Movies | Music | Music

Bhaagamathie Movie Review

January 26, 2018
UV Creations and Studio Green
Anushka Shetty, Unni Mukundan, Jayaram, Asha Sharath, Murali Sharma, Dhanraj, Prabhas Srinu, Vidyullekha Raman, Deva Darshan, Talaivasal Vijay, Ajay Ghosh, Madhu Nandan
R Madhi and Sushil Choudhary
Kotagiri Venkateshwara Rao
Ravinder
Ashok
SS Thaman
Vamsi, Pramod
G Ashok

'పిజ్జా' కు శ్రీమతి... (‘భాగమతి’ మూవీ రివ్యూ)

ఓ పురాతన బంగ్లా ....అందులో ఓ పనిపాటా లేని ఓ దెయ్యం (విలన్ ని దెయ్యం అనాలి) లేదా ఆత్మ (హీరో,హీరోయిన్స్ ని ఆత్మలు అనాలి) కబ్జా చేసి, తిష్టవేస్తుంది. దానికి ఆ బూజు పట్టిన బంగ్లా అంటే యమా మోజు. అక్కడికి ఎవరైనా వచ్చినా భరించలేదు. వారి మీద ఎటాక్ చేసేస్తూంటుంది. దానికి పదేళ్ల క్రిందటి నాటిదో..పది వందేళ్ల క్రిందటి నాటిదో ఓ అన్యాయం ,అక్రమం జరిగిన కథ ప్లాష్ బ్యాక్ గా ఉంటుంది. దాన్ని తలుచుకుంటూ ఆ బంగ్లాను ఎవరికీ సరెండర్ చెయ్యకుండా రోజులు గడుపుతూంటుంది. అయితే ఫుడ్డూ , బెడ్డూ దెయ్యాలకు అవసరం లేదు కాబట్టి ఎన్ని వందల ఏళ్లు అయినా ఏమీ సంపాదించకుండా,కష్టపడకుండా కాలక్షేపం చేసేస్తూంటాయి..నో ప్లాబ్లం.

అయితే దాన్ని అక్కడ నుంచి వెకేట్ చేయించి, ఆ బంగ్లాని మనం కబ్జా చేయాలంటే .. దాని ఫ్లాష్ బ్యాక్ తెలుసుకుని , దాని పగ,ప్రతీకార కార్యక్రమాలు ఉంటే తీర్చాలి...ఇదీ కొంచెం అటూ ఇటూలో మన రెగ్యలర్ హర్రర్ సినిమాల పర్మనెంట్ స్టోరీ లైన్. ఈ స్టోరీ లైన్ ని .. కామెడీ చేసినా, భయపెట్టినా ఎలా చేసినా చివరకు ఆ దెయ్యం పగ తీర్చటమే పరమావధి. ‘భాగమతి’ ట్రైలర్ చూడగానే ఇదీ అదే టైప్ కథేనేమో ...‘అరుంధతి’కు సీక్వెల్ చేసేరేమో అనే డౌట్ వస్తుంది. అయితే సినిమా చూస్తే ...అబ్బబ్బే అలాంటి కథ కాదు అని అర్దమవుతుంది. మరి ఈ హర్రర్ లాంటి థ్రిల్లర్ స్టోరీ లైన్ ఏమిటి...బాహుబలి తర్వాత అనుష్క చేయదగ్గ సినిమాయేనా, పిల్ల జమీందార్ అశోక్ ఏం చెప్పి ఈ సినిమాని ఓకే చేయించుకున్నారు..ఈ సినిమా ‘అరుంధతి’స్దాయిలో ఆడుతుందా...చారిత్రక భాగమతి కథకు దీనికి ఏమన్నా సంభంధం ఉందా వంటి విషయాలు తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే.

కథేంటి..

నీతికి,నిజాయితి బ్రాండ్ అంబాసిడర్ అయిన సెంట్రల్ మినిస్టర్ ఈశ్వరప్రసాద్ (జయరామ్) కు ప్రజల్లో రోజు రోజుకీ క్రేజ్ పెరిగిపోతుంది. దానికి తోడు..ప్రజల కోసం... ఆయన తన సొంతపార్టీకే ఎదురుతిరగుతాడు. దాంతో ..ఆయన్ని కట్టడి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకుంటాడు. అందుకోసం సీబీఐని ఆశ్రయిస్తారు. సీబీఐ జాయింట్ డైరక్టర్ వైష్ణవి నటరాజన్‌(ఆశా శరత్)కు రంగంలోకి దించుతాడు. ఆమె ఓ స్కెచ్ వేస్తుంది. ఈశ్వరప్రసాద్ ని డైరక్ట్ గా టార్గెట్ చేయకుండా...ఆయన వద్ద రెండు సార్లు సెక్రటరీ గా చేసిన చంచల (అనుష్క)ని ఇంటరాగేట్ చేసి, కొన్ని విషయాలు కూపి లాగి మినిస్టర్ ని ఇరికించాలనుకుంటుంది. అప్పటికే చంచల తన ప్రియుడు శక్తి (ఉన్ని ముకుందన్) ని చంపి జైల్లో ఉంటుంది.

అయితే జైల్లోనే ఇంటరాగేషన్ పోగ్రాం పెడితే అందరికీ డౌట్ వస్తుందని, ఎక్కడో ఊరి చివర ఉన్న భాగమతి బంగ్లాకు ఆమెను తరలిస్తారు. అయితే అక్కడకు వెళ్లాక సీన్ మారిపోతుంది. బంగ్లాకు వెళ్లిననాటి నుంచి ఎప్పుడో చనిపోయిన... భాగమతిలా చంచల బిహేవ్ చేయటం మొదలెడుతుంది. ఆమెలా అరబిక్ మాట్లాడుతుంది. రాజసం ఒలకబోస్తుంది. దాంతో సీబీఐ టీమ్ ఏం చేయాలో అర్దం కాని సిట్యువేషన్ కు వస్తారు. డాక్టర్ ని రప్పించి ట్రీట్ మెంట్ చేసినా వర్కవుట్ కాదు. దాంతో చంచల .. మానసికంగా దెబ్బ తిందేమో అని మెంటల్ హాస్పటిల్ కు తరలిస్తారు. అక్కడేం జరిగింది. అసలు భాగమతికు చంచలకు ఉన్న రిలేషన్ ఏమిటి..ఈశ్వరప్రసాద్ ని అవినీతి కేసులో ఇరికించగలిగారా..తన ప్రియుడునే చంచల చంపటానికి కారణం ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

పిజ్జా ..మళ్లీ తిందామా

2012 లో కథ చేసుకుని అప్పటినుంచి అనుష్క డేట్స్ కోసమే వెయిట్ చేస్తున్నామని చెప్పారు దర్శకుడు. ఇంతకాలం ఆగి మరీ సినిమా చేసారు అంటే ఆ కథ ఖచ్చితంగా కాలంలో నిలబడి ఉండాలి. మరి అలాంటి కథ ఎలా ఉంది అంటే హర్రర్ కోటింగ్ వేసిన థ్రిల్లర్ లా ఉంది. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే అప్పట్లో తమిళ డబ్బిగ్ అయ్యి వచ్చిన పిజ్జా సినిమాకు ఓ వెర్షన్ లా ఉంది. అదే స్క్రీన్ ప్లే యాజటీజ్ ఫాలో అయ్యిపోయారు. కాకపోతే హర్రర్ ఎలిమెంట్స్ ని ఎక్కువగా పెట్టుకున్నారు. అయితే పిజ్జాని ఫాలో అయినా సెకండాఫ్ లో వచ్చే కీలకమైన ట్విస్ట్ బాగానే పేలింది. అలాగే హర్రర్ ఎలిమెంట్స్ కు థియోటర్ లో మంచి స్పందనే వచ్చింది.

కాకపోతే మెంటల్ హాస్పటిల్ కు వెళ్లాక కథని అర్దాంతరంగా ముగించారనిపించింది. విలన్ ఎవరో రివీల్ అయ్యాక..కొద్ది సేపు కూడా సినిమా నడపలేదు. విలన్ కు ప్రధాన పాత్ర అనుష్క కు మధ్య మరింత మైండ్ గేమ్ నడిస్తే ...సెకండాఫ్ నిలబడేది. అలా చేయకపోవటంతో .. హర్రర్ సీన్స్ ఉన్న ఫస్టాఫ్ బాగుండి,సెకండాఫ్ సోసోగా ఉన్నట్లు అనిపించింది. ధ‌న‌రాజ్‌, విద్యుల్లేఖా రామ‌న్‌, ప్ర‌భాస్ శ్రీనులు ఉన్నంతలో కామెడీని పండించే ప్ర‌య‌త్నం చేశారు కానీ చెప్పుకోదగిన విధంగా వ‌ర్కవుట్ కాలేదు. అయితే కథకు అంత కామెడీ సీన్స్ అవసరం లేదు కాబట్టి పెద్దగా నిరాశపడాల్సిన పనిలేదు ఈ విషయంలో.

తేలిపోయింది

నిజానికి ఇలాంటి సినిమాకు కీలకం..సెకండాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్. అది ఎంత బలంగా,భావోద్వేగాలతో నిండి ఉంటే అంతలా మిగతా ప్లాట్ ,సబ్ ప్లాట్ లు పండుతాయి. అయితే దురదృష్టవశాత్తు ఈ సినిమా లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడే తేలిపోయింది. ఏదో మొక్కుబడిగా ఉన్నట్లున్నాయి సీన్స్. అలాగే క్లైమాక్స్ కూడా సినిమాకు ప్లస్ అవ్వాల్సింది మైనస్ గా మారింది. క్లైమాక్స్ లో తీవ్రత లేకపోవడంతో చూసేవారు పెద్దగా ఎగ్జైట్మెంట్ ఫీలవ్వక అసంతృప్తికి దారితీసింది.

తెలివైన ఆలోచన

ఇంక ఈ సినిమా మార్కెట్ కోసం నిర్మాతలు ఎంచుకున్న మార్గం మాత్రం మెచ్చుకోదగ్గది. అనుష్క నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అంటే ..ఈ రేంజి బడ్జెట్ కు వర్కవుట్ అవుతుందో లేదో అని మళయాళ ఆర్టిస్ట్ లను తెచ్చి పెట్టుకుని సినిమాని లాగారు. ఆశాశరత్, ఉన్ని ముకుందన్, జయరామ్ ..వీళ్లు ముగ్గురూ మళయాళంలో మార్కెట్ ఉన్నవాళ్లే కావటం విశేషం.

ఏ డిపార్టమెంట్..ఎలా

ఇక ఇలాంటి సినిమాలు కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం . అవి రెండూ ఈ సినిమా కు అద్బుతంగా కుదిరాయి. దాంతో హర్రర్ సీన్స్ కు నిండుతనం వచ్చేసింది. దర్శకుడుగా అశోక్ సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేసారు. హర్రర్ సీన్స్ మాత్రమే కాదు ట్విస్ట్ రివీల్ అయ్యే సీన్స్ సైతం బాగా బలంగా డిజైన్ చేసుకున్నాడు. అయితే సినిమాలో అనుష్క లవ్ ట్రాక్ మాత్రం చాలా పూర్ గా ఉంది. అలాగే డైలాగులు సైతం సినిమాకు పెద్దగా కలిసిరాలేదు. సోసో గా ఉన్నాయి. ఎడిటింగ్..ఫస్టాఫ్ పరుగెత్తినట్లుగా..సెకండాఫ్ లో షార్ప్ గా లేదు. ఇక హైలెట్స్ లో స్పెషల్ గా చెప్పుకోవాల్సింది..ర‌వీంద‌ర్ ఆర్ట్ వ‌ర్క్ . ఈ క‌థ మొత్తం ఆర్ట్ వ‌ర్క్‌ పై ఆధారపడి ఉందంటే అతిశయోక్తి కాదు. ఇక నటీనటుల్లో అనుష్క ..సినిమాని సింగిల్ హ్యాండ్ తో మోసేసింది. చంచలగా,భాగమతిగా ఆమె ఆ పాత్రల్లో ఒదిగిపోయింది.

ఫైనల్ థాట్

పోస్టర్ చూసి, ట్రైలర్ చూసి ఓ సినిమాని అంచనా వేయలేం అని మరో సారి ప్రూవ్ అయ్యింది. హర్రర్ సినిమా అనుకుని వెళ్లేవారు..ఇది పూర్తి హర్రర్ కాదు అని ముందే ఫిక్స్ అయి వెళితే...కాలక్షేపంగా చూసేయచ్చు.

ADVERTISEMENT
ADVERTISEMENT