గెటప్ మాత్రమే కాదు..సినిమా కూడా అలాగే.. ('పటేల్ సర్' రివ్యూ)
ఏమిటి...జగపతిబాబు హీరోగా చేస్తే ఇంకా చూసేవాళ్లు ఉన్నారా...?? అదేంటండి అలా అంటారు..ఆయన బాడీ లాంగ్వేజ్ కు ఆయన వయస్సుకు తగ్గ మంచి కథతో వస్తే ఎందుకు చూడరు...బాగున్న సినిమాని మన తెలుగువాళ్లు పట్టుపట్టి మరీ భుజాన మోసి హిట్ చేస్తారు...కత్తిలాంటి కథ ముఖ్యం కానీ...అందులో నటించేవాళ్లతో పనేంటి..ఏం ఆ మధ్యన అసలు మనకెవరో తెలియని విజయ్ ఆంటోని హీరోగా చేసిన బిచ్చగాడు సినిమా ని సూపర్ హిట్ చేయలేదా...కొత్త హీరోతో ...చిన్న సినిమాగా వచ్చిన పెళ్లి చూపులు ఘన విజయం సాధించలేదా.పదేళ్లు గ్యాప్ తీసుకున్న చిరంజీవి హీరాగా రీఎంట్రీ ఇస్తే ఏ స్దాయిలో ఆడిందో గుర్తు లేదా...
అయినా జగపతిబాబు కు ఏం తక్కువ...గతంలో ఎన్నో హిట్ సినిమాల్లో హీరోగా చేసాడు..ఇప్పుడు కూడా విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు..ఆయనతో చేస్తే మినిమం గ్యారెంటీ ఇలా చాలా సమాధానాలు వినిపిస్తాయి...అలాంటివన్నీ ఖచ్చితంగా జగపతిబాబు తో ఈ సినిమా చేస్తున్నప్పుడు దర్శక,నిర్మాతల మనస్సుని సమాధానపరిచి,ధైర్యం చెప్పి ముందుకు వెళ్లేలా ఉంటాయి. అయితే ఒకటే డౌట్ వస్తుంది..హాయిగా విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా జోరుమీదున్న జగపతిబాబుని ఉన్నట్టుండి హీరోగా ఎందుకు నటించాడా? ఆయన్ని ఈ సినిమా చేసేలా ప్రేరేపించిన ఆ కథ ఏమిటి...టీజర్స్, ట్రైలర్స్ కు తగ్గట్లుగా ఈ సినిమా ఉందా. జగపతిబాబుని హీరోగా మరిన్ని ఇలాంటి సినిమాలు చేసే ఉత్సాహం నిర్మాతలకు ఇస్తుందా...వంటి విషయాలు తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే.
కథేంటి
రిటైర్డ్ ఆర్మీ మేజర్ సుభాష్ పటేల్(జగపతిబాబు) వరుసపెట్టి మర్డర్స్ చేస్తూంటాడు. ఆయనతో పాటు అంధురాలైన మనవరాలు కూడా ఉంటుంది. అయితే ఇలా ఆయన ఎందుకు మర్డర్స్ చేస్తున్నాడు...ఏదన్నా దేశ రక్షణ కోసం సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నాడా...లేక ఆయన ఏమన్నా భారతీయుడు..అపరిచితుడు టైప్ సినిమాలు చూసి ప్రేరణ పొంది మర్డర్స్ మొదలెట్టాడా... లేక రిటైర్ అయ్యి...ఏమీ తోచక..సంఘ ప్రక్షాళన కార్యక్రమం మొదలెట్టాడా...ఇవేమీ కాకుండా ఆయన చేత ఎవరైనా ఈ మర్డర్స్ చేయిస్తున్నారా... ఏదన్నా పర్శనల్ పగ..ప్రతీకారం(ఆయన తల్లి,తండ్రిని ఏ యాభై ఏళ్ల క్రితం అన్నా చంపేసారా..అప్పటి నుంచి జీవితంలో ఖాళీ దొరక్క ఇప్పుడు రిటైర్ అయ్యాం కదా అని ఈ మర్డర్స్ మొదలెట్టారా) ఉందా వంటి అనేక సందేహాలు.....అసలు ఈ మర్డర్స్ చేయటానికి కారణం ఏమిటి అనే విషయం ఎవరికీ అంతుబట్టదు. (పోనీ ఆయనా ఎవరికీ చెప్పినట్లు కనపడరు) సర్లే ఈ మర్డర్స్ ఆపటం కన్నా ..ముందు అసలు ఈయన ఈ మర్డర్స్ పోగ్రామ్ ఎందుకు చేస్తున్నాడు...పెన్షన్ తీసుకుంటూ కాలక్షేపం చేయక అనే సందేహం తొలిచేసిందో ఏమో కానీ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి స్పెషల్ ఆఫీసర్ (తాన్యా హోప్) దింపుతుంది పోలీస్ డిపార్టమెంట్. రంగంలోకి దిగిన ఆమె ఈ పటేల్ సార్...ఇలా వరసపెట్టి మర్డర్స్ చేసే పోగ్రామ్ వెనక ఉన్న మోటోని కనుక్కోగలుగుతుందా..అసలేంటి ఆ ప్లాష్ బ్యాక్...చివరకు కథ ఏం మలుపు తీసుకుంది అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
అప్పటి హీరో...అప్పటివారికి తగ్గట్లే...
జగపతిబాబు హీరోగా వెలిగే రోజుల్లో ఆయనకు ఉన్న అభిమాన సంఘాలు ఈ మధ్యన కానీ కలిసి...మీరు క్యారక్టర్ ఆర్టిస్ట్, విలన్ వేషాలు వేయటం ఏంటి ..హీరోగా మళ్లీ సినిమా చేయాలి సార్ అని ఏమన్నా రెచ్చగొట్టారేమో తెలియదు. ఆయన చాలా కాలంగ్యాప్ తర్వాత దాదాపు హీరోలాంటి (తన చుట్టు తిరిగే కథని)పాత్రని ఎన్నుకుని మన ముందుకు వచ్చారు. సర్లే మనం చేసే సినిమా ఈ కాలం కుర్రాళ్లు ఎక్కడ చూస్తారు..ఆ జనరేషన్ లో వాళ్లే కదా చూసేది..వాళ్లకు నచ్చే కథ తో వెళ్ళాలి అని ఆలోచించినట్లున్నారు. దాంతో అప్పటి అభిమానులను అలరించాలనుకున్నట్లుగా... ఈ కాలానికి బాగా పాతపడ్డ ఆ కాలం నాటి సినిమాలకు ప్రాణంగా నిలిచిన పగ-ప్రతీకారం ఫార్ములా ని భుజాన వేసుకున్నారు. అయితే ఆయన గమించని ఏమిటీ అంటే ..ఆ జనరేషన్ వాళ్లు కూడా ఈ జనరేషన్ సినిమాలకు అలవాటు పడిపోయారు. దాంతో ఆయన అభిమానులకు సైతం పాతకాలం హీరో చేసిన ఓ పాతకాలం సినిమాలాగే అనిపించింది. ఈ సినిమాలో కొత్తదనం ఏమిటీ అంటే అది జగపతిబాబు గెటప్ మాత్రమే అని చెప్పాలి.
ఇలాంటివే చూస్తున్నాం కదా...
ఇది రొటీన్ కథ,పాత పగ..ప్రతీకారం అని తీసి పారేసారు..మన తెలుగు సినిమాకు రొటీన్ కథా,కథనాలు కాక కొత్తవి వస్తున్నాయా...ప్రయోగాలు ఏమన్నామన హీరోలు చేస్తున్నారా.. ఆ రొటీన్ కథలే హిట్ అవటం లేదా అని అడగొచ్చు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి..అలాంటి రొటీన్ వేషాలన్ని... సినిమా ఎలా ఉన్నా ఒకటికి నాలుగుసార్లు చూసే అభిమానులు ఉన్న హీరోలకు చెల్లు. అంతేకానీ జగపతిబాబులాంటి వారికి కాదు. ఆయన సినిమాలో స్పెషాలిటీ ఏమీ లేకపోతే ఒక్కసారి కూడా చూడలేం...
జగపతిబాబు కి రిక్వెస్ట్...
సార్..మీరు హీరోగా మళ్లీ చెయ్యాలనుకోవటం మాకు ఆనందమే. కానీ మేముి వందరూపాయలు పెట్టి,ప్రక్కనే ఉన్న యంగ్ హీరోల సినిమాలు ప్రక్కన పెట్టి మరీ మీ సినిమాకు రావాలంటే...కథే హైలెట్ గా ఉండాలి. మీ సినిమా చూసి వచ్చాక మాట్లాడుకునేలా ఉండాలి. ఈ జనరేషన్ కు తగ్గ విషయం ఉండాలి. మళయాళంలో లాల్ చేసే సినిమాలు లాగ ఉంటే ఖచ్చితంగా మీ సినిమాలు సూపర్ హిట్స్ చేయటానికి మేము సిద్దం.
తొలి సినిమాకే ఇలాంటిది ఏంటి సామీ
ఈ చిత్రం ద్వారా వాసు పరిమి అనే దర్శకుడు పరిచయమయ్యాడు. మరీ పాతకాలం కథని కాకుండా...కాస్తంత ఈ కాలంకు తగిన స్టోరీలైన్ ని ఎన్నుకుంటే అతను మంచి డైరక్టర్ అవుతారనిపిస్తుంది సినిమాని ఆయన డీల్ చేసిన తీరు చూస్తూంటే. సినిమాలో యాక్షన్ బ్లాక్స్ తో పాటు ఎమోషనల్ బ్లాక్స్ ని కూడా అంతే సమర్దవంతంగా తీర్చిదిద్దాడు. స్క్రిప్టే ఆయన డైరక్షన్ టాలెంట్ ని దెబ్బ కొట్టిందని చెప్పాలి. రొటీన్ రివెంజ్ ఫార్ములా కథ ని దర్శకుడు తొలి చిత్రానికి ఎంచుకోవడం నిరుత్సాహపరుస్తుంది. ఇంటర్వెల్ లో అసలు ట్విస్ట్ రీవీల్ చేసిన తర్వాత మొత్తం కథ ఏంటనేది సగటు ప్రేక్షకుడుకి ఇట్టే అర్ధమైపోవటం దెబ్బ కొడుతుంది.
మిగతా డిపార్టమెంట్స్
సినిమాలో సంగీతం జస్ట్ ఓకె అన్నట్లుగా ఉంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే ఎక్కడో ఇంతకుముందు విన్నట్లే అనిపించింది. సినిమాటోగ్రఫి గొప్పగా లేదు. ఎడిటింగ్ అయితే చెప్పుకోనక్కర్లేదు. డైలాగులు మాత్రం చాలా సార్లు సందర్బం లేకుండా నవ్వు వచ్చాయి. సాయి కొర్రపాటి నిర్మాణ విలువలు భాగానే ఉన్నాయి. సినిమాపై పెట్టిన పెట్టుబడి ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది.
ఫైనల్ గా...
మీరు కనుక జగపతిబాబు వీరాభిమానులు అయితే ఈ రివ్యూ చదివినా..వెంటనే మీ మైండ్ లోంచి డిలేట్ చేసిసి వెంటనే చూసేయండి. నచ్చేయచ్చు. కాకపోతే మాత్రం మీ సమయాన్ని ముంచేయచ్చు. సార్...కాస్త రొటిన్ కదా.