అయ్యాం బలి! (‘ఇది నా లవ్ స్టోరి’ మూవీ రివ్యూ)
ప్రతీవాళ్ల జీవితంలోనూ ప్రేమ కథ ఉన్నట్లే... దాదాపు ప్రతీ సినిమాలోనూ ఏదో ఒక ప్రేమ కథ ఉంటూంటుంది. దాంతో సినిమా చూడటం మొదలు పెట్టిన రోజు నుంచి ప్రతీవాళ్లు ..ఎన్నో ప్రేమ కథలు ఇప్పటికి తెరపై చూసేసే ఉంటారు. దాంతో ఏ ప్రేమ కథ చూసినా ఇంతకు ముందు ఎక్కడో చూసినట్లు ఉంటుంది. ముఖాలు మారుతూంటాయి కానీ అవే కథలు రిపీట్ అవుతూంటాయి. కానీ ప్రేమ కథ అనేసరికి జనాల్లో ఓ రకమైన తెలియని ఆకర్షణ ...అదే ప్రేమ కథలను వెండితెర సాక్షిగా బ్రతికిస్తోంది. ఆ ధైర్యం తోనే హీరో తరుణ్ తన రీలాంచింగ్ కు ఓ ప్రేమ కథను ఎన్నుకున్నాడు.
లవర్ బోయ్ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన తరుణ్.. వరస ఫ్లాఫ్ ల వర్షంలో తడిసి ముద్దై..ఆరబెట్టుకునేందుకు ప్రక్కకు వెళ్లాడు. ఆయన అటు తప్పుకోగానే... గ్యాప్ లో ఆయన ప్లేస్ ని చాలా మంది కబ్జా చేసేసారు. ఆయన అభిమానులంతా మిగతా హీరోల అభిమాన సంఘాల్లో చందాలు కట్టేసారు. ఆ విషయాలు గమనించాడో లేదో కానీ తన లవర్ బోయ్ ఇమేజ్ ని రిపీట్ చేస్తూ ...ఇది నా ప్రేమ కథ అని టైటిల్ పెట్టి రంగంలోకి దూకాడు. రీలాంచ్ కు కాస్తంత ధైర్యంగా ఉంటుందని కన్నడంలో హిట్టైన సింపుల్లాగ్ ఒంద్ లవ్ స్టోరి చిత్రాన్ని అండగా తెచ్చుకున్నాడు. మరి తరుణ్ ప్రయత్నాలు ఫలించాయా...ఆయన ప్రేమ కథ ఈ జనరేషన్ వాళ్లకు నచ్చిందా..లేక ఇంకా ప్రేమ కథలు చెప్పటమేంటని చిరాకు పడ్డారా...
సింపుల్ గా ఇదీ స్టోరీ లైన్
అభిరామ్ (తరుణ్) తన చెల్లికు ప్రేమించిన కుర్రాడితో పెళ్లి ఫిక్స్ చేస్తాడు. దాంతో చెల్లి సైతం తన పెళ్లికాని అన్నకు పెళ్లి చేసి ఓ దారి చేయాలనుకుంటుంది. తన కాబోయే భర్త చెల్లి . డాక్టర్ శృతి తో తన అన్నకు సంభంధం కుదిరిస్తే బాగుటుంది అని ప్లాన్ చేస్తుంది. అందుకోసం ఓ సారి. డాక్టర్ శృతి (ఒవియా) ని వెళ్లి కలవమంటుంది. చెల్లి మాట తీసేయలేక అక్కడకు వెళ్లిన అబిరామ్ .... డాక్టర్ శృతితో ప్రేమలో పడిపోతాడు. అంతేకాకుండా ఒంటరిగా ఉన్న ఆ ఇద్దరూ తమ తొలి ప్రేమ కథలు మనసారా విప్పుకుని చెప్పుకుంటారు. ఆమె కూడా అభితో ప్రేమలో పడిపోతుంది. కానీ ఈ లోగా తాను అంతసేపు మాట్లాడింది డాక్టర్ శృతితో కాదని నిజం తెలిసి షాక్ అవుతాడు. ఈ లోగా డాక్టర్ శృతి.. అభిరామ్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయిస్తుంది. ఇంతకీ డాక్టర్ శృతి ప్లేసులో వచ్చిన ఆమె ఎవరు.... డాక్టర్ శృతి పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇచ్చింది. అసలు వీటిన్నటి వెనక ఉన్న అసలు కథేంటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
డైలాగులతో లాగేసారు
నిజానికి కన్నడ చిత్రంలో మంచి ట్విస్ట్ లే ఉన్నాయి. లవ్ స్టోరీని ఎంతో అందంగా వాళ్లు తీర్చిదిద్దారు. తెలుగులో ట్విస్ట్ లు అలాగే యాజటీజ్ పెట్టినా ఒరిజనల్ లో ఉన్న సోల్ ని క్యారీ చేయలేకపోయారు. కానీ ఒరిజనల్ లో చాలా ఫన్ని వన్ లైనర్స్ ఉన్నాయి. వాటిని అన్నిటినీ ఇక్కడ రిపీట్ చేయాలని అవసరమున్నా లేకపోయినా ... పంచ్ డైలాగులు వేసుకుంటూ పోయి ప్రాణం తీసేసారు. ఎటు చూసినా అవే. ప్రతీ సీన్ ..పేజీలకు పేజీలు డైలాగులు చెప్తూంటుంది.
కాళ్లు తొక్కితేనే సారీ చెప్తారు, హృదయాన్ని తొక్కేసి సారీ చెప్పవా ?
కుక్క బిస్కెట్ ల్లో కుక్క ఉండదు కానీ, క్రీమ్ బిస్కట్ లో క్రీమ్ ఉంటుంది - వంటి డైలాగులు ఎందుకు వస్తాయో..వెళ్తాయో అర్దం కాదు.
సర్లే డైలాగుల గురించి ప్రక్కన పెడితే దర్శకత్వంమూ అలాగే ఉంటుంది. ఎక్కడా మ్యాజిక్ అనేది కనపడదు. లవ్ స్టోరీలకు కావాల్సింది చక్కటి మ్యూజిక్, తెరపై విజువల్స్ తో మ్యాజిక్..ఈ రెండు మిస్సయ్యాయి.
దర్శకత్వం ,మిగతా విబాగాలు
ఇది జంట రచయతలు దర్శకులుగా మారిన చేసిన చిత్రం. అయితే సినిమా అంతా వారి రచనా నైపుణ్యం చూపించుకోవాలనే తపన కనపడుతుందే తప్ప...దర్శకులుగా ఎక్కడా మెరుపులు మెరిపించలేదు. జనాలు చేత అరిపించలేదు. లో బడ్జెట్ లో లాగేద్దామనుకున్నారో ఏమో కానీ ..రెండే పాత్రలతో రఫ్పాడించేసారు.
సంగీతం కూడా సోసో గా ఉంది. రెండు సాంగ్స్ ఫరవాలేదు. నేపథ్య సంగీతం అస్సలు బాగోలేదు. క్రిస్టోఫర్ జోసెఫ్ కెమెరా పనితనం అద్బుతం కాకపోయినా.. బావుందనే చెప్పాలి. ఎడిటర్ ..మీద మాత్రం చాలా కోపం వస్తుంది..చాలా సీన్స్ ఎడిట్ చేయకుండా వదిలేసారనిపిస్తుంది.
ఫైనల్ ధాట్
డ్రగ్ కేసు గొడవ వచ్చేదాకా తరుణ్ అనే ఒక హీరో ఉండేవాడు అనే విషయం గుర్తుకు రాని పరిస్దితి. ఇలాంటి భారీ గ్యాప్ తో వచ్చేటప్పుడు తన వయస్సు తగ్గ సబ్జెక్ట్ ఎంచుకోవాలి. ఆ సబ్జెక్టు న్యాయం చేసే దర్శకులతో ముందుకు వెళ్లాలి. ప్రపంచం 'నువ్వే కావాలి' రోజుల్లో ఆగిపోలేదనే విషయం గుర్తించుకోవాలి.
చూడచ్చా...
ఎవరి లవ్ స్టోరీ వాడికే బోర్ కొట్టేస్తున్న 'ఈ రోజుల్లో ... పనిమాలా డబ్బు ,అంత కన్నా విలువైన టైమ్ ఖర్చు పెట్టుకుని ' పరోయోడి లవ్ స్టోరీ వినేటంత తీరిక , ఓపిక ఎవరికీ లేవు. అప్పటికీ తప్పదు ..వినాలి అంటే ..అవి ఎంతో గొప్పగా ఉండాలి..లేదా చెప్పేవాడన్నా ఫామ్ లో ఉండాలి..ఈ రెండు లక్షణాలు ఈ సినిమాకు లేవు.