Movies | Music | Masti Close Aha Ad
Movies | Music | Music

Mom Movie Review

July 7, 2017
Mad Films and Third Eye Productions
Sridevi, Akshaye Khanna,Adnan Siddiqui, Sajal Ali, Abhimanyu Singh and Nawazuddin Siddiqui
Anay Goswamy
Kona Venkat, Girish Khli and Ravi Udyawar
Zee Studio and Boney Kapoor
A R Rahman
Boney Kapoor
Ravi Udyawar

'మామ్' కాదు మామ్మ ( రివ్యూ ‌)

హీరోలకు ఎంత వయస్సు వచ్చినా అదే పోస్ట్ లో కొనసాగవచ్చు. అబిమానులూ అభ్యంతరపెట్టరు. నిర్మాతలు నిట్టూర్పులు వదలరు. కానీ అదేం పాపమో హీరోయిన్స్ కు ముప్పై దాటితే ముంచుకొచ్చేస్తూంటుంది. తమ ప్రక్కన నటించిన హీరోలు సైతం...తమకు అమ్మగా చేయమని అడగాటనికి వెనకాడారు. అయితే ఆ వివక్షను తమ శరీరలావణ్యంతో దాటగలిగేవాళ్లూ ఉంటారు. శ్రీదేవి అలాంటి అరుదైన అందం. ఈ అతిలోక సుందరి...అక్కినేని నాగేశ్వరరావుకు హీరోయిన్ గా చెయ్యగలదు..ఆయన కుమారుడు నాగార్జున కు హీరోయన్ గా చెయ్యగలదు. (ఒప్పుకుంటే నాగచైతన్యకూ హీరోయిన్ గా చేసేదేమో). అయితే అంత లావణ్యమూ ఒకనాటికి వాడిపోక తప్పలేదు. శ్రీదేవి విషయంలో అదే జరిగింది.

ఈ అందం ఇలాగే శాశ్వతంగా ఉండిపోతుందేమో అనుకునే వాళ్లకు షాక్ ఇస్తూ ...శ్రీదేవి 'మామ్' లో కనిపించింది. శ్రీదేవిని చూసిన కళ్లతో ఈ 'మామ్' ని చూడలేం...ఊహించుకోలేం. శ్రీదేవి పోలికలతో ఉన్న ఓ మామ్మ గారిని తీసుకొచ్చి సినిమా చేయించారేమో అనే డౌట్ వస్తుంది...(అమంగళం ప్రతిహతమవుగాక..!అభిమానులూ నొచ్చుకోకుండా ఉండుగాక! ) కానీ ఆమె నటన చూస్తూంటే ఆరితేరిపోయిన శ్రీదేవే గుర్తుకు వస్తూ....సినిమాకి రాకుండా ఉంటేనే బాగుండును...అప్పటి జ్ఞాపకాలు అలాగ పదిలంగా ఉండేవి కదా అనిపిస్తుంది. సర్లైండి...శ్రీదేవి మీ అభిమానం గురించి మరో వ్యాసం రాసుకోండి..ప్రస్తుతానికి ...అసలు ఈ 'మామ్' కథేంటి, శ్రీదేవి గ్యాప్ తీసుకుని చెయ్యాల్సినంత విషయం ఏముంది అంటారా...అయితే రివ్యూ చదివేయండి.

కథేంటంటే...?

స్కూల్లో టీచర్ గా పనిచేసే దేవకి(శ్రీదేవి)...కు ఆనంద్‌ (అద్నాన్‌ సిద్దిఖీ) కు రెండో భార్య. దాంతో ఆనంద్ కుమార్తె ఆర్య (సాజ‌ల్ అలీ) దేవ‌కిని అమ్మ‌గా ఏక్సెప్ట్ చేయదు. అమ్మ అని పిలవటానికి కూడా ఇష్టపడక...‘మేడ‌మ్‌’ అని పల‌క‌రిస్తూంటుంది. తన తల్లి ప్లేస్ లో ఎవరినీ ఊహించుకోవటానికి ఇష్టపడదు. కానీ దేవకి మాత్రం తన కన్నకూతరులాగే ఆర్యను ట్రీట్ చేస్తూంటుంది.

ఇదిలా ఉంటే లవర్స్ డే రోజున ఓ ఫామ్ హౌస్ కు పార్టీకి వెళ్ల్తుంది ఆర్య‌. అక్క‌డ ఆర్యను జగన్ (అభిమన్యుసింగ్)గ్యాంగ్ కిడ్నాప్ చేసి అత్యాచారం చేస్తారు. ఆ న‌లుగుర్నీ పోలీసులు ప‌ట్టుకొంటారు. కానీ చట్టం డబ్బుకు అమ్ముపోవటంతో... సరైన సాక్ష్యాధారాలు లేవ‌నే సాకుతో వాళ్ల‌ు బయిటకు వచ్చేస్తారు. ఓ ప్రక్క తన క‌ళ్ల ముందు తన సవతి కూతురు ప‌డుతున్న న‌ర‌క యాత‌న చూడ‌లేక‌, తప్పు చేసినవారికి శిక్షపడుతుందని భావిస్తే వారు నిర్దోషులుగా విడుదలవటం భరించలేక...చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది.

ఆ న‌లుగురు దుర్మార్గుల అంతు చూడటానికి రంగంలోకి దిగుతుంది దేవ‌కి. కోర్టు,పోలీస్ లు చేయలేని పనని తను చేసి వారిని శిక్షించాలని డిసైడ్ అవుతుంది. అందుకోసం ఓ డిటెక్టెవ్ (న‌వాజుద్దీన్ సిద్దికీ) స‌హాయం తీసుకుని సర్పయోగం మొదలెడుతుంది. ఈ లోగా సిబీఐ అధికారి ఫ్రాన్సిస్ (అక్షయ్ ఖన్నా) రంగంలోకి దిగుతాడు. అప్పుడు ఏమౌతుంది. దేవకి ...ఆ దుర్మార్గులకు శిక్ష వేయగలిగిందా...డిటెక్టెవ్ ఏ విధమైన సాయిం చేసాడు. సిబీఐ అధికారి ...చూస్తూ ఊరుకున్నాడా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

'సర్పయోగం' కాదు 'దృశ్యం' కావాలి

టీవీలో సర్పయోగం సినిమా వస్తూంటే..దీన్ని శ్రీదేవి తీస్తే ఎలా ఉంటుంది అని ఓ ఆర్డర్ వేసినట్లుండే చెప్పుకోవటానికి పెద్ద కథేమి లేదు. తన కుమార్తెని రేప్ చేసినవాళ్లను వరసపెట్టి చంపి పగ తీర్చుకునే పోగ్రాంతో 'సర్పయోగం' చేసి హిట్ కొట్టారు శోభన్ బాబు. మొన్నీ మధ్య తన కుమార్తెకు అన్యాయం జరిగితే దృశ్యం అంటూ రగలిపోయిన ఓ తండ్రి కథను చూసాం. ఇప్పుడు ఆ కథ...అదే వయస్సుకు చేరుకున్న శ్రీదేవి దగ్గరకు చేరింది. అయితే కాలం మారింది. సర్పయోగం లాంటి పగ,ప్రతీకారం మార్క్ కథ కాకుండా...అదే ఎమోషన్ తో ....సాగే దృశ్యంలాంటి ఇంటెన్స్ డ్రామా చేయాల్సిన సమయం ఇది. అలా కాకుండా...చాలా నార్మల్ గా చిన్న పిల్లాడు సైతం ఊహించేలా...తనను తల్లిగా సైతం ఏక్సెప్ట్ చేయని సవతి కూతురుకు అన్యాయం జరిగితే...ఆ అన్యాయం చేసినవాళ్లపై పగ తీర్చుకునే ఓ తల్లి కథగా దీన్ని రూపొందించారు. స్టోరీ లైన్ గా ఓకే అనిపించినా...కథలో చెప్పుకోదగ్గ డెప్త్ లేకపోవటంతో తేలిపోయింది. కథ చాలా ప్రెడిక్టుబుల్ మారిపోయి విసిగించింది. దృశ్యంలా క్షణ..క్షణం సస్పెన్స్ తో ఎమోషన్ ని కలిపి వండితే ఖచ్చితంగా మరో అద్బుతమయ్యేది. అన్ని భాషల్లోనూ అఖండ విజయం సాధించేది. ముఖ్యంగా సెకండాఫ్ లో సీన్స్ ని మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసి ఉంటే బాగుండేదనిపిస్తుంది.

వంకలు పెడితే కళ్లు పోవూ....

శ్రీదేవి ఓ సినిమాలో చేసిందంటే...ఈ సినిమాలో శ్రీదేవి నటించింది అనటం కన్నా జీవించింది అని రాయాలి...ఈ సినిమాకూ అదే వర్తిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో శ్రీదేవి నటన అద్బుతం అనకుండా ఉండలేం. నిజ జీవితంలో కూడా శ్రీదేవి ఇద్దరి పిల్లల తల్లి కావటంవల్లనో ఏమో కానీ ఫెరఫెక్ట్ అన్న రీతిలో కనిపించింది. శ్రీదేవి నుంచి అలాంటి నటన రాబట్టిన దర్శకుడు అని అనలేం...ఎందుకంటే శ్రీదేవి కు తొలి సినిమానూ కాదు. ఇలా అదరకొట్టడం శ్రీదేవికు కొత్తా కాదు.

వీటికేం తక్కువలేదు

ఈ సినిమాని డైరక్ట్ చేసిన రవి ఉద్యవార్‌ ...తనేం చెప్పదలుచుకున్నాడో, ఏం చూపదలుచుకున్నాడో దాన్ని చాలా స్పష్టంగా తెరకెక్కించాడని షాట్ కంపోజింగ్ ని బట్టి అర్దమవుతూంటుంది. ఎక్కడా తడబాటు అన్నది లేదు. తొలి చిత్రం అన్నట్లే అనిపించలేదు. ఓ అమ్మ ఆవేదన, ఓ తండ్రి నిస్సహాయత, అత్యాచారానికి గురైన యువతి మానసిక వేదన చూపుతూ మనని మనం ప్రశ్నించుకుని ఎమోషన్ కు గురిఅయ్యేలా పాత్రలు,సన్నివేశాలుతీర్చిదిద్దాడు. ఎ ఆర్ రహమాన్ ..బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్బుతం..ఎడిటింగ్, కాస్ట్యూమ్స్, ఆర్టి డిపార్టమెంట్ ఇలా ...అన్ని విభాగాలు సినిమా స్టాండర్డ్స్ కు తగ్గట్లే ఒకాదానికొకటి పోటీ పడి మరీ పనిచేసాయి.

అదండీ ఫైనల్ గా...

తన చుట్టూ తిరిగే కథ అదీ నిర్బయలాంటి ఎలిమెంట్ ని గుర్తు చేసే అంశం ఉండటంతో ఈ సినిమాని శ్రీదేవి ఒప్పుకుని ఉండవచ్చు. కానీ కథ చెప్పే విధానం ఈ కాలానికి తగినట్లు అప్ డేడెట్ గా ఉన్నట్లు శ్రీదేవి గమనించినట్లు లేరు.. దాంతో శ్రీదేవి నుంచి ఇలాంటి సినిమాని అదీ ఈ వయస్సులో ఎక్సపెక్ట్ చేయక వెళ్లితే దెబ్బతింటాము.అంతేకాకుండా అతిలోక సుందరిని చూసిన కళ్లతో ఈ వయస్సు మీరిన మామ్ చూడాలన్నా మనస్సు కలుక్కుమంటుంది.