ఇది జయంత్ సినిమా కాదు... ('జయదేవ్' రివ్యూ )
సీరియస్ పోలీస్ కథలు ఆ మధ్య కాలంలో వరసపెట్టి శ్రీహరి,సాయి కుమార్ ఎక్కువగా చేసారు. ఆ సినిమాలు బి,సి సెంటర్లలలో బాగా ఆడి డబ్బులు బాగా తెచ్చిపెట్టాయి. ఆ తరహా సినిమాలకు డిమాండ్ బాగా ఉండటంలో మళయాళం నుంచి సురేష్ గోపి నటించిన పోలీస్ సినిమాలు కూడా డబ్ చేసి వదిలి సొమ్ము చేసుకున్నారు. కానీ కాలం మారింది...ఆ టైపు సినిమాలన్నీ నాటు వ్యవహారాలుగా ఇండస్ట్రీ భావించి ప్రక్కన పెట్టేసింది. అయితే ఈ మధ్యన పోలీస్ పాత్రలపై హీరోల కన్ను పడింది. దాంతో అందరూ తలో పోలీస్ సినిమా ట్రై చేసారు...అయితే అవన్నీ ఫన్ చేసే గబ్బర్ సింగ్ లే. సిన్సియర్,సీరియస్ పోలీస్ కథతో సినిమా అంతా నడపటం కష్టం..కమర్షియాలిటీ మిస్ అవుతుందని కన్వీన్స్ అయ్యి కామెడీ మిక్స్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఈ సినిమాలకు మినహాయింపు టెంపర్ మాత్రమే.
కానీ తమిళంవాళ్ల టేస్ట్ వేరు. అరవ అతితో ఉన్నా...వాళ్లు పోలీస్ కథలు ఇప్పటికీ ఎక్కువశాతం సీరియస్ గానే ఉంటున్నాయి. అలా అక్కడ హిట్ అయిన వాటిని మనవాళ్లు డబ్బింగ్ కానీ రీమేక్ కానీ చేసి ఆడినా, ఆడకపోయినా మనకు అందిస్తూనే ఉన్నారు. డబ్బింగ్ సినిమాలతో ఏ ఇబ్బంది లేదుకానీ రీమేక్ చేస్తున్నాం...నేటివిటి కలుపుతున్నాం అంటూ చేసే కలగలపు వంటే చాలా సార్లు చీదేస్తోంది.
అసలు విషయానికి వస్తే...ఆ మధ్యన తమిళంలో ‘సేతుపతి’ అనే సీరియస్ పోలీస్ అధికారి సినిమా వచ్చి హిట్టైంది. ఆ సినిమాని చాలా మంది యంగ్ హీరోలు రీమేక్ చేద్దామనుకున్నారు. కానీ అదేంటో ఎవరికీ కుదరలేదు. దాంతో కొత్త కుర్రాడు ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గారి అబ్బాయి గంటా రవి కు సెట్ అయ్యింది. సర్లే కథ కుదిరింది కదా అని ఓ సీనియర్ డైరక్టర్ జయంత్ ని తీసుకొచ్చి డైరక్ట్ చేయించారు.
అప్పట్లో బావగారు బాగున్నారా, ప్రేమంటే ఇదేరా వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన జయంత్...తీన్ మార్ అంటూ చతికిల పడ్డారు. ఆయన ఈ ప్రాజెక్టుని టేకప్ చేసి, యంగ్ హీరోని లాంచ్ చేసారు. ఆల్రెడీ ప్రూవైన హిట్ కథ, సీనియర్ దర్శకుడు కలిసి...ఓ కొత్తకుర్రాడిని నిలబెట్టారా...సినిమా ఎలా ఉంది...రీమేక్ చేసేటంత విషయం సినిమాలో నిజంగా ఉందా...కొత్త కుర్రాడు ...తెలుగు పరిశ్రమలో నిలదొక్కుకునేటంత ట్యాలెంట్ ఉన్నోడేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి
సిన్సియర్ పోలీస్ సబ్ ఇన్సిపెక్టర్ జయదేవ్(గంటా రవి) వృత్తిలో భాగంగా ఓ మర్డర్ కేసుని ఇన్విస్టిగేషన్ చేపడతాడు. మర్డరైన వ్యక్తి ... మరో పోలీస్ ఆపీసర్ శ్రీరామ్(రవిప్రకాష్) కావటంతో మరింత కసిగా విచారణ చేస్తూంటాడు. ఆ ఇన్విస్టిగేషన్ లో లిక్కర్ డాన్ మస్తాన్‌బాబు (వినోద్‌కుమార్) ఈ హత్య వెనక ఉన్నాడని బయిటపడుతుంది. అలాగే మస్తాన్ బాబు చేసిన కొన్ని అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాలు సేకరించినందుకే శ్రీరామ్‌ను హత్య జరిగిందన్న విషయం తెలుసుకుంటాడు. అక్కడ నుంచి జయదేవ్ కు మస్తాన్ బాబు మధ్య పోరు ప్రారంభం అవుతుంది. డైరక్ట్ ఎటాక్ స్టార్ట్ చేస్తాడు. ఓ సబ్ ఇన్సిపెక్టర్... ఎంతో పలుకుబడి ఉన్న ఈ లిక్కర్ డాన్ ని ఎదిరించి ఎలా చట్టానికి పట్టించాడన్నదే మిగతా కథ.
విశ్లేషణ
తనకి సహకరించకుండా ఎదిరించే పోలీస్ లను చంపేసే..ఓ కరుడుగట్టిన విలన్, అతన్ని ఎదుర్కొని,ఆట కట్టించే ఓ పోలీస్ అధికారి. ఇదేమి కొత్త కాన్సెప్ట్ కాదు. ఇలాంటి పోలీస్ కథలు బోలెడన్ని గతంలో చూసేసాం. దాంతో ఓ నాలుగు సీన్స్ చూడగానే రాబోయే అరవై సీన్స్ చెప్పేసే పరిస్దితి ఉంటుంది. అయితే ఇక్కడే దర్సకుడు తన నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సింది. పాతని కూడా కొత్తగా అనిపించి,చెత్త ను కూడా కూడా అద్బుతంగా రక్తికట్టించగలగాలి. జయంత్ సి. పరాంన్జీ సమర్దుడైన దర్శకుడే. ఈ మధ్య కాస్త వెనక పడ్డారు కానీ గతంలో సూపర్ హిట్స్ ఇచ్చారు. కానీ ఎందుకనో ఆయన ఈ సినిమాని ఆ సినిమాల స్దాయిలో ఆసక్తి కలిగించేలా తీయలేదనిపించింది.
ఒరిజనల్ సినిమాలో ఉన్న ఇంటిన్సిటీని సైతం తెలుగులో పండలేదు. పాత సీన్స్ అంతే పాతగా తెరకెక్కించారనిపించింది. సినిమా కథలో ఎక్కడా ట్విస్ట్ లు టర్న్ లు లేవు. ముఖ్యంగా సినిమాలో ఎంటర్టైన్మెంట్ అనేది చాలా చాలా తక్కువ. వెన్నెల కిషోర్.. బిత్తిరి సత్తితో కామెడీ చేసే పయత్నం చేశారు. సోసో గా ఉన్నాయి ఆ సీన్స్. ఇంత సీరియస్ కథని బాలెన్స్ చేస్ స్దాయిలో కామెడీ సీన్స్ లేవు.
ఇక ఫస్టాఫ్ ఓకే అనిపించినా, సెకండాఫ్ మరీ డల్ అయ్యిపోయింది. దానికి తోడు పాటలు విసిగించాయి. ఇమేజ్ లేని హీరోపై ఈ పాటలు అవసరమా అనిపిస్తుంది. హీరో,హీరోయిన్ మధ్యవచ్చే రొమాంటిక్ డ్రామా సీన్స్ మరీ పేలవంగా ఉన్నాయి. అవీ మెయిన్ కథని అడ్డుకోవటానికి తప్ప ఎందుకూ పనికిరాలేదు.
ముఖ్యంగా విలన్ ట్రాక్ సినిమాలో బాగా పూర్ గా ఉంది. అదే దెబ్బ కొట్టింది. సినిమా మొత్తం హీరోకు, విలన్ కు మధ్య జరిగే వార్ అయినా ...ఆ స్దాయిలో సీన్స్ లేవు. ఉద్యోగం పోగొట్టుకున్న హీరో తిరిగి దాన్ని సంపాదించటం, విలన్ దెబ్బకొట్టడం వంటి అంశాలు మరింత డెప్త్ గా చూపించాల్సింది. తమిళంలో అలవాటైన హీరో కాబట్టి కథ,కథనంలో సమస్యలు కొన్ని కొట్టుకుపోయాయి. కాని ఇక్కడ కొత్త హీరో కావటంతో...ప్రతీది తేటతెల్లంగా కనపడి,నీరు కార్చేసింది.
కలిసొచ్చిన అంశాలు
ఈ సినిమాతో పరిచయమైన హీరో రవి..రొటీన్ గా ఏ లవ్ స్టోరోనో, ఏ ఫన్ తో నడిచే కథో ఎంచుకోకుండా... సిన్సియర్ పోలీస్ కథ ఎన్నుకోవటంతో అతనిలోని టాలెంట్ ని బయిటపెట్టే అవకాసం ఏర్పడింది. ఈ పాత్రకు తగ్గ ఫిజిక్ తో బాగున్నాడు. .నారా రోహిత్ లా విభిన్నమైన కథలు ఎంచుకుంటూ వెళితే. ఖచ్చితంగా డిఫెరెంట్ కథలు డీల్ చేసే హీరోగా అవతరిస్తాడు.
హీరోగా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన వినోద్ కుమార్..ఈ సినిమాతో విలన్ గా కనిపించారు. ఆయనకు డిజైన్ చేసిన ట్రాక్ గొప్పగా లేకపోయినా తన నటనానుభవంతో సీన్స్ ని అలవోకగా పండించుకుంటూ వెళ్లిపోయారు. మన తెలుగుకు వినియోగించుకుంటే వినోద్ కుమార్ రూపంలో మంచి విలన్ దొరికినట్లే.
ఎవరెలా చేసారు
కొత్త కుర్రాడు గంటా రవి...తొలి చిత్రమైనా అద్బుతమని చెప్పలేం కానీ బాగానే ప్రయత్నించాడు. దర్శకుడు తన అనుభవంతో హీరో మీద ఏ ఎమోషన్స్ బాగా పలుకుతున్నాయో..గమనించుకుని వాటినే వినియోగించుకుని, మిగతా వాటిని తెలివిగా ఎవాయిడ్ చేసారు. అయిుతే రవి చాలా విషయాల్లో ఇంకా పరిణితి సాధించాల్సి ఉందని అర్దమవుతుంది. ఇక హీరోయిన్ మాళవిక రాజ్ గ్లామర్‌గా కనిపించింది కానీ కథకు కానీ, సినిమాకి కానీ ఎక్కడా ఉపయోగపడలేదు. ఉందంటే..ఉంది..లేదు అంటే లేదు అన్నట్లుగా ఉందామె క్యారక్టర్. వెన్నెల కిషోర్.. పరుచూరి వెంకటేశ్వరరావు.. శివారెడ్డిలు ఎప్పటిలాగే తమ తమ క్యారక్టర్స్ కి న్యాయం చేసారు.
టెక్నికల్ గా...
సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూస్ జస్ట్ ఓకే అన్నట్లున్నాయి. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుని, ఓ ఇరవై నిముషాలుతగ్గిస్తే బాగుండేది. ఇక దర్శకుడుగా ఇది జయంత్ స్దాయికి తగ్గ సినిమా కాదు. ఆయన పేరు వేయకపోతే..ఈ సినిమా ఆయన డైరక్ట్ చేసారంటే నమ్మలేం.
ఫైనల్ గా ...
ఈ సినిమా ఇప్పటికే గంటా రవికు వీరాబిమానులు ఏర్పడి ఉంటే ...ఖచ్చితంగా వారికోసమే.