అ! మూవీ రివ్యూ
‘అ’ర్దమైతే చాలు ... ( రివ్యూ)
ఎంతసేపూ ఆ పాత కథలు.. బూజు పట్టిన క్యారక్టర్స్ యేనా..కొత్తగా ట్రై చేయరా...ఇది సినిమాతో లింకున్న ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సమయంలో అనే మాట. దాంతో ఈ మాటలన్ని విన్న ఏదో ఒక హీరో..సర్లే వీళ్లు అంటున్నారు కదా,నిజమేనేమో అని ఓ డిఫరెంట్ సినిమా అంటూ ఓ అర్దపర్దం లేని కథతో సినిమా చేయటం..ఆ తర్వాత అది ప్లాఫ్ అవటం ఆనవాయితీగా వస్తోంది. ఫ్యాన్స్ సైతం ప్రక్కన పెట్టేసాక... ఆ దిగులతో ... కొత్తదనాన్ని మనవాళ్లు స్వాగతించరు.. ప్రయోగాలను ఆదరించరు..బుద్ది వచ్చింది..ఇక నేను ప్రయోగాత్మక చిత్రాలు జోలికి వెళ్లను..నా మూస సినిమాల మీద ఒట్టు అంటూ స్టేట్ మెంట్స్ ఇవ్వటం జరుగుతుంది. అయితే నిజంగా కొత్తదనాన్ని మనవాళ్లు ఆదరించరా అంటే ..పెళ్లి చూపులు ఎందుకు ఆడుతుంది..అర్జున్ రెడ్డి ఎందుకు ఆడుతుంది అనే ఆలోచన చేయరు.
ఆలోచిస్తే... రెగ్యులర్ ఫార్మెట్ కు ,మన మార్కెట్ కు బిన్నంగా ...వెళ్లే ప్రతీ సినిమా ప్రయోగాత్మకమే. అంతెందుకు.. బాహుబలి కూడా ..మార్కెట్ పరంగా ఓ కొత్త ప్రయోగమే. రాజమౌళి మరో చిత్రం 'ఈగ' కూడా ఆ రోజుకి కథ,కథనం దృష్ట్యా ప్రయోగమే. మహేష్ లాంటి హీరో ఫక్తు కామెడీ సినిమా దూకుడు చేయటమూ ప్రయోగమే అప్పటికి. ఎన్టీఆర్ ..మూడు పాత్రల్లో కనపడుతూ జై లవ కుశ చేయటమూ ప్రయోగమే. అలా కొత్తను స్వాగతిస్తూ మూసను మట్టిలో కలుపుతూ చేసే ప్రతీ పని ప్రయోగమే.
అసలు విషయానికి వస్తే... నాని నిర్మాతగా చేసి ఈ రోజు రిలైజైన ‘అ’ సినిమా మాత్రం వీటిన్నటికి అతీతమైనదని ట్రైలర్ లో అర్దమైంది. మరి ఈ ప్రయోగాత్మక చిత్రం ఏ మేరకు మనవాళ్లను ఆకట్టుకుంటుంది.. సినిమాలో నాని,రవితేజల వాయిస్ తో నడిచే చెట్టు, చేప పాత్రలు ..కథకు ఏ మాత్రం ఉపయోగపడ్డాయి..నటుడుగా దూసుకుపోతున్న నానితో బ్యానర్ పెట్టి సినిమా నిర్మించాలి అనిపించేటటువంటి ఉత్తేజం తెప్పించిన కథేంటి ..వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్ ఇదే...
'మనమంతా', 'చందమామ కథలు' తరహాలో మల్టిఫుల్ లేయర్స్ ఉన్న కథ ఇది. కథ ఏ మాత్రం లీక్ చేసినా కిక్ పోతుంది కనుక ...కేవలం పాత్రలు మాత్రమే చెప్తున్నాం, ట్విస్ట్ లు రివీల్ చేయటం లేదు.
ఓ రెస్టారెంట్లో ఓపెన్ చేస్తే ... పుట్టిన రోజున ఓ రెస్టారెంట్లో కలి(కాజల్ అగర్వాల్) ఒంటిరిగా దిగులుగా కూర్చుని ఉంటుంది. ఏదో జరగబోతోందనే ఆందోళనగా ఆమె ముఖంలో స్పష్టమవుతుంది. ఆ రోజు ఆమె జీవితానికి సంభందించిన ఓ పెద్ద నిర్ణయం తీసుకోబోతంది.అదేంటి..
అదే సమయంలో వేరే చోట ఓ రెస్టారెంట్లో... రాధ(ఈషారెబ్బా) తన కాబోయే భర్తని తన తల్లి (రోహిణి), తండ్రి ( సీవీఎల్ నరసింహరావు)కు పరిచయం చేయటానికి తీసుకు వస్తుంది. ఆ తీసుకుని వచ్చిన వ్యక్తిని చూసి తల్లి,తండ్రి షాక్ తో తలపట్టుకుంటారు. ఆ షాక్ కలిగించే వ్యక్తి ఎవరు.
వేరే చోట ఓ రెస్టారెంట్లో వంట రాని నాలా (ప్రియదర్శి) చెఫ్ పోస్ట్ కు ఉద్యోగానికి వస్తాడు. యూట్యూబ్ చూసి వంటలు చేసే బాపతు అతను. అతనికి హోటల్ మేనేజ్ మెంట్ ఓ టాస్క్ ఇస్తుంది. పదినిముషాల్లో ఫలానా వంటకం చేస్తే నీకు ఉద్యోగం ఇస్తానని..కరెక్ట్ గా చేద్దామని మొదలెట్టే సమయానికి ఇంటర్నెట్ కట్ అవుతుంది. దాంతో ఏం చేయాలో అర్దంకాదు. ఉద్యోగం రాకపోతే ఫుడ్ లేదు. ఏం చేయాలి..
అలాగే వేరే చోట ఓ రెస్టారెంట్లో ... ప్రముఖ మెజిషియన్ యోగి (మురళి శర్మ) వచ్చి తాను చాలా గొప్పవాడినని బిల్డప్ ఇస్తాడు. కానీ రెస్టారెంట్ ఓనర్ చిన్న పిల్ల దాన్ని ఒప్పుకోక భయపెడతాడు. అప్పుడు అతనికి వింత సంఘటనలు జరుగటం మొదలవుతాయి. అవెలా జరుగుతున్నాయో అర్దంకాదు.. యోగి భయపడే సిట్యువేషన్ కు వస్తాడు. ఇంతకీ ఏం జరుగుతోంది అక్కడ.
ఇక వేరే చోట ఓ రెస్టారెంట్ లో ... మీరా (రెజీనా) పనిచేస్తూంటుంది. కానీ ఆమె అక్కడ జాయిన్ అవటానికి ఓ కారణం ఉంటుంది. అక్కడకు వచ్చే ఓ పార్టీని మోసం చేసి డబ్బు లేపేయాలని ప్లాన్ చేస్తుంది. కానీ అనుకున్నది అనకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది. దానికి తోడు ఆమె డ్రగ్స్ కు బానిస. మరి డబ్బు కొట్టేయగలుగుతుందా..
ఇవన్నీ చాలదన్నట్లు..మరో చోట ఓ రెస్టారెంట్లో సైంటిస్ట్ (శివ) అవసరాల శ్రీనివాస్... పని చేస్తూ..టైమ్ మిషన్ కనిపెట్టి..చిన్నతనంలో తప్పిపోయిన తన తల్లితండ్రులను కలుసుకోవాలని ప్రయత్నం చేస్తూంటాడు. అతని ఆశయం నెరవేరుతుందా
ఇలా రకరకాల పాత్రలు వేరు వేరు చోట్ల వేరు వేరు టాస్క్ లలో బిజీగా ఉంటారు. అసలు వీళ్లంతా ఎవరు..వీళ్లకు ఒకరితో ఒకరికి ఉన్న సంభందం ఏమిటి.. అందరూ వేర్వేరు రెస్టారెంట్ లలో ఎందుకు ఉన్నారు...ఈ కథలో చేప (నాని వాయిస్), చెట్టు (రవితేజ వాయిస్ )లకు లింక్ ఏంటి...కాజల్ పాత్ర ఎందుకు టెన్షన్ పడుతోంది ..అసలు ఆమె ఎవరు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సినిమా ఎలా ఉంది
నిజానికి ఈ చిత్రంలో కథేమి లేదు.. కేవలం స్క్రీన్ ప్లే తోనే నడిపించాడు. లూపర్, రాటటూయి వంటి అనేక హాలీవుడ్ చిత్రాలు ప్రభావం బాగా ఎక్కువగా సినిమాలో కనపడుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ట్విస్ట్ బేస్ చేసుకుని రాసుకున్న ఈ కథకు ఫస్టాఫ్ మొత్తం కేవలం పాత్రలు పరిచయం తోటే సరిపోయింది. సెకండాఫ్ లో ఆ పాత్రలని సంఘటనలతో ముడేసారు. క్లైమాక్స్ కు కానీ మనం చూస్తున్న కథేమిటే అర్దం కాదు. దాంతో ప్రారంభంలో బాగుందనిపించినా తర్వాత కథ అర్దం కాక.. రాను రాను...ఎంతకీ తెమలదే...ఎప్పటికీ ఈ సినిమా అవ్వదా అనిపించింది. ముఖ్యంగా ఈ కథలన్నిటిని కలిపే క్లైమాక్స్ పాయింట్ ..వినటానికి థ్రిల్లింగ్ గా అనిపించినా...అరే .ఇంతసేపు చూసింది ఇదా అని తేలిపోయిన ఫీలింగ్ తీసుకొచ్చింది.
కొత్త దర్శకుడు అదే మిస్ చేసాడు
నా చుట్టూ ఉన్న ప్రపంచం, ఆ ప్రపంచంలో నేను అనే కాన్సెట్ తో కథ చేసుకున్న ఈ కొత్త దర్శకుడు ఎఫెర్ట్ ప్రతీ ఫ్రేమ్ లోనూ కనపడుతుంది. ఇలాంటి స్క్రీన్ ప్లే రాసుకోవటం కూడా చాలా చాలా కష్టం. అయితే చూడటానికి కష్టం అనిపించటమే విషాదం. ఈ సినిమాకు బ్యాంకింగ్ గా నిలిచిన ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ కు రావల్సిన రెస్పాన్స్ రాలేదనిపించింది..అందుకు కారణం దర్శకుడు ఆ సీన్స్ మరింత బిల్డప్ గా బిల్డ్ చేయకపోవటమే అని అని పిస్తుంది.
అలాగే సినిమాని ...కేవలం కొన్ని పాత్రలు, సంఘటనలు, ఊహించని మలుపులు లాగ దర్శకుడు డీల్ చేసాడు కానీ ఓ ఎమోషనల్ జర్నిలా చూడలేదు. దాంతో సినిమాకు, చూసేవారికి మద్య కనెక్షన్ నిర్దాక్ష్యణ్యంగా కట్ అయ్యిపోయింది. సినిమాలోని ప్రధాన పాత్ర తో చూసేవారికి ఎమోషనల్ బాండింగ్ ఉంటే దాన్ని రిసీవ్ చేసుకునే తీరే వేరు. అయితే జనాలకి అర్దమయ్యే కథతో వస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడనిపించింది.
మరీ కన్ఫూజయ్యేంతలా.. ఇన్ని క్యారక్టర్స్...వాటికి సపరేట్ కథలు పెట్టకుండా , ప్రధాన పాత్రకు ఎమోషన్స్ జత చేసి కాస్త అర్దమయ్యే టట్లు నేరేట్ చేస్తే... సినిమా ఖచ్చితంగా చూడదగ్గ ప్రయోగంగా అయ్యేది.
నాని, రవితేజ వాయిస్ లు పనికొచ్చారా?
సినిమాలో తెరపై కనపడని హీరోలు నాని, రవితేజలు. వాళ్ల వాయిస్ లు సినిమాకు బాగా ప్లస్ అయ్యాయనే చెప్పాలి. అవి కూడా లేకపోతే సినిమా కు రిలీఫ్ అనేది లేక బోర్ రెట్టింపు అయ్యేది.
రెజనా,నిత్యామీనన్..మిగతా వాళ్లు
మిగతా ఆర్టిస్ట్ లు రెజీనా, నిత్యామీనన్, అవసరాల, ప్రియదర్శి , ఈషా ఎవరికి వారే బ్రహ్మాండంగా చేసారు. అయితే అవసరాలను సరిగ్గా వాడుకోలేదనిపించింది. ప్రయదర్శి కామెడీ పెద్దగా లేదు. మెజీషియన్ గా మురళి శర్మ తనదైన శైలిలో అదరకొట్టారు. కానీ ఆయన సీన్స్ లెంగ్త్ ఎక్కువై బోర్ కొట్టేసాయి.
టెక్నికల్ గా ..
సినిమాలో ఒకే ఒక్క బ్యాక్ గ్రౌండ్ సాంగ్ తప్ప ఇంకేమి లేవు.. సినిమా మొత్తం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో నడిచింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగున్నాయి. డైలాగులు కూడా క్యారక్టరైజేషన్స్ కు తగ్గట్లు ఫెరఫెక్ట్ గా కుదిరాయి.
హైలెట్స్
రవితేజ, నాని వాయిస్ ఓవర్ లు కేక పెట్టించాయి. అలాగే చైల్డ్ అబ్యూజ్ మీద సోషల్ మెసేజ్, చెట్లు గొప్పతనం చెప్పటం వంటివి బాగున్నాయి. సినిమాటోగ్రఫి, ఆర్ట్ వర్క్ సినిమాకు ప్రాణం.
ఫైనల్ ధాట్
సినిమా చూడటం పూర్తవగానే ...అర్జెంటుగా .రెస్టారెంట్ ఎక్కడుందో వెతుక్కుని స్ట్రాంగ్ కాఫీ తాగాలనిపించటం ..పోస్టర్ ప్రభావం ఎంత మాత్రం కాదు..సినిమా ప్రబావమే.
చూడచ్చా
విభిన్న చిత్రాల రావట్లలేదు, మూసవదిలి.. మార్పు కావాలి అనే వాళ్లు ఈ సినిమా చూస్తే ఆనందపడతారు. మిగతావాళ్లు ఆ మూస సినిమాలే బెస్ట్ రా నాయనా అని నిట్టూరుస్తారు.