని నూరిపోస్తాడు. దాంతో ఖిల్జీ కామంతో తహతహలాడిపోతాడు. అక్కడ నుంచి ఖిల్జీ వైపు కథ తిరుగుతుంది.

ఎలాగైనా పద్మావతిను పొందాలని ప్రయత్నాలు మొదలెడతాడు. అందుకోసం ఎంతకైనా తెగిస్తాడు. మేవాడ్ రాజ్యం పై యుద్దం ప్రకటిస్తాడు. అయితే డైరక్ట్ గా రాజపుత్రుల మీద యుద్దం చేసి గెలవటం తన వల్ల కాదని అతి త్వరలోనే అర్దం చేసుకుంటాడు. దాంతో కుయుక్తిని ప్రయోగించి ... రతన్ సింగ్ ని సంధి పేరుతో ఒంటిరిగా పిలిపించి తనతో పాటు డిల్లీకు పట్టుకెళ్ళతాడు. ఆ తర్వాత .. పద్మావతిని స్వయంగా డిల్లీ వచ్చి తన భర్తను తీసుకెళ్లమని అంటాడు. అప్పుడు పద్మావతి ఏం చేసింది. రాజగురువు పంతం నెరవేరిందా..ఖిల్జీ కామదాహం తీరిందా...పద్మావతి ..అగ్నికి ఆత్మాహుతి చేసుకోవాల్సిన పరిస్దితి ఎందుకు వచ్చింది...వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది..

సినిమా వరల్డ్ క్లాస్ విజువల్స్ తో గ్రాండియర్ లుక్ తో అద్బుతంగా ఉంది. అందులో సందేహం ఎంత మాత్రం లేదు. అయితే వచ్చిన చిక్కల్లా భన్సాలీ...మేకింగ్ మీద పెట్టిన దృష్టి స్క్రిప్టు మీద పెట్టకపోవటమే. దాంతో సినిమాలో సీన్స్ వెళ్లిపోతూంటాయి కానీ ఎక్కడా ఎమోషన్స్ రిజిస్టర్ కావు. ఏదో డాక్యుమెంటరీ చూసిన ఫీలింగ్ తీసుకువస్తాడు కానీ సినిమా చూసినట్లు అనిపించదు. ఎంతసేపూ రాజపుత్రలు ఎంత గొప్పవారో..వారి వంశాలు ఎంత గొప్పవో..వారి కత్తులు ఎంత గొప్పవో..వారు ధరించే కుంకుమ ఎంత గొప్పదో..వారు నడిచే నేల ఎంత గొప్పదో ..వారు దువ్వుకునే దువ్వెన సైతం ఎంత గొప్పదో అంటూ భజన కాలక్షేపం చేస్తాడే కానీ ఎమోషన్స్ ని రైజ్ చేయదు. ఇలాంటి కథ రాజమౌళి లాంటి దర్శకుడు చేస్తే... భావోద్వేగాలతో ఓ ఆట ఆడేసుకుంటాడు. అలాగని భన్సాలీని తక్కువ చేయటం కాదు...ఆయన ఎక్కువ చేయాల్సిన అవసరం వచ్చినా వినియోగించుకోలేదు అనిపిస్తుంది.

ఆటా నాదే..వేటా నాదే..సినిమా నాదే

ఇక ఈ కథలో ఖిల్జీ పాత్రపై ఎక్కువ శ్రద్ద పెట్టారనిపిస్తుంది. ఎందుకంటే ఖిల్జీ కు ఓ లక్ష్యం ఉంటుంది. అది పద్మావతిని పొందాలని...అందుకోసం అతను చేసే ప్రయత్నాలు మొదటి నుంచి చివరి వరకూ పద్మావతిని ఓ పట్టుపట్టాలనే ...పట్టు వదలని విక్రమార్కుడు లా కనిపిస్తాయి.కానీ మేవాడ్ రాజు వైపు నుంచి ఎంతసేపూ చర్యకు ప్రతిచర్యే కానీ అంతకు మించి పరిస్దితులను చేతిలో తీసుకోవటం వంటివి ఏమీ ఉండవు. (చరిత్ర అలాగే ఉందేమో) పోనీ టైటిల్ రోల్ పద్మావతి రాణి అయినా ఏమన్నా చేస్తుందా అంటే తన భర్తను ఓ సారి రక్షించుకోవటం తప్ప మరేమీ చెయ్యలేదు.

అయితే కొంతదూరం వెళ్లాక ఆ పోరాటం కూడా చేయలేక తనతోపాటు వందలాది అంతపుర స్త్రీలను నిప్పుల్లోకి నడిపించిన నిస్సహాయురాలైన స్త్రీగా ఆమె కనిపిస్తుంది. దాన్ని త్యాగం అనొచ్చు. శీల పరిరక్షణ అనొచ్చు. ఆ కాలానికి అది గొప్ప త్యాగం కావచ్చు.తన మాన సంరక్షణే స్త్రీ ద్యేయం అయ్యిండవచ్చు. కానీ ఈ కాలానికి అలాంటివి ఎంతవరకూ హర్షనీయం అనిపిస్తుంది. ఇంకేదో ఆమె చేసి ఉండి వీరనారిలా మారి ఉంటే బాగుండను అనిపిస్తుంది. కానీ ఇది చరిత్ర కదా.

ఏదైమైనా ఇలా విలన్ పాత్ర హైలెట్ అయ్యి.. మిగతా ప్రధాన పాత్రలు ఏమీ చేయలేక చేవ చచ్చి చూస్తూండిపోయే సినిమాలను చూడటం కాస్త కష్టమే అనిపిస్తుంది. దానికి తోడు విలన్ గా చేసిన ర‌ణ‌వీర్ సింగ్‌ సినిమాలో అద్బుతమైన ఫెరఫార్మెన్స్ ఇచ్చాడు. బై సెక్సువల్ గా, తను కావాలనుకున్నది ఎలాగైనా కుట్ర చేసైనా పొందే సుల్తాన్ గా గుర్తుండిపోయే పాత్రను పోషించాడు. అతని ప్రక్కన ఎప్పుడూ ఉండే మాలిక్‌ కాఫుర్‌ గా వేసినతను (ఎవరో తెలియదు కానీ) చాలా బాగా చేసారు. టైటిల్ రోల్ చేసిన దీపికపదుకోనిలో అందం తప్ప మరేమీ కనపించలేదు. అప్పుడప్పుడు కన్నీరు పెట్టడం మాత్రం నాచురల్ గా ఉంది. షాహిద్ కపూర్ ..మేవాడ్ రాజుగా నప్పలేదనిపించింది.

అలాగే .. ఇలాంటి సినిమాల్లో యుద్దం సీన్స్ ఎక్కువ ఉంటాయేమో అని ఎక్సపెక్ట్ చేస్తాం కానీ భన్సాలీ అదేంటో అసలు యుద్దం మీద కాన్సర్టేట్ చేయలేదు. సతీ సహగమనం మీదే ఆయన దృష్టి అంతా ఉంది. అది రాజస్దానీయులకు..పద్మావతిని ఆరాధించేవాళ్లకు అద్బుతంగా అనిపిస్తుందేమో కానీ మనకు మాత్రం కష్టం అనిపిస్తుంది.

వివాదం చేసేటంత విషయం ఉందా

నిజానికి కర్ణ సేన..సినిమా ప్రారంభమైన రోజు నుంచి వివాదం చేస్తూనే ఉంది. అయితే ఈ సినిమాలో రాజపుత్ర వీరుల గొప్పతనం గురించి బోలెడు సీన్స్ ఉన్నాయి. ఎక్కడా చిన్న చూపు చూడలేదు. అలాంటప్పుడు భన్సాలీకి సన్మానం చేయాల్సింది పోయి గొడవలు మొదలెట్టారేంటి అనిపించింది. ఇక చరిత్ర వక్రీకరణ మాట అంటారా..అసలు ఈ కథకు సంభందించిన సరైన చరిత్ర ఎక్కడుంది... ఎవరు లిఖించారు.

టెక్నికల్ గా ..

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం గురించి, ఆయన చిత్రీకరించే విజువల్స్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. ఆయన వరల్డ్ క్లాస్ డైరక్టర్ అని ఎప్పుడో అనిపించుకున్నారు. ఇక కెమెరా వర్క్ విషయానికి వస్తే ..సినిమాలో చాలా విజువల్స్ ఆశ్చర్యపరిచే రీతిలో ఉండటం దాని గొప్పతమనే. ఇక ఆర్ట్ వర్క్ ఈ సినిమాలో ప్రధాన హైలెట్..నిజంగా మేవాడ్ రాజుల భవంతులకు వెళ్లి తీసారేమో అనేంత గొప్పగా తీర్చిదిద్దారు. సంగీతం విషయానికి వస్తే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉన్నంత గొప్పగా పాటలు లేవు. కాస్టూమ్స్ కూడా చాలా బాగా ఆ కాలానికి తగినట్లు డిజైన్ చేసారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఎంత చెప్పినా తక్కువే.

తెలుగుకు ఎక్కుతుందా

నిజానికి ఇది మన తెలుగువారి చరిత్ర కాదు..లీనమై చూడటానికి కాదు.పోనీ ఏ దేశనాయకుడు గురించో, దేశభక్తి గురించో అసలు కాదు. అంతేకాదు ఈ సినిమాలో మన సౌతిండయన్ ఫేస్ ఒక్కటీ లేదు. అలాగే తెలుగు డబ్బింగ్ సైతం ఏదో హిందీ సీరియల్ కు డబ్బింగ్ చెప్పించినట్లు డైలాగులు రాసి, చెప్పించారు. దాంతో సినిమాకు తగ్గ గ్రాండియర్ లుక్ డైలాగుల్లో లేదు.

ఫైనల్ థాట్..

చరిత్రను ఎవరూ జరిగింది జరిగినట్లుగా ఎలా రికార్డ్ చేయలేరో...అలాగే ఉన్న చరిత్రను మార్చకుండా పూర్తిగా ఉన్నది ఉన్నట్లు తెరకెక్కించమూ చేయలేరు. కాబట్టి ఓ చరిత్రను చూసినట్లు కాకుండా అద్బుతమైన విజువల్స్... మనదేశానికి చెందిన ఓ ప్రాంతంలో జరిగిన కథగా చెప్పబడే కథనాన్ని చూడటానికి ఈ సినిమా కు వెళ్లచ్చు..ఖచ్చితంగా వెళ్లిచూడాల్సిన సినిమా అని చెప్పను కానీ... భన్సాలీ వంటి దర్శకుడు తీసిన విజువల్స్ చూడటానికి కైనా ఓ సారి చూడచ్చు.

ADVERTISEMENT
ADVERTISEMENT