Movies | Music | Music

Gopichand's Oxygen Movie Review

November 30, 2017
Sri Sai Raam Creations
Gopichand, Raashi Khanna, Anu Emmanuel, Jagapathi Babu, Shaam, Chandra Mohan, Shayaji Shinde, Abhimanyu Singh, Sithara, Sudha, Ali, Brahmaji, Avantika Vandanapu, Prabhakar and Jayan
Vetry
AM Rathnam
Yuvan Shankar Raja
S Aishwarya
Jyothi Krishna

సిగరెట్ పొగతో ఖరాబైన 'ఆక్సిజన్' (రివ్యూ)

హఠాత్తుగా టెర్రరిస్ట్ ల బాంబ్ దాడి జరుగుతుంది. అందులో ఎంతో మంది మరణిస్తారు. కొంతకాలానికి మర్చిపోతారు. కాని ఒకరికి మాత్రం బాగా బాధ కలుగుతుంది. తన సోదరుడు లేదా సోదరి మరణానికి కారణమైన ఆ బాంబు దాడులకు కారణమైన మాఫియా డాన్ అంతు తేలుస్తా అని బయిలుదేరుతాడు. మెల్లిగా ఆ డాన్ కూతురు ఎడ్రస్ పట్టి.. లైన్ లో పెట్టి..వాడి కోటలోకి అడుగుపెట్టి ఫైనల్ గా అంతు చూస్తాడు. ఇది మన రెగ్యులర్ రొటీన్ సినిమా కథ.

అదే పద్దతిలో ..హీరో ...తమ్ముడు సిగరెట్స్ తాగి తాగి కాన్సర్ తెచ్చుకుని చనిపోతాడు. దాంతో ఆవేదనతో...ఆ సిగరెట్లు తయారు చేసే కంపెనీ ఓనర్ పై హీరో పగ పడతాడు. రివేంజ్ తీర్చుకునే ప్రాసెస్ లో ఆ ఓనర్ ... కోటలో అడుగుపెట్టి...వాడి కూతురుని లైన్ లో పెట్టి.. చివర్లో ఆ ఓనర్ అంతు చూస్తాడు. ఏదో సరదాగా వెటకారంగా చెప్తున్నది కాదు. అది ఆక్సిజన్ సినిమా స్టోరీ లైనే. ఇలాంటి కథలు కూడా సినిమాలు చేస్తారా అని అనిపించే కథతో వచ్చిన ఈ సినిమా కథ తెరపై ఎలా ఉంది... అసలు ఈ సినిమా కథ ఏమిటి... ఎన్నో భారీ సినిమాలు నిర్మించిన ఎఎమ్ రత్నం నిర్మాతగా చేయటానికి ఈ కథలో ఆయనకు నచ్చేటంత గొప్ప ఎలిమెంట్స్ ఉన్నాయా..లేదా కొడుకు కెరీర్ కోసం సినిమా చేసాడా....ఇవన్నీ ప్రక్కన పెడితే...వరస ఫ్లాఫ్ ల్లో ఉన్న గోపీచంద్ కు ఈ సినిమా అయినా హిట్ ఇస్తుందా...లేక పాత ప్లాఫు పాటే పాడుతుందా వంటి విషయాలు తెలియాలంటే... రివ్యూలో చదవాల్సిందే.

కథేంటి

ఆర్మీలో పనిచేస్తున్న సంజీవ్ (గోపీచంద్) సెలవుల్లో తన ఊరుకు వస్తాడు. అక్కడ తను ప్రేమించిన డాక్టర్ గీత (అను ఇమ్మానుల్)ను వివాహం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటూంటాడు. అయితే అతని కుటుంబంలో అనుకోని విషాదం చోటు చేసుకుంటుంది. టైగర్ బ్రాండ్ సిగరెట్స్ తెగ తాగటం వల్ల సంజీవ్ తనకు ప్రాణ సమానమైన తమ్ముడిని కోల్పోతాడు. అక్కడ నుంచి ఆ టైగర్ బ్రాండ్ పై ఎంక్వైరీ మొదలెడతాడు. ఆ సిగెరెట్ కంపీని ని క్లోజ్ చేయాలని, ఆ సిగరెట్స్ కంపెనీ ఓనర్ పై పగ తీర్చుకుందామని రాజమండ్రి దగ్గర ఉన్న ఓ పల్లెటూరుకు వస్తాడు . అప్పుడు ఏం జరిగింది ? సిగరెట్ కంపెనీ ఓనర్ ..శృతి (రాశీ ఖన్నా)తో అతనికి రిలేషన్ ఏమిటి ? టైగర్ బ్రాండ్ యజమాని ఎవరో కనుక్కుని అంతమొందించాడా..అసలు ఈ కథకు ఆక్సిజన్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సిగరెట్..వికటించిన ఓ సామాజిక అంశం

సామాజిక అంశాలను,మసాలా ఎలిమెంట్స్ తో కలిపి కథ వండి వడ్డించటమే విద్య తమిళం వాళ్లకు తెలిసినంతగా మనకు తెలియదనేది నిజం. అయితే సినిమా కథ వండుకోవాలని అనుకున్నప్పుడల్లా దొడ్లో కూరగాయలు తెంచుకున్నంత ఈజీగా అందుబాటులో సామాజిక అంశాలు దొరకవు కదా. పరిశీలించాలి..రీసెర్చ్ చేయాలి..మూలాలను పట్టుకుని లాగాలి. అంత ఓపికలు ఎక్కడున్నాయి. కొత్తదేదీ దొరకక.... ఉన్నదేదో లాగిద్దాం అని...ఇప్పటికే చాలా సార్లు నలిగిపోయిన అవినీతి,లంచం వంటి విషయాలపై సినిమాలు చెయ్యాలంటే కథ రాసేవారికి బోర్, తీసేవారికి బోర్, చూసేవారికి అంతకు రెట్టింపు బోర్. కాబట్టి నచ్చేదో,నచ్చనదో సామాజిక సమస్యను ఒకదాన్ని పసిగట్టి, పసందుగా దాని చుట్టూ కథ కట్టి సినిమా మొదలెట్టాలి. అయితే అలా అవసరం కోసం వెతుక్కుని భుజాన ఎత్తుకున్న ఆ సామాజిక అంశాలు..ఒక్కోసారి వికటించి చూసేవారికి విరక్తి పుట్టిస్తాయి అని స్పైడర్ తో సహా చాలా సినిమాలు ప్రూవ్ చేసాయి. ఇదిగో ఇప్పుడు ఆక్సిజన్ వంతు వచ్చింది.

సిగరెట్లులో కల్తీ కలుస్తోందని, దాని వల్ల ఆరోగ్యాలు చెడిపోతున్నాయని ఈ సినిమాలో కథాంశంలో కీలకాశం. అయితే దాని ఎగ్జిక్యూషన్ సరిగా లేకపోవటంతో... కల్తీ సిగెరెట్లు మార్కెట్లో ఉంటాయి..జాగ్రత్త..మంచి సిగరెట్లు చూసి కొనుక్కోండి అన్నట్లుగా మెజేజ్ డీవియేట్ అయ్యింది. అంతకానీ కల్తీ ఉన్నా లేకపోయినా ఏ సిగిరెట్ అయినా ఆరోగ్యం దెబ్బ తీసేదే అని చెప్తున్నట్లుగా లేదు.

నవ్వులాట వ్యవహారమే..

ఇక ఈ సినిమా స్క్రిప్టు విషయానికి వస్తే...పరమ రొటీన్ స్క్రీన్ ప్లే తో నడుస్తుంది. ఫస్టాఫ్ మొత్తం...హీరో ...హీరోయిన్స్ మధ్య జరిగే సరదా సరదా సీన్స్ తో నడిపేసారు కానీ కథలోకి ఒక్క అడుగు కూడా వెయ్యలేదు.తీరిగ్గా సెకండాఫ్ సగం వచ్చేదాకా అసలు మనకు హీరో ఎందుకు , ఏం చేస్తున్నాడో అర్దం కానివ్వకుండా నడిపారు. సెకండాఫ్ లో హీరో ఫ్లాష్ బ్యాక్ అయ్యాక..ఇంతా చేస్తే ఈ కథ మొత్తం సిగెరెట్లు కాలిస్తే చనిపోతారు అని నీతి చెప్పేందుకా ఈ సినిమా తీసారు అని అనిపిస్తుంది. అయితే అలాంటి కథా తీయచ్చు ..తప్పు లేదు కాకపోతే ...అది ఓ పద్దతిగా తీయాలి. గోపీచంద్ లాంటి మాస్ హీరో...సిగెరెట్ తాగి తన సోదరుడు చనిపోయాడని పగపెట్టడం చూస్తూంటే నవ్వులాట వ్యవహారంగా అనిపిస్తుంది. ఇలాంటి విషయాలపై స్క్రిప్టు దశలోనే శ్రద్ద పెట్టాలి.

ఇక సినమాలో ...విలన్ ...జగపతిబాబు అని మనకు మొదట నుంచి కొడుతూనే ఉంటుంది. అయితే చివరి క్షణం దాకా అదో పెద్ద ట్విస్ట్ అన్నట్లుగా రివీల్ చేయకుండా దాచి ఉంచారు. దాంతో ఈ ట్విస్ట్ ..పరమ నీరసమైన ట్విస్ట్ గా మారింది. ఇంట్రవెల్ ట్విస్ట్ మాత్రం బాగా పేలింది. ఆ ట్విస్ట్ కోసం ..ఫస్టాఫ్ కథ ఏమీ లేకుండా దాచిపెట్టి బోర్ కొట్టే కామెడీతో నడపటం మాత్రం సినిమాపై గౌరవం పోగొట్టాయి.

ఆలోచనలో పడేసే డైలాగులు..

రాశీ ఖన్నా, గోపీచంద్ ల మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయి. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అను ఇమ్మాన్యుయేల్ గ్లామర్ గా కనిపించి మెప్పించింది. కాకపోతే సినిమా లెంగ్త్ బాగాతగ్గిస్తే బాగుండేది. ముఖ్యంగా ఫస్టాఫ్ లో చాలా సీన్స్ లేపేయవచ్చు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సురేంద్రకృష్ణ రాసిన డైలాగులు చాలా చోట్ల ఆలోచింప చేసే విధంగా చక్కగా సినిమా పాత్రకు తగ్గట్లుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు ..ఎ ఎం రత్నం స్టాడర్డ్స్ లో లేవు. చాలా చోట్ల చుట్టేసారా అనే డౌట్ వస్తుంది.

ఫైనల్ థాట్

"స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టూ హెల్త్" . ఈ మాట వినీవినీ, చదివీ చదివీ బోర్ కొట్టేసింది. అలాగే సినిమా ప్రారంభానికి ముందు ఈ నగరానికేమయింది..తరహాలో వచ్చే ప్రకటనలు వినోదంగా మారిపోయాయి. ఇదిగో ఇప్పుడు ఇలాంటి సినిమాలు...మొదలయ్యాయి

వాస్తవానికి పొగరాయుళ్లు తాము పొగతాగి రోగాలు తెచ్చుకోవటమే కాక, బహిరంగ ప్రదేశాల్లో గుప్పున వదులుతూ సాటివారి ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తున్నారు. ఈ పాసివ్ స్మోకింగ్ పరిస్థితి నుంచి అమాయకులుని తప్పించటమే కాకుండా.. మార్పు తీసుకొచ్చే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి విషయాలు కలిపి ..ఓ డాక్యుమెంటరీ చేయాలి కానీ సిగరెట్ కంపెనీవాడిని కుమ్మేద్దాం అంటూ హీరో బయిలుదేరే కథలు బాగుండవేమో. అయినా ఇతర దేశాల్లో సిగరెట్ కంపెనల మీద కేసులు వేసి,గెలిచిన వాళ్లు ఉన్నారు. ఆ దిశలో ప్రయత్నం చేసినా ప్రేరణగా ఉండేది.