కొంత కిరాక్,కొంత చిరాకు..( ‘కిరాక్ పార్టీ’ మూవీ రివ్యూ)
అప్పుడెప్పుడో జరిగిన సంగతి. ఆ రోజుల్లో ఎన్టీఆర్ 'రాముడు-భీముడు' సూపర్ హిట్. ఆ తర్వాత ఆ సినిమా హిందీలో 'రామ్ అవుర్ శ్యామ్' అని రీమేక్ చేస్తే సూపర్ హిట్టైంది. అది జరిగిన కొంతకాలానికి ఆ సినిమాని చూసిన ఓ పెద్ద హిందీ నిర్మాతకు ఓ ఐడియా వచ్చింది. రాముడు-భీముడు ని ఫిమేల్ వెర్షన్ చేస్తే...ఎలా ఉంటుందని అంతే సీతా అవుర్ గీతా సినిమా వచ్చింది. అదీ సూపర్ హిట్. దాన్ని సీతా అవుర్ గీతా రైట్స్ కోసం తెలుగు వాళ్లు వెళ్లి తెచ్చుకుని గంగ-మంగ అంటూ రీమేక్ చేసారు. అలా మన కథే మళ్లీ కొంతకాలానికి తిరిగి తిరిగి మన దగ్గరకి మళ్లీ వచ్చింది. ఇప్పుడీ పాత తెలుగు సినిమా చరిత్ర ఎందుకు తవ్వు కోవాల్సి వచ్చింది అంటే ఈ సినిమా చూస్తూంటే మళ్లీ అలాంటి ఫీటే రిపీట్ అయ్యిందనిపించింది కాబట్టి. అదెలా అంటారా... రివ్యూ చదవిన తర్వాత మీకే అర్దం అవుతుంది..
ఈ పార్టీ కథ ఇదే
ఇంజనీరింగ్ లో జాయిన్ అయిన కృష్ణ (నిఖిల్ సిద్ధార్థ్) ఫస్ట్ ఇయర్ జాయిన్ అవగానే ...పెద్ద గా టైమ్ వేస్ట్ చేసుకోకుండా... తన సీనియర్ మీరా (సిమ్రాన్ పరింజ)తో ప్రేమలో పడిపోతాడు. ఆ తర్వాత ఆమెను గెలవటం కోసం కాలేజీలో యుద్దాలు, రకరకాల విన్యాసాలు గట్రా చేసి ఇంప్రెస్ చేసి..ఫైనల్ గా ఆమెను పడేస్తాడు. అంతా సవ్యంగా జరుగుతోంది అనుకున్న సమయంలో ఓ యాక్సిడెంట్ లో మీరా చనిపోతుంది. దాంతో కృష్ణ ప్రపచం ఒక్కసారిగా తిరగబడుతుంది..మనస్సు మొద్దుబారిపోతుంది. పైనల్ గా కృష్ణగా మొరటోడుగా రౌడీగా మారిపోతాడు. ఎలక్షన్స్ ..గొడవలు అంటూ తిరుగుతూంటాడు.
అలా రఫ్ అండ్ టఫ్ గా మారి ఎప్పుడూ గొడవలు పడే కృష్ణ లో జూనియర్ స్టూడెంట్ సత్య (సంయుక్త హెగ్డే) కి ఓ హీరో కనపడతాడు. దాంతో అమాంతం ఆమె..కృష్ణతో ప్రేమలో పడుతుంది. (ఇక్కడే గొప్ప జీవిత సత్యం మనకు అర్దమవుతుంది.. సున్నితంగా,సరదాగా ఉండే హీరో ని ఎవరూ ప్రేమించరు. తనే ...నేను ప్రేమిస్తున్న్నాను అని వేరొకరి వెంటబడాల్సిన పరిస్దితి..అదే రఫ్ గా వీధి రౌడీలా తయారైతే అతనికి పిచ్చ ఫాలోయింగ్..అమ్మాయిల ప్రపోజల్స్ ..సూపర్ కదా .)
ప్రేమించిన పాపానికి సత్య... ఓ భాధ్యని భుజాన వేసుకుంటుంది. కృష్ణ గతం తెలుసుకుని అతన్ని మామూలు మనిషి చేయాలని ప్రయత్నం చేస్తుంది. మరి కృష్ణ ఆమె ప్రేమను ఓకే చేస్తాడా...తిరిగి అతను పాత కృష్ణ(సూపర్ స్టార్ కృష్ణలా కాదు) అయ్యాడా, ఈ సినిమాకు ‘కిరాక్ పార్టీ’అనే టైటిల్ ఎందుకు పెట్టారు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. లేదా కొద్దిగా సినిమా అనుభవం రంగరించి ఆలోచిస్తే గెస్ చేసేయగలరు.
కాలక్షేపానికో కిచిడి
కాలేజీ ప్రేమ కథలు ఎప్పుడూ భాక్సాఫీస్ కు హాట్ ఫేవరెట్టే. అంత మాత్రాన చూపించిన సీన్స్ చూపిస్తే ఎంత మాత్రం ఆకట్టుకోగలం. ముఖ్యంగా రీమేక్ కథలు ఎంచుకునేటప్పుడు ఖచ్చితంగా ఇలాంటి కథలు మన దగ్గర ఇంతకు ముందు వచ్చాయా అనేది చూసుకోవాలి. గతంలో కన్నడ హిట్ ఛార్మినార్ సినిమా తెలుగు రీమేక్..కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ కూడా అదే పరిస్దితి. మనం చూసేసిన కథలు, ఎమోషన్స్ కన్నడ వాళ్లు మెల్లిగా కథలుగా చేసుకుని హిట్ కొడుతున్నారు. మనం వాటిని తెచ్చుకుని రీమేక్ చేసుకుంటున్నాం. ఈ సినిమా చూస్తూంటే ఖచ్చితంగా ప్రేమమ్, హ్యాపీడేస్, శివ, నా ఆటోగ్రాఫ్ , త్రి ఇడియట్స్ వంటి సినిమాలు వరస పెట్టి గుర్తు వచ్చేస్తాయి. ఇవన్ని అందరూ చూసినవే..పెద్ద హిట్ అయ్యినవే. దాంతో పెద్దగా కనెక్ట్ కావటం కష్టమనిపించింది.
ఏయే సినిమాలతో ఈ కథ చేసారు అని సరదాగా ఓ పజిల్ గా ఈ సినిమాని చూస్తూ ఎంజాయ్ చేయాలి తప్ప విడిగా అయితే అంత గొప్పగా అనిపించదు. అలాగే ఒరిజనల్ లో ఉన్న ఫీల్ ఈ సినిమాలో మిస్సైంది. కన్నడంలో ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ తో ఆ ఫీల్ వర్కవుట్ అయ్యి పెద్ద హిట్ అయ్యింది. ఇక్కడ అదే మిస్సైంది. ముఖ్యంగా సెకండాఫ్ లో సినిమా బాగా డ్రైగా మారిపోయింది. కామెడీ కూడా ఓహో అన్నట్లుగా లేదు.. ఓకే అన్నట్లుగా అనిపించింది. దెయ్యాల బంగ్లాకు వెళ్లిన హీరో పారిపోవటం వంటి సీన్స్ ఎందుకు పెట్టారో..సినిమాకు ఎంత మాత్రం ఉపయోగమో టీమ్ కే తెలియాలి.
టెక్నికల్ గా ...
నిఖిల్ చక్కగా ఈ సినిమాలో చేసాడు. ఒరిజనల్ లో చేసిన హీరో కంటే నిఖిల్ ఇంప్రవైజ్ చేసి బాగా చేసాడనిపించింది. ముఖ్యంగా ఫస్టాఫ్ కు సెకండాఫ్ మధ్య క్యారక్టరైజన్ వేరియేషన్ బాగా చూపించాడు. హీరోయిన్స్ ఇద్దరూ అద్బుతం అని కాదు కానీ బాగా చేసారు అంతే.
కొత్త డైరక్టర్ ఎలా డీల్ చేసాడు
కొత్త దర్శకుడు నుంచి కొత్త ఆలోచనలు ఎక్సపెక్ట్ చేస్తాం. అంతేకానీ అరువు తెచ్చుకున్నట్లుగా....రీమేక్ కథతో వస్తే చెప్పుకునేదేముంటుంది. సినిమా పెద్ద హిట్ కొట్టినా ఆ క్రెడిట్ ఒరిజనల్ దర్శకుడుకే వెళ్లిపోతుంది. ఫ్లాఫ్ అయితే ..మంచి సినిమాని పాడు చేసారంటారు..ఆ రెండు కాకుండా అతని గురించి గొప్పగా మాట్లాడుకోవాలంటే..ఒరిజనల్ లో సోల్ తీసుకుని ఇంప్రవైజ్ చేస్తూ...గబ్బర్ సింగ్ లాంటి ప్రొడక్ట్ ఇస్తే..అప్పుడు అతని పేరు అంతటా మారుమోగుతుంది. కానీ ఈ సినిమాలో ఆ స్దాయి విప్లవాత్మకమైన మార్పులు అయితే ఏమీ కనపడలేదు.
ఒరిజనల్ కు సంగీతం అందించ మ్యూజిక్ డైరక్టరే తెలుగుకి చేసాడు. అయితే తెలుగు ప్రేక్షకులు టేస్ట్ వేరు.ఆ విషయం గమనించినట్లు లేడు. రీరికార్డింగ్ మాత్రం బాగుంది. ఎడిటర్ గారు మరీ సినిమా టీమ్ బాగా కష్టపడ్డారని వారిపై సానుభూతితో వ్యవహరించి..ప్రేక్షకులపై కక్ష గట్టారు. లేకపోతే ఈ రోజుల్లో ఈ రొటీన్ కథకు .. 2 గంటల 45 నిమిషాలు లెంగ్త్ ఉంచటమేమిటి.ఇక సినిమాటోగ్రఫి సినిమాకు మంచి విజువల్ లుక్ తీసుకువచ్చింది, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. చందు మొండేటి డైలాగులు ఓకే.
చూడచ్చా
పార్టీ చేసుకునేటంత సినిమా కాదు
ఫైనల్ థాట్
కన్నడ రీమేక్ లు మన తెలుగోళ్లకు కావల్సినంత కిక్ ఇవ్వటం లేదు. నిర్మాతలకూ కలిసి రావటం లేదు. ఎందుకంటే వాళ్లు మనకన్నా నాలుగైదేళ్లు వెనకపడి ఉన్నారు.